ప్రజా రవాణానే.. సమాజానికి మేలు

by Ravi |   (  Updated:2026-05-16 00:31:00  IST  )

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పెరుగుతున్న ఇంధన ధరలు ప్రజల జీవన వ్యయాన్ని మరింత భారంగా మారుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజా రవాణా వినియోగం ఎందుకు అవసరమో విశ్లేషించే వ్యాసం.

ప్రజా రవాణానే.. సమాజానికి మేలు
X

ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో నెల కొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవ స్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చమురు ఉత్పత్తి, సరఫరాలో తీవ్ర ఇబ్బందులు కలగటమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలపై ఎక్కువగా పడుతోంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటి ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు నడ్డి విరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇంధన ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరిగి, కూరగాయల నుంచి ఇతర అవసరాల వరకు ప్రతి వస్తువు ధర పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రజల జీవన పరిస్థితులు మరింత క్లిష్టంగా మారడం ఖాయం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణా వ్యవస్థలను ఎక్కువగా ఉపయోగించటం సమాజానికి మేలు చేస్తుంది. బస్సులు, రైళ్లు, మెట్రో సేవలు వంటి ప్రజా రవాణా మార్గాలను వినియోగించడం ద్వారా ఇంధన వినియోగం తగ్గుతుంది. అలాగే ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం కూడా కొంతవరకు నియంత్రణలోకి వచ్చే అవకాశం వుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా ప్రజా రవాణాను ప్రోత్సహిస్తే పెరుగుతున్న ఇంధన సంక్షోభాన్ని కొంతవరకు ఎదుర్కోవచ్చు. ప్రభుత్వ రవాణా సంస్థలను లాభాల్లోకి తీసుకురావచ్చు. కాబట్టి ప్రతి పౌరుడు పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకుని అవసరమైతేనే వ్యక్తిగత వాహనాలను ఉపయోగిస్తూ, సాధ్యమైనంతవరకు ప్రజా రవాణాను ఆశ్రయించడం కాలానుగుణమైన నిర్ణయం అవుతుంది.

- గుబ్బల శ్రీనివాస్,

89066 97777

Next Story