కోటి మంది ఆశలను నెరవేర్చారు కానీ..

by Ravi |   (  Updated:2025-02-11 01:15:24  IST  )

భారత దేశంలోని ప్రజలందరూ ఎదురు చూస్తున్న 2025- 26 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రవేశ పెట్టారు. ఇది దేశ చరిత్రలో అత్యున్నతమైన

కోటి మంది ఆశలను నెరవేర్చారు కానీ..
X

భారత దేశంలోని ప్రజలందరూ ఎదురు చూస్తున్న 2025- 26 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రవేశ పెట్టారు. ఇది దేశ చరిత్రలో అత్యున్నతమైన బడ్జెట్‌గా పేరు పొందింది. ఈ బడ్జెట్‌లో ధరలు తగ్గే అంశాలను ప్రముఖంగా ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. అవి ప్రజలకు మేలు కలిగించేదిగా ఉన్నవి. అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 36 రకాల ప్రాణాధార ఔషధాల ధరలు తగ్గించారు. ఇక దేశంలోని వేతన జీవులకు, మధ్య తరగతి ఆదాయ వర్గీయులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న తీపి కబురును ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

2014 తర్వాత చూస్తే, ప్రస్తుతం ప్రకటించిన శ్లాబులే మధ్య తరగతికి పెద్ద ఉపశమనం. కొత్త ఆదాయ పన్ను విధానంలోనే ఈ పన్ను రేట్లు ఉంటాయి. అయితే ఈ మార్పు ఫలితంగా మధ్య తరగతి వారి చేతిలో మిగులు మొత్తం పెరిగే అవకాశాన్ని ఆర్థిక మంత్రి కల్పించారు. అన్ని వస్తువులు, సేవల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పన్ను మినహాయింపు మొత్తాన్ని పెంచితే బాగుంటుందనే వారి ఆకాంక్షను నిజం చేశారు. అయితే ఇది కోటి మంది ఆశలనే నెరవేర్చగా, దగ్గర దగ్గర వంద కోట్ల మందికి ఈ బడ్జెట్‌లో నిరాశే మిగిలింది.

రాజ్యాధికారం బ్రిటిష్ వారి నుండి..

ఈ సందర్భంగా డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ 1930 నవంబర్‌ 20న రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ ప్రసంగంలోనే ఇలా చెప్పారు. ‘మాకు తెలుసు. రాజ్యాధికారం బ్రిటీష్‌ వాళ్ల నుండి, మా అస్తిత్వంపైన ఆర్థిక, సాంఘిక, మతపరమైన ప్రభావాన్ని పెద్ద ఎత్తున కలిగించగల వర్గం చేతుల్లోకి మారుతున్నది. స్వరాజ్య భావన మాలో చాలామందికి గతంలోని హింస, పీడన, అత్యాచార పర్వాలు గుర్తుకు తెస్తున్నప్పటికీ, అవి పునరావృత్తమవుతాయేమోనన్న భయం పీడిస్తున్నప్పటికీ మేం స్వరాజ్యం రావాలని కోరుకుంటున్నాం. దేశంలోని మిగతా జనంతో పాటు ఈ దేశ పాలనలో తగిన నిష్పత్తిలో మాకు స్థానం లభిస్తుందన్న నమ్మకంతో అనివార్యంగా ఎదురయ్యే పరిస్ధితులను ఎదుర్కొనేందుకు మేం సంసిద్ధమై ఉన్నాం. కాలం ఏమైనా చమత్కారం చేస్తుందేమోనన్న ఆశతో అణగారిన వర్గాలు ఇప్పటికే సుదీర్ఘకాలంపాటు ఎదురుచూశాయి. ప్రాతినిధ్య ప్రభుత్వానికి మరిన్ని అవకాశాలు పెరిగే చర్చ బ్రిటిష్‌ ప్రభుత్వం తీసుకున్న ప్రతిసారీ అణగారిన వర్గాల ప్రజలు ఒక పద్ధతి ప్రకారం పక్కకు నెట్టేయబడ్డారు. ఇక ఈ ధోరణిని భరించగలిగే స్ధితిలో మేం లేమని నొక్కి చెబుతున్నాను. మా భవిష్యత్‌ని పాలకుల సానుభూతి, దయాదాక్షిణ్యాలపై వదిలివేయరాదు’ అని ప్రసంగించారు..

అంబేడ్కర్ హెచ్చరిక నిజమే అయిందా?

డా॥బి.ఆర్‌.అంబేడ్కర్‌ దీర్ఘదర్శి ఆయన భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందే రాబోయేది అగ్రవర్ణాల రాజ్యమని గమనించారు. అందుకే ఆయన ఎస్సీ,ఎస్టీ, బీసీలకు మేలు జరగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు మెండుగా ఇవ్వాలని పబ్లిక్‌ సెక్టార్‌ను విస్త్రృతం చేయాలని కోరుకున్నారు. అందుకు భిన్నంగా కార్పోరేట్‌ సెక్టార్‌ను, ప్రభుత్వ భూము లను, కంపెనీలను, పరిశ్రమలను ధారాతత్త్వం చేసే విధానాలను ఈ బడ్జెట్‌ నివేదిస్తుంది. ముఖ్యంగా దళితుల జీవన వ్యవస్ధలోనే పునరుజ్జీవింపజేసే విద్యా, ఉద్యోగం, భూమి పంపకం పట్ల నిరాసక్తతగా ఈ బడ్జెట్‌లో వుంది. స్త్రీల విధానం సంశక్తిని కుటీర పరిశ్రమల ద్వారా వినియోగించుకునే విధానం కూడా ఇందులో లేదు. ప్రధానంగా స్త్రీలు భారతదేశంలో 50% ప్రజలు నిరక్షరాసులుగా వున్నారు. చాలా మంది స్త్రీలు నిరక్షరాస్యులుగా ఉండటం వలన వారు తమకున్న కొద్ది మిగులు ధనాన్ని కూడా తమ జీవాభివృద్ధికి ఉపయుక్తం చేసుకోలేక పోతు న్నారు. మరో వైపు యువత మత్తుమందుల్లో తూగు తోంది. యువత తాము చదువుకున్న చదువుకు సరైన ఉద్యోగం లేక నిరుత్తరులు అవుతున్నారు. ఈ దశలో ఈ బడ్జెట్‌లో వారికి కనీసం ఉపకార వేతనాన్ని కలిగించవలసిన బాధ్యతను పాలకవర్గం మరచిపోయింది.

రాజ్యాధికారమే దళితుల మార్గం

దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాడటం తప్ప మరొక మార్గం లేదు. అందుకే అంబేడ్కర్‌ రాజ్యాధికారమే ప్రధానమైన ‘కీ’ అని చెప్పారు. ఇక అధీన భావం నుండి బయటపడి రాజ్యాధికారం వైపు నడవడమే ఈ బడ్జెట్‌ దళిత బహుజనులకు చేస్తున్న హెచ్చరిక. ఈ హెచ్చరిక నుండి మేల్కొని, తమ ఓటు హక్కును అమ్ముకోకుండా ప్రజలు నీతిగా నిజాయితీగా నిలబడి రాజ్యాంగ స్ఫూర్తితో దేశీయ వనరులు దేశానికే. దేశంలోని శ్రమశక్తిని మానవ వనరులను సమన్వయం చేసుకొని దేశ ప్రగతికి అందరం పూనుకోవలసిన చారిత్రక బాధ్యత వుంది. డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ దేశ సౌభాగ్యం కోసం, దేశ పురోభివృద్ధి కోసం రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగ ప్రతిఫలనం ప్రజా చైతన్యం మీదే ఆధారపడి వుంది. రాజ్యాంగమే భారతదేశ అభ్యుదయానికి గీటురాయి. ఆ దిశగా నడుద్దాం.

- కత్తి పద్మారావు

98497 41695

Next Story