- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
The Girlfriend: మగాధిపత్యానికి గట్టి చెంపపెట్టు
ఆడదాన్ని తమ ఆస్తిగా, తమ కంట్రోల్‌లో ఉంచుకోవాల్సిన ఒక వస్తువుగా, తమకు అన్నీ చేసిపెట్టే యంత్రంగా భావించే చాలా మంది మగాళ్లకు చెంప పెట్టులాంటి సినిమా ‘ది గర్ల్ ఫ్రండ్’. శీలాన్ని ఆడదానికి మాత్రమే ఆపాదించే సమాజానికి ఇదో చురక..

ఆడదాన్ని తమ ఆస్తిగా, తమ కంట్రోల్‌లో ఉంచుకోవాల్సిన ఒక వస్తువుగా, తమకు అన్నీ చేసిపెట్టే యంత్రంగా భావించే చాలా మంది మగాళ్లకు చెంప పెట్టులాంటి సినిమా ‘ది గర్ల్ ఫ్రండ్’. శీలాన్ని ఆడదానికి మాత్రమే ఆపాదించే సమాజానికి ఇదో చురక..
ఆడవాళ్ల బాధను ఆవిష్కరించి..
టాక్సిక్ రిలేషన్స్‌ని, అలాంటి బంధాల్లో నలిగిపోయే ఆడవాళ్ల బాధను ఈ సినిమా ఆవిష్కరించింది. అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలే కాదు వాళ్లను పెంచే తల్లిదండ్రులు కూడా పునరాలో చించుకోవాలని గట్టిగా చెబుతుంది. మొదట్లో చాలా నార్మల్‌గా కనిపించే భూమా (రష్మిక), విక్రమ్ (దీక్షిత్) పాత్రలు ముందుకు పోయే కొద్దీ పొరలు పొరలుగా రివీల్ అవుతుంటాయి. బిడియం, భయం భూమా లక్షణాలైతే విక్రమ్ చురుగ్గా ఉంటాడు. కంట్రోలింగ్ ఆటిట్యూడ్ ఇద్దరూ జెండర్ స్టీరియోటైప్స్‌కి ప్రతీకలుగా కనిపిస్తారు. ఆ ఇద్దరి ప్రవర్తనకు చిన్నప్పటి సంఘటనలను కారణాలుగా ఎస్టాబ్టిష్ చేయడంలో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ సక్సెస్ అయ్యాడు. విక్రమ్‌తో రిలేషన్‌లో ఉన్నా భూమాకి అతనంటే ఒకలాంటి విముఖత. అలా చూపబట్టే చివరలో తన తిరుగుబాటుకు మనందరి మద్దతూ దొరుకుతుంది.
దీక్షిత్ శెట్టి.. అదనపు బలం
నేషనల్ క్రష్‌గా దేశమంతా చుట్టేసి వచ్చిన రష్మిక 22 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్‌గా మళ్లీ చాలా ఫ్రెష్‌గా కనిపించింది. క్లైమాక్స్‌లో అయితే విశ్వరూపం చూపించేసింది. ఈ సినిమాకి మరో బలం దీక్షిత్ శెట్టి. అతని టాలెంట్, డైనమిజం సినిమాకి మంచి ఎనర్జీ ఇచ్చాయి. ఒక ప్రేమికుడిగా ఎంత మురిపిస్తాడో నెగటివ్ షేడ్స్‌తో అంతే మండిస్తాడు. బ్రేకప్ టైంలో అతని మొహంలో కనిపించే ఎక్స్‌ప్రెషన్స్ చాలా కాలం మరువలేం. గుర్తుండిపోయే మరో క్యారెక్టర్ దుర్గ! మోడ్రన్ అమ్మాయిలకు ప్రతినిధిలాంటి ఆ క్యారెక్టర్‌లో అను ఇమ్మాన్యుయేల్ ఒదిగి పోయింది. చివరలో తన రీ-ఎంట్రీ మనల్ని ఎమోషనల్ చేసేస్తుంది. దుర్గ భూమాని సపోర్ట్ చేసే ఆ సీన్ సినిమాకే హైలైట్. మనం కూడా అక్కడే ఉన్నామా అన్నంత ఇంటెన్స్‌గాను, నేచురల్‌గాను అనిపిస్తుంది.
రోహిణి పాత్రను మరవలేం!
పిల్లలు పెద్దయ్యాక కూడా వాళ్ల మీద పెత్తనం చూపించే రావు రమేశ్ లాంటి తల్లిదండ్రులకు ఈ పాత్ర గట్టిగానే చీవాట్లు పెడుతుంది. తన కోసం తను నిలబడాల్సిన అవసరాన్ని భూమాకి అర్థమయ్యేలా చెబుతుంది. రోహిణి పాత్రను ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఐదు నిమిషాలకు మించి కనిపించని ఈ క్యారెక్టర్ మొత్తం సినిమానే మలుపు తిప్పుతుంది - క్యారెక్టరై జేషన్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా! ఆ సీక్వెన్స్‌లో ఇంటెన్సిటీ గుండెని పిండేస్తుంది. రోహిణి స్థానంలో తనని ఊహించుకుంటూ రష్మిక అద్దంలో చూసుకునే షాట్‌ని డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఎంత బ్రిలియంట్‌గా కంపోజ్ చేశాడని!
మారనిది అబ్బాయిలే!
సినిమా మొత్తంలో చున్నీ షాట్ కనీసం మూడు, నాలుగు సార్లయినా కనిపిస్తుంది. బయటికెళ్లిన ప్రతిసారీ చున్నీ వేసుకెళ్లడం భూమాకి అలవాటు. చిన్నప్పటి నుంచి సమాజం చేస్తూ వస్తున్న కండిషనింగ్ ఫలితమిది. క్లైమాక్స్‌లో భూమా చున్నీ వదిలేసి బయటికొస్తుంది- liberationకి గుర్తుగా. పాపం చాలా మంది మగ పుంగవులు ఈ సీన్‌ని ట్రోల్ చేస్తున్నారు. వీళ్లకి చిన్నప్పటి నుంచి మెడల చుట్టూ చున్నీలు బిగించి ఉండాల్సింది. అప్పుడు కానీ ఆ బాధేంటో తెలిసి వచ్చేది. అమ్మాయిలు చాలా ముందుకొచ్చేశారు, చాలా మారిపోయారు. మారనిదల్లా అబ్బాయిలే! మారలేదా, వెనకబడిపోతారంతే! ఆ తర్వాత అమ్మాయిలను ఎంతగా ట్రోల్ చేసినా, ఎంతగా డీమోరలైజ్ చేసినా ఉపయోగముండదు మరి! ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా చెప్పాలనుకున్నది స్థూలంగా ఇంతే!
- శాంతి ఇషాన్
91823 64570






