- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతన్నకు తప్పని అమ్మకం తిప్పలు!
పంట పండించడం మాత్రమే కాదు, దానిని నిల్వ చేసి సరైన ధరకు విక్రయించడం కూడా రైతులకు పెద్ద సవాలుగా మారింది. గోదాముల కొరత, గోనె సంచుల సమస్య, రవాణా భారం, కొనుగోలు కేంద్రాల ఇబ్బందులు రైతులను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఈ విశ్లేషణలో తెలుసుకోండి.

దేశంలో అత్యధిక ప్రజలకు ప్రధాన ఉపాధి, ఆదాయ వనరు వ్యవసాయమే. జనాభాలో సగానికి పైగా కుటుంబాలు నేటికీ సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఒకప్పుడు వ్యవసాయం అంటే కేవలం ‘పంట పండించడం’ వరకే పరిమితం అనుకు నేవారు. కానీ ఈ రోజుల్లో పంట పండించడం ఒక ఎత్తయితే, దాన్ని కాపాడుకుని మార్కెట్‌కు తీసుకెళ్లి మద్దతు ధరతో అమ్ముకోవడం అంతకంటే పెద్ద యుద్ధంలా మారింది. మన రాష్ట్రంలో క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతున్నప్పటికీ రైతుల సమస్యలు కూడా రెట్టింపవుతున్నాయి. ఇప్పటికే విత్తనాలు వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు అనేక సవాళ్లు ఎదుర్కొంటుండగా, గత కొన్ని సంవత్సరాలుగా పంట అమ్మకాలలో రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. గ్రామాల్లో పండిన పంటను నిల్వ చేయడానికి సరైన స్థలాలు లేకపోవడం, ఒకవేళ ఉన్నా రైతులందరి పంట పట్టేంత సామర్థ్యం లేకపోవడం తీవ్రమైన సమస్యగా మారింది. పైగా పంటను మార్కెట్‌కు తరలించడానికి కనీసం గోనె సంచులు కూడా సకాలంలో అందకపోవడం వ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతోంది. దీనికి తోడు రవాణా ఖర్చులు భారం కావడంతో రైతు మరింత కుంగి పోతున్నాడు. మరోవైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరిచినా, అక్కడ సరుకు కొనడానికి అధికారులు రకరకాల నిబంధనలు పెడుతున్నారు. పంటలో తేమ శాతం ఎక్కువగా ఉందనే నెపంతో రోజుల తరబడి రైతులను వేచి చూసేలా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో క్వింటాల్‌కు ఇన్ని కిలోల ‘తరుగు’ అంటూ రైతు శ్రమను దోచుకుంటున్నారు. ఒకవేళ నిరీక్షణలో అకాల వర్షం పడి పంట తడిస్తే, కనీసం సగం ధరకు కూడా కొనే నాథుడు కరువవుతున్నాడు. దేశ జనాభాకు అన్నం పెట్టే వ్యవసాయ రంగం ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే కేవలం సబ్సిడీలు ఇస్తే సరిపోదు. పంట పండిన తర్వాత రైతుకు అవసరమైన కోల్డ్ స్టోరేజీలు, గోదాములు వంటి మౌలిక వసతులు కల్పించినప్పుడే నిజమైన న్యాయం జరుగుతుంది. పంట అమ్ముకోవడానికి రైతులకు అన్ని విధాలా సహకరించి, మద్దతు ధరతో పాటు కొనుగోళ్లు కూడా సజావుగా, పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది.
- అలుగువెల్లి ఉభయ్ రెడ్డి
76708 93265






