ఈ పతనం ఓ గుణపాఠం

by Ravi |   (  Updated:2025-02-11 01:01:18  IST  )

రాజకీయాల్లో అవినీతిని ఊడ్చేస్తానంటూ ప్రగల్భాలు పలికి.. రాజకీయంగా అందలం ఎక్కి. అవినీతిని కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకున్న

ఈ  పతనం ఓ గుణపాఠం
X

రాజకీయాల్లో అవినీతిని ఊడ్చేస్తానంటూ ప్రగల్భాలు పలికి.. రాజకీయంగా అందలం ఎక్కి. అవినీతిని కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకున్న ఆప్ పార్టీని ఢిల్లీ ప్రజలే ఊడ్చి పడేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన కేజ్రీవాల్ కేవలం ప్రధాని పీఠంపై కన్నేసి ఎప్పుడైతే రాజకీయాలు మొదలు పెట్టారో అప్పుడే ఆయన పతనం ప్రారంభం అయ్యిందని చెప్పాలి.

ఆయన అవినీతి వ్యతిరేక రాజకీయాలు కొనసాగించి ఉంటే కేజ్రీవాల్ రాజకీయాల్లో వజ్రంలా నిలిచేవారు. ఆయన ఢిల్లీలో పాగా వేయడంతోనే ఇక తనకు ఎదురులేదన్న రీతిలో అవినీతి పంకిలంలో కూరుకుపోయారు. ఆయన మంత్రులు, అనుచరులు, ఎమ్మెల్యేలు అంతా అందులో దిగబడ్డారు. ఆయన అనుచరగణం కూడా రాజకీయాలు నడిపింది. అవినీతి అన్నది అగ్నికణం లాంటిది. అందుకే పదేళ్లుగా అందలమెక్కించిన ఢిల్లీ ప్రజలు విసుగుచెంది ఊడ్చేశారు.

అన్నా హజారే హెచ్చరికను తోసిరాజని..

అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చేరిన కేజ్రీ వాల్ ఓటమిని ఇప్పుడు హజారేనే అభినందించే పరిస్థితి వచ్చింది. అవినీతికి దూరంగా ఉండాలని ఆయన పదే పదే హెచ్చరించినా కేజ్రీవాల్ పెడచెవిన పెట్టారు. అవినీ తి వ్యతిరేక రాజకీయాలకు తానొక బ్రాండ్ అని ప్రచారం చేసుకుని అనేక అవినీతి కేసుల్లో తానూ, తన అనుయాయులు ఇరుక్కుని విలవిల్లాడుతూ.. కేవలం మోడీని చూపి రాజకీయం చేశారు. అవినీతి చుట్టూ కేజ్రీవాల్ అల్లుకు పోయారని తెలుసుకున్న ప్రజలు ఇప్పుడు ఊడ్చేశారు. ఢిల్లీ వీధుల్లో ఒకప్పుడు సంచలనంగా మారిన అప్ ఇప్పుడు అడ్రస్ గల్లంతయ్యిందనే చెప్పాలి.

ఈ ఓటమి స్వయంకృతాపరాధమే..

రాజకీయాల్లో అవినీతి అంతం అవ్వాలంటే ఆప్ రావాలన్న పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న ఆప్ అనతి కాలంలోనే అవినీతి పార్టీగా ముద్ర వేసుకుంది. ఈ ఓటమి స్వయంకృతం. నిజాయితీగా ఢిల్లీలో పాలన చేసి ఉంటే ఆయన ప్రతిభ ఇనుమడించేది. ప్రజలు ఆదరించేవారు. కానీ అది వదిలిపెట్టి దేశమంతా తిరిగి, తానే ప్రధాని కావాలన్న దురాలోచనలో రాజకీయాలు చేసి చతికిలపడ్డ తీరు.. అవినీతిపై పోరాటం లో కాంగ్రెస్ పై యుద్ధం ప్రకటించిన కేజ్రీవాల్.. అనతి కాలం లోనే దేశ ప్రజల మనసులు గెల్చుకున్నారు. ప్రజలు రాజ కీయ నాయకుల అవినీతి పట్ల ఎంత అసహ్యంగా ఉన్నారనడానికి కేజ్రీవాల్ ఎదుగుదలే కార ణం. అనతి కాలంలోనే కేజ్రీవాల్ నిజస్వరూపం బయటపడింది. ఆయన ముసుగు తొలగింది. అవినీతికి కేంద్రంగా కేజ్రీవాల్ రాజకీయాలు నడిచాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం ఇందుకు పరాకాష్ట.

నిజాయితీ ముసుగులో అబద్ధాలు..

కాంగ్రెస్ అవినీతిని వ్యతిరేకించిన కేజ్రీవాల్.. కాంగ్రెస్ పంచనే చేరారు. ఇవన్నీ గమనిస్తూ వచ్చిన ప్రజలు రాజకీయాల్లో అబద్ధాలు చెప్పే వ్యక్తిగా గుర్తించారు. అబద్దాలు చెప్పేవారిని ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కానీ నిజాయితీగా ఉంటానంటూ అబద్ధాలు చెబితే మాత్రం సహిం చరు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు... కేంద్రం ఎంతగా కక్షకట్టి కేసులు పెట్టినా.. అవినీతి లేనిదే కేసులు చుట్టుకోవు. మోడీని నిందించినంత మాత్రాన తన అవినీతిని కప్పిపుచ్చుకోలేరు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కూడా గుణపాఠం లాంటివే. తన రాజకీయ ధోరణిని కాంగ్రెస్ మార్చుకోవలసి ఉంది. కుటుంబ రాజకీయాలు మాని, ప్రజాస్వామ్యబద్దంగా నడుచుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఎంతగా ఇప్పుడు అరిచి గీపెట్టినా ప్రజలు ఇకముందు నమ్ముతారని అనుకోవడానికి లేదు. గెలుపు కోసం అవినీతి వ్యతిరేక పోరాటాన్ని పక్కన పెట్టిన కేజ్రీవాల్, ఉచిత పథకాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో రాజకీయాలు మొదలు పెట్టారు. అవినీతి వ్యతిరేక రాజకీయాలు పక్కన పోయాయి. కేవలం తన స్వార్థ రాజకీయాలతో దేశ ప్రధాని కావడమే లక్ష్యమన్న రీతిలో ముందుకు సాగారు. పరమపద సోపాన పటంలో పెద్ద పాము మింగితే పడ్డట్లుగా కిందపడ్డారు. ఇప్పుడు ఆయన అవినీతి వ్యతిరేక మాటలు చెబితే ఇక ప్రజలు నమ్మరు. ఏం చెబితే, ఏం చేస్తే రాజకీయంగా ఎదుగగలమో కొత్తగా ఆలోచించాలి. అవినీతికి సంబంధించి మాట్లాడితే ప్రజలు ఛీత్కరించే పరిస్థితి వచ్చింది. దీంతో ఇప్పుడు కేజ్రీవాల్ పతనం కూడా ఓ రాజకీయ గుణపాఠంగా చూడాలి.

- సభావట్ కళ్యాణ్

న్యాయ విద్యార్థి

90143 22572

Next Story