ఫ్యానిజం నేర్పిన గుణపాఠాలు..

by Ravi |   (  Updated:2025-06-12 00:45:40  IST  )

మనుషులలో భావోద్వేగం ఉండటం సహజం. కానీ అది మానవత్వం మరిచిపోయే స్థాయికి చేరితే, అనర్థమే మిగులుతుంది. అభిమానం

ఫ్యానిజం నేర్పిన గుణపాఠాలు..
X

మనుషులలో భావోద్వేగం ఉండటం సహజం. కానీ అది మానవత్వం మరిచిపోయే స్థాయికి చేరితే, అనర్థమే మిగులుతుంది. అభిమానం అనేది ఆనందాన్ని పంచాల్సిందే గానీ ప్రాణాలు కోల్పోయే విషాదానికి దారి తీయకూడదు. మనిషి తన మతిస్థిమితం కోల్పోతే, సమూహం ఒక అజ్ఞాత శక్తిగా మారి తనను తానే మింగేస్తుంది. తొందరపాటు, ఎగబడి ముందుకు వెళ్లాలనే ఆతృతే కొందరి జీవితాలను నలిపేస్తోంది. విజయం, సెలబ్రేషన్, స్టార్ ఫాలోయింగ్ అన్నీ ఉండాలి కానీ వాటికి ఓ హద్దు ఉండాలి. మనలో ఒకరు జాగ్రత్తగా ఉంటే, మరొకరి ప్రాణాన్ని రక్షించవచ్చు. ప్రతి సంఘటన వెనుక మనల్ని ఆలోచింపజేసే బాధ, బాధ్యతా రహితపు బలిదానం దాగి ఉంటుంది.

మూర్ఖత్వాన్ని గ్లామర్ చేస్తే..

ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు కేంద్ర బిందువుగా మారిన రెండు ఘోర సంఘటనలు మన సమాజంలో ఫ్యాన్ కల్చర్ ఎలా ప్రాణాంతకంగా మారుతుందో చూపించాయి. ఒకటి బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సక్సెస్ మీట్ సందర్భంగా, రెండవది సంధ్య థియేటర్‌లో ‘పుష్ప- 2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలు.. ఈ రెండు ఘటనల్లో కలిపి 12 మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. పరవశత, ప్యాషన్ అనే పేర్లతో మూర్ఖ త్వాన్ని గ్లామర్ చేస్తే, ప్రతిఫలం శోకమే అవుతుంది. ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్లో కప్పు గెలవడంతో అభిమానుల్లో సంబరాలు మితి మీరాయి. రోజు వ్యవధిలో చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవం కోసం సుమారు 3 లక్షల మంది అభిమానులు గుమిగూడారు. నియంత్రణ లోపించడంతో తొక్కిసలాట జరిగింది. ఈ హడావిడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.. మ్యాచ్ గెలవడం ఆనందంగా ఉందనుకుంటున్న మనం, అది కొందరి ఇంట్లో శోకం తెచ్చిందన్న విషయం ఊహించగలమా? ఇక పుష్ప-2 సందర్భంగా అభిమానుల తాకిడి ఎక్కువై గందరగోళం ఏర్పడి, రేవతి అనే మహిళ తొక్కిసలాటలో మరణించింది. పై ఘటనలు రెండూ ఫ్యానిజం అనే మూర్ఖమైన కల్చర్ వల్ల బలైన గాథలు..

ఇప్పటికీ నేర్చుకోకపోతే..

ఈ విషయంలో మీడియా, సోషల్ మీడియా కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి. ఎందుకంటే హైప్ పెంచే ప్రచారాల వల్ల ప్రజల్లో అసహజమైన అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇది అభిమానుల్లో ఒక రకమైన మానసిక ఒత్తిడికీ దారి తీస్తోంది. పై రెండు ఘటనల నుండి మనం నేర్చుకోకపోతే మరెన్నో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక విషయాలను మనం ఆలోచించాలి. ఫ్యాన్ కల్చర్ మితిమీరే స్థాయికి చేరకూడదు. అభిమానం ఉంటే చాలు, అవమానం వద్దు. ప్రాణం మీదకు తెచ్చే ఉత్సాహం ఎంత ప్రమాదకరమో గ్రహించాలి. భారీ జన సముదాయాల మధ్య ఈవెంట్ నిర్వహించడానికి తగిన భద్రతా ప్రణాళికలు, ఎమర్జెన్సీ మార్గాలు ఏర్పాటు చేయాలి. అలాగే సెలబ్రిటీలు అభిమానులను అహంకారంగా కాకుండా, బాధ్యతతో ప్రేరేపించాలి. అభిమానాన్ని ఆనందంగా మార్చే మార్గాల్లో వారిని నడిపించాలి. ఈ సంఘటనలు మనకిచ్చే సందేశం ప్రాణాన్ని అభిమానంతో కొలవలేం. అభిమానానికి ఉత్సాహం అవసరం, కానీ అది మితిని మించకూడదు. రేవతి లాంటి తల్లులు, చిన్నస్వామి స్టేడియం వద్ద ప్రాణాలు కోల్పోయిన యువకులు... వీరంతా మనం సమాజపు బాధ్యతలు విస్మరించి చేసిన హత్యలు..

పెండెం సుమంత్

90593 24753

Next Story