ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో

by Ravi |   (  Updated:2026-06-05 00:31:03  IST  )

తెలంగాణలో 46 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు, చెట్ల నరికివేత, కాంక్రీటీకరణ, కాలుష్యం వంటి కారణాలపై విశ్లేషణ. పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి చెట్ల పెంపకం, చెరువుల సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, ప్లాస్టిక్ నియంత్రణ వంటి చర్యల అవసరాన్ని చర్చించే కథనం.

ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో
X

ఈ వేసవిలో తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో 46 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి ప్రధాన కారణంగా ఎల్‌నినో ప్రభావాన్ని పేర్కొంటున్నారు. ఎల్‌నినో అంటే, పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కి, గాలుల దిశలు మారడం వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. 1876–78 మధ్యకాలంలో వర్షాభావం కారణంగా తీవ్ర కరువు సంభవించి, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి పరిస్థితులు మళ్లీ ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. వాతావరణ మార్పులకు మానవ తప్పిదాలు కారణమవుతున్నాయి. పార్కులు, చెరువుల ఆక్రమణ, చెట్ల నరికివేత, కాలనీలలో పచ్చదనం లేకపోవడం, ప్రతి ఇంటి ఆవరణ కాంక్రీటీకరణ కావడం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అదే విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్లక్ష్యంగా పారవేయడం వల్ల డ్రైనేజీలు మూసుకుపోయి, భారీ వర్షాల సమయంలో వరదలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వాల ప్రణాళికా లోపాలు కూడా పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. నగరాల అభివృద్ధిలో జనజీవన ప్రమాణాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం, వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరగడంతో వాతావరణ కాలుష్యం అధికమవుతోంది. ఆర్థిక వృద్ధి కోణం లోంచి తప్ప జనజీవన ప్రమా ణాల ఆధారంగా ఉన్న నగరాల బాగోగులను పట్టించుకోని ప్రభుత్వాల లోపభూయిష్టమైన విధానాల ఫలితంగా ప్రజల బతుకులు నరకప్రాయంగా మారుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మురికికూపాలుగా మారిన నగరాల్లో 35% పైగా ఇండియాలోనే ఉన్నట్లు పరిశోధనలు చెప్తున్నాయి. భారతీయుల ఆయుర్దాయం సగటున మూడున్నరేళ్లు తరిగిపోయింది. ఈ పరిస్థితులను అధిగమించాలంటే చెట్ల పెంపకం, చెరువుల సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ వంటి చర్యలు అవసరం. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, ప్రణాళికాబద్ధమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రజల్లో కూడా పర్యావరణ పరిరక్షణపై అవ గాహన, బాధ్యత పెరగడం అత్యవసరం.

(నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా)

-పి. వి. వి. ప్రసాద్

8019608475

Next Story