భూమి కబ్జాల బెడద.. మీ ఆస్తిని చట్టబద్ధంగా ఎలా కాపాడుకోవాలి?

by Ravi |   (  Updated:2026-05-17 01:00:45  IST  )

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న భూమి వివాదాల నేపథ్యంలో అక్రమ కబ్జాలు, నకిలీ పత్రాలు, మ్యూటేషన్ సమస్యల నుంచి మీ ఆస్తిని చట్టబద్ధంగా ఎలా కాపాడుకోవాలో తెలియజేసే విశ్లేషణ.

భూమి కబ్జాల బెడద.. మీ ఆస్తిని చట్టబద్ధంగా ఎలా కాపాడుకోవాలి?
X

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భూమి వివాదాలు రోజు రోజుకు పెరుగుతూ సామాన్యుల జీవితాలను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తులు, కష్టపడి సంపాదించి కొనుగోలు చేసిన భూములు అక్రమ కబ్జాలకు గురవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రికార్డుల గందరగోళం, నకిలీ పత్రాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా బాధితులు న్యాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

అయితే చట్టం ఈ బాధితుల పక్షాన నిలుస్తోంది. భారతీయ న్యాయ సంహిత (BNS), సివిల్ కోర్టులు, రెవెన్యూ రికార్డులు, భూభారతి వంటి వ్యవస్థలను సకాలంలో వినియోగించుకుంటే మీ భూమిని కాపాడు కోవడం సాధ్యమే. అక్రమ ఆక్రమణ ఎదురైనప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎవరిని సంప్రదించాలి? ఏ పత్రాలు కీలకం? అనే అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ఇప్పుడు ప్రతి భూ యజమానికి అత్యవసరం.

చట్ట పరంగా హక్కులు..

మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ భూమిలోకి ప్రవేశిస్తే BNS సెక్షన్ 329 కింద పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. బెదిరింపులు లేదా ప్రాణహాని ఉంటే BNS సెక్షన్ 351 కింద రక్షణ పొందవచ్చు. అయితే ఫిర్యాదు జరిగిన విషయాన్ని వివరంగా రాయడం అవసరం. పోలీసులు కేసు నమోదు చేయకపోతే పై అధికారులను లేదా కోర్టును ఆశ్రయించవచ్చు. ఇక నకిలీ భూ‌పత్రాలు సృష్టిస్తే BNS సెక్షన్ 336 కింద ఫిర్యాదు చేసి వారిని చట్టం ముందు నిలబెట్టవచ్చు. చట్టం కల్పించిన ఈ రక్షణ కవచాలను ఉపయోగించుకోవడం బాధితుల ప్రాథమిక బాధ్యత. కేవలం పోలీసుల ఫిర్యాదుతోనే సరిపెట్టకుండా, భూమిపై మీ హక్కును నిరూపించుకోవ డానికి సివిల్ కోర్టును ఆశ్రయించడం శ్రేయస్కరం. భూమిపై హక్కు రక్షణ కోసం సివిల్ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ పొందితే వివాదం ముగిసే వరకు మీ భూమిని ఎవరూ తాకలేరు. అలాగే పొసెషన్ సూట్ ద్వారా మీ స్వాధీనం తిరిగి పొందే వీలుంది. కోర్టుకు వెళ్లడానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) ద్వారా ఉచితంగా న్యాయవాది సహాయం, కోర్టు ఖర్చులు పొందే వీలుంది. న్యాయపరమైన చిక్కుల వల్ల భూమి చేజారి పోకుండా ఉండాలంటే ఈ వేదికలను సకాలంలో ఆశ్రయించడం ఉత్తమం.

అక్రమ మ్యూటేషన్లు ఆపడానికి..

రెవెన్యూ రికార్డుల కోసం ముందుగా తహసీల్దార్ కార్యాల యంలో 10(1) రిజిస్టర్ లేదా ROR పత్రాలు పరిశీలించాలి. అక్కడ వివరాలు లభించకపోతే భూభారతి డిజిటల్ రికార్డులు ఉపయోగపడతాయి. ఇంకా సమాచారం కోసం జిల్లా కలెక్టరేట్ రికార్డ్ రూమ్‌లో సేత్వార్, ఖాస్రా పహానీ వంటి పాత పత్రాలు వెతకవచ్చు. భూమి సరిహద్దులు, విస్తీర్ణం తెలుసుకోవడానికి సర్వే, భూ రికార్డుల కార్యాలయం సహాయం తీసుకోవడం మంచిది. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ రికార్డులు మానవ తప్పిదాలను తగ్గించి, భూమి హక్కులకు భద్రతను కల్పిస్తాయి. భూమి రిజిస్ట్రేషన్ వివరాల కోసం SROలో EC (ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్) తీసుకుంటే భూమి గత చరిత్ర తెలుస్తుంది. తహసీల్దార్‌కు ఫిర్యాదు ఇచ్చి అక్రమ మ్యుటేషన్లు ఆపించవచ్చు. భూ భారతి రికార్డుల్లో తప్పులు ఉంటే సవరణ కోరే హక్కు మీకు ఉంది. అధికారులు స్పందించకపోతే ఆర్టికల్ 226 కింద హైకోర్టులో రిట్ పిటిషన్ వేయవచ్చు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం లేదా అక్రమాలపై పై అధికారులకు ఫిర్యాదు చేసి హక్కులను రక్షించుకోవచ్చు. రికార్డులలో పేర్లు మార్చడం అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ కాబట్టి, ముందస్తుగా అభ్యంతరం తెలపడం వల్ల పెద్ద ప్రమాదాలను తప్పించవచ్చు.

భూమి స్థితిగతులు గమనిస్తుండాలి..!

సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కేవలం ఆక్రమణతో భూమిపై హక్కులు రావు. అన్షుమన్ సింగ్ వర్సెస్ స్టేట్' వంటి కేసుల్లో రికార్డుల నిర్వహణ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది. 'పూనా రామ్ వర్సెస్ మోతీ రామ్' కేసులో చట్టబద్ధమైన పత్రాలే యాజమాన్యానికి ఆధారం అని స్పష్టం చేసింది. కాబట్టి పాత రికార్డులు సేకరించడం కొంచెం కష్టమైనా, అవి మీ భూమిని కాపాడే కవచంలా పని చేస్తాయి. చిరిగిపోయిన పాత పత్రాలను కూడా కోర్టులు ఆధారాలుగా స్వీకరిస్తాయి. ముఖ్యంగా 30 ఏళ్లకు పైబడిన పత్రాలు, కోర్టులో బలమైన సాక్ష్యాలుగా పని చేస్తాయి. తహసీల్దార్ కార్యాలయంలో మీ భూమి స్థితిగతులను ఎప్పటి‌కప్పుడు గమనిస్తూ ఉండటం అవసరం. అధికారులు రికార్డులు లేవని చెబితే వాటి వివరాలు లిఖితపూర్వకంగా అడగాలి. ఆ సమాచారం భవిష్యత్తులో మీకు బలాన్ని ఇస్తుంది. సరైన ఆధారాలు, చట్టంపై అవగాహన, పట్టుదల ఉంటే భూమి హక్కులను రక్షించుకోవచ్చు.

-​డా. కట్కూరి

న్యాయ నిపుణుడు

94909 34520

Next Story