గడ్చిరోలి పోరాటం.. అభివృద్ధి పేరుతో ఆదివాసీ హక్కులకు ముప్పు?

by Ravi |   (  Updated:2026-05-31 01:00:50  IST  )

మహారాష్ట్ర గడ్చిరోలి సూరజ్‌గఢ్ ప్రాంతంలో ఇనుప ఖనిజ తవ్వకాలపై కొనసాగుతున్న వివాదం అభివృద్ధి, ఆదివాసీ హక్కులు, పర్యావరణ పరిరక్షణ మధ్య ఉన్న సంఘర్షణను వెలుగులోకి తెస్తోంది. కార్పొరేట్ పెట్టుబడులు, అటవీ హక్కులు, ప్రజాస్వామిక నిర్ణయాలపై విశ్లేషణ.

గడ్చిరోలి పోరాటం.. అభివృద్ధి పేరుతో ఆదివాసీ హక్కులకు ముప్పు?
X

అభివృద్ధి అంటే ఏమిటి? పరిశ్రమలు, గనులు, కార్పొరేట్ పెట్టుబడుల విస్తరణేనా? లేక ప్రజల జీవన ప్రమాణాలు, ప్రకృతి సమతుల్యత, రాజ్యాంగబద్ధ హక్కుల పరి రక్షణతో కూడిన సమగ్ర పురోగతేనా? మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సూరజ్‌గఢ్ ప్రాంతంలో జరుగుతున్న ఇనుప ఖనిజ తవ్వకాల వివాదం ఈ ప్రశ్నలను మరోసారి దేశం ముందుంచింది..

ఒకవైపు పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల పేరుతో భారీ మైనింగ్ ప్రాజెక్టులు ముందుకు సాగుతుండగా, మరోవైపు అడవులు, ఆదివాసీల జీవనాధారాలు, పర్యావరణం తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మహా రాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో లాయిడ్ మెటల్స్ కంపెనీ కోసం వేల ఎకరాల అడవులను నాశనం చేస్తున్నారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఈ అంశాన్ని కేవలం ‘అభివృద్ధి వ్యతిరేకత’గా చూడలేం. అలాగే కార్పొరేట్ ప్రయోజనాల కోసం అడవులు, ఆదివాసీ హక్కులను త్యాగం చేయడాన్ని ‘జాతీయ అభివృద్ధి’గా చిత్రించలేం. దీనిని సమగ్ర రాజకీయ, ఆర్థిక, సామాజిక దృష్టితో పరిశీలించాలి.

అభివృద్ధి పేరుతో..

దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం చారిత్రక అవసరం. పరిశ్రమలు లేకుండా ఉపాధి, సాంకేతిక పురోగతి సాధ్యం కాదు. అయితే ప్రశ్న ఏమిటంటే.. ఆ అభివృద్ధి ఎవరి కోసం? ఏ విధంగా? ఎవరి ఖర్చుపై? అభివృద్ధి పేరుతో స్థానిక ప్రజల జీవన హక్కులను ధ్వంసం చేయడం, రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాయడం సమర్థించలేం. గడ్చిరోలిలో అడవి కేవలం ప్రకృతి సంపద కాదు. అది ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి, ఆర్థిక ఆధారం. ఇలాంటి ప్రాంతాల్లో భారీ మైనింగ్ ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు స్థానిక ప్రజల అభిప్రాయం, గ్రామసభల నిర్ణయాలు అత్యంత కీలకం కావాలి. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్, పెసా చట్టం (PESA), అటవీ హక్కుల చట్టం (FRA) ఆదివాసీల భూమి, అటవీ హక్కులను రక్షించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. గ్రామసభ అనుమతి లేకుండా భూసేకరణ జరగకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, అనేక సందర్భాల్లో ఈ చట్టాలను పక్కనబెట్టి కార్పొరేట్ కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ప్రజల జీవనాధారాలపై మూలధన దాడి!

ఖనిజ సంపద అధికంగా ఉన్న ప్రాంతాలన్నీ ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాలే. వీటిని ‘అభివృద్ధి జోన్లు’గా ప్రకటించి పెద్ద కంపెనీలకు అప్పగించడం ద్వారా స్థానికులపై ఆర్థిక, సామాజిక ఒత్తిడి పెరుగుతోంది. అయితే ప్రజాస్వామిక శక్తులు పరిశ్రమలను పూర్తిగా వ్యతిరేకించడం లేదు. కానీ ‘ప్రజల కోసం అభివృద్ధా? కార్పొరేట్ లాభాల కోసం అభివృద్ధా?’ అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. వాతావరణ మార్పుల సంక్షోభం పెరుగుతున్న తరుణంలో జీవ వైవిధ్యానికి నిలయమైన గడ్చిరోలి అడవులను రక్షించడం దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉంది. ఒడిశాలో నియమగిరి వేదాంత ప్రాజెక్టు, ఛత్తీస్‌గఢ్‌లో హస్దేవ్ అరణ్యాల పరిరక్షణ ఉద్యమాల వలెనే గడ్చిరోలి సురజ్‌గఢ్ మైనింగ్ వ్యతిరేక పోరాటం కూడా ప్రస్తుత అభివృద్ధి నమూనాపై పెద్ద చర్చను లేవనెత్తింది. మార్క్సిజం ప్రకారం పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రకృతి, భూమి, అడవులు లాభాల కోసం వస్తువులుగా మారతాయి. కార్పొరేట్ మూలధన విస్తరణలో భాగంగానే గడ్చిరోలీలో ఇనుప ఖనిజ తవ్వకాలు జరుగుతున్నాయి. మార్క్సిస్టు దృష్టిలో ఇది ప్రజల జీవనాధారాలపై పెట్టుబడి దాడి.

స్థానికులకు స్థిర ప్రయోజనాలు దక్కవు!

పెట్టుబడిదారీ వ్యవస్థ లాభాల కోసం ప్రకృతిని, శ్రమను నిరంతరం దోచుకుంటుంది. ఇక్కడ ప్రభుత్వం తటస్థ శక్తి కాదు, అది పాలక వర్గ ప్రయోజనాలను కాపాడే యంత్రాం గం. అందుకే రాజ్యాంగ హక్కులున్నా, రాజ్యం కార్పొరేట్ ప్రాజెక్టులకు పోలీసు రక్షణ కల్పిస్తుంది. భారీ గనుల వల్ల బలవంతపు తరలింపులు, జీవనాధారాలు కోల్పోవడం, మిలిటరైజేషన్ పెరగడం, గ్రామసభల తీర్మానాలను తారుమారు చేయడం వంటివి జరుగుతాయి. స్థానికులకు తాత్కాలిక కూలీ పనులు తప్ప స్థిర ప్రయోజనాలు దక్కవు. పైగా సంప్రదాయ జీవన విధానం విచ్ఛిన్నమవుతుంది. మైనింగ్ వల్ల ఎర్రటి దుమ్ము, రసాయన కాలుష్యం, భూగర్భ జలాల క్షీణత ఏర్పడి స్థానికుల ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఇది కంపెనీకి వ్యతిరేక నిరసన కాదు!

గడ్చిరోలీ పోరాటం కేవలం ఒక కంపెనీకి వ్యతిరేక నిరసన కాదు. ఇది కార్పొరేట్ ఆధారిత పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనాకు, స్థానిక ప్రజాస్వామిక హక్కులను కాపాడే దృక్పథానికి మధ్య జరుగుతున్న పోరాటం. దీని పరిష్కారం కేవలం పర్యావరణ పరిరక్షణతో ముగియదు. సహజ వనరులపై ప్రజల నియంత్రణ, ప్రజా అవసరాల ఆధారిత అభివృద్ధి అనే విస్తృత రాజకీయ-ఆర్థిక ప్రశ్నలతో ఇది ముడిపడి ఉంది. అందుకే పరిశ్రమల స్థాపనలో స్థానికుల అంగీకారం, సరైన పునరావాసం, పర్యావరణ రక్షణ కలసి ఉండాలి. దీనిపై కార్మిక- రైతాంగ సంఘాలు, మేధావులు మరింత చైతన్యంతో దేశవ్యాప్త ప్రజా చర్చలు, ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉంది.

-జంపన్న

డెమొక్రటిక్ సోషలిస్ట్

73307 65204

Next Story