యూరియా యాప్ ఆవిష్కరణ సరే.. అవగాహన ఎక్కడ?

by Ravi |   (  Updated:2026-02-22 00:31:14  IST  )

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా బుకింగ్ నమోదు కోసం ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ ఆవిష్కరించింది. ఆవిష్కరణ ముఖ్యమే కావచ్చు కాని దాని వినియోగం పట్ల రైతులకు ఏ మేరకు అవగాహన కల్పిస్తున్నారనేది కూడా మరింత ప్రాముఖ్యతతో కూడిన అంశం.

యూరియా యాప్ ఆవిష్కరణ సరే.. అవగాహన ఎక్కడ?
X

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా బుకింగ్ నమోదు కోసం ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ ఆవిష్కరించింది. ఆవిష్కరణ ముఖ్యమే కావచ్చు కాని దాని వినియోగం పట్ల రైతులకు ఏ మేరకు అవగాహన కల్పిస్తున్నారనేది కూడా మరింత ప్రాముఖ్యతతో కూడిన అంశం. చాలా మంది రైతులకు ఎలా ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియని పరిస్థితి. సరే ఎలాగో డౌన్‌లోడ్ చేసుకున్నా.. ఎలా వాడాలో, ఎలా వివరాలు నమోదు చేసుకోవాలో తెలీక ఆందోళనకు గురవుతున్నారు.. ఏ షాప్‌లో ఏ సమయానికి యూరియా బస్తాలు అందు బాటులో ఉన్నాయో తెలుసుకోవటం పెను సవాలుగా మారింది. అడపా దడపా సమాచారం తెలిసినప్పటికీ అందులో వివరాలు నమోదు చేసేలోపే బుకింగ్స్ ముగిసిపోవటం ఇబ్బందులకు గురిచేస్తుంది. మరికొంత మంది రైతుల పట్టా పాసు పుస్తకాలకు ఫోన్ నెంబర్‌లు లింక్ లేకపోవటం తద్వారా ఓటీపీలు రాకపోవటం మళ్లీ ఫోన్ నెంబర్‌లు మార్చుకునేందుకు గ్రామ, మండల వ్యవసాయ అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏర్పడుతుంది. రైతులకు ఏదో ఒక విధంగా యూరియా అందించాల్సిన ప్రభుత్వాలు సీజన్ కొక నూతన విధి విధానాలు జారీ చేసి నూతన ఆవిష్కరణలు ప్రవేశ పెట్టడం వాటినీ రైతులు అర్థం చేసుకోవడం తలకు మించిన భారం అవుతోంది. రైతులు పూర్తి స్థాయిలో అక్షర జ్ఞానం లేని వారూ.. చరవాణిల వాడకం పట్ల పరిజ్ఞానం లేని రైతుల స్థితి అగమ్య గోచరంగా దాపురించింది. తుమ్మే లోపు ఖాతాలు ఖాళీ చేసే సైబర్ క్రైమ్ నేరస్థులున్న ఈ రోజుల్లో ఇలాంటి యాప్‌లు యూరియా కోసం ఆవిష్కరించడం ఎంత వరకూ సమంజసమో ప్రజా ప్రతినిధులు ఆలోచించాలి. ఆవిష్కరణ ముఖ్యమే కావచ్చు.. కానీ నూతన పరిజ్ఞానం ఆకళింపు చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆవిష్కరణల పట్ల రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గ్రామ పంచాయితీ పరిధిలో గ్రామ సభల ద్వారా మండల గ్రామ వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో రైతులకు పూర్తి స్తాయిలో అవగాహన కార్యక్రమాలు మరింతగా సరళీకృత పరిచి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

-ధని ముదిగొండ

96661 09616

Next Story