అస్తిత్వ పోరాటాల అమరగాథ

by Ravi |   (  Updated:2026-06-02 00:45:43  IST  )

తెలంగాణ ఆవిర్భావం వెనుక ఉన్న ఆరు దశాబ్దాల పోరాటం, నీళ్లు-నిధులు-నియామకాల కోసం సాగిన ఉద్యమం, భాషా-సాంస్కృతిక అస్తిత్వ సాధన, అమరుల త్యాగాలు మరియు సమగ్ర అభివృద్ధి లక్ష్యాలపై ప్రత్యేక విశ్లేషణ. తెలంగాణ స్వాభిమాన విజయగాథను తెలుసుకోండి.

అస్తిత్వ పోరాటాల అమరగాథ
X

తెలంగాణ ఏర్పాటు కేవలం భౌగోళిక విభజన కాదు.. అది ఒక అస్తిత్వ పునరుద్ధరణ. నేడు తెలంగాణ యాస గర్వకారణంగా నిలుస్తోంది. బతుకమ్మ, బోనాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. అభివృద్ధి, వ్యవసాయం, ఐటీ రంగాల్లో రాష్ట్రం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తెలంగాణ సాధనతో పోరాటం ముగియలేదు.. కొత్త బాధ్యత ప్రారంభమైంది.

వివక్షపై చారిత్రాత్మక విజయం!

జూన్ 2 తెలంగాణ ప్రజలకు కేవలం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాదు. ఇది దశాబ్దాల వివక్ష, అవమానాలు, అణచి వేతలపై సాధించిన చారిత్రాత్మక విజయం. వేలాది మంది విద్యార్థులు, యువకులు, రైతులు, ఉద్యోగులు కలగన్న స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన రోజు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం మొదలైన ఈ ఉద్యమం చివరకు ఆత్మగౌరవ పోరాటంగా రూపాంతరం చెంది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఉద్యమాల్లో ఒకటిగా నిలిచింది.

నిధులపై వివక్ష – అభివృద్ధికి ఆటంకం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు ఆర్థికంగా తీవ్ర అన్యాయం జరిగిందనే భావన ప్రజల్లో బలంగా నెలకొంది. తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయం ఇతర ప్రాంతాల అభివృద్ధికి మళ్లిందనే ఆరోపణలు ఉద్యమానికి ప్రధాన ఇంధనంగా మారాయి. వివిధ కమిటీలు కూడా నిధుల కేటాయింపులపై ప్రశ్నలు లేవనెత్తాయి. తెలంగాణ ప్రజల్లో ఆర్థిక న్యాయం కోసం పోరాట స్పూర్తిని ఇది మరింత పెంచింది.

నీళ్ల కోసం సాగిన నిరంతర పోరాటం..

కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ గుండా ప్రవహిస్తున్న ప్పటికీ సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయనే అసంతృప్తి విస్తృతంగా వ్యక్తమైంది. శ్రీరాంసాగర్, జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు నత్తనడకన సాగగా, చెరువుల వ్యవస్థ క్షీణించడం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా రైతాంగం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.

నియామకాలలో అన్యాయం - యువత ఆవేదన

ఉద్యోగాల విషయంలో తెలంగాణ యువత తమకు తగిన అవకాశాలు దక్కలేదని భావించింది. ముల్కీ నిబంధనలు, జీవో 610 వంటి అంశాలు ఉద్యమ చరిత్రలో కీలక మలుపులుగా నిలిచాయి. స్థానికులకు దక్కాల్సిన ఉద్యోగాల్లో అన్యాయం జరిగిందనే అభిప్రాయం యువతలో అసంతృప్తిని పెంచి ఉద్యమంలో వారిని ముందుండేలా చేసింది.

భాష, సంస్కృతిపై అవహేళన..

తెలంగాణ ఉద్యమానికి అసలైన బలం కేవలం ఆర్థిక అంశాలు కాదు. భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలపై జరిగిన అవహేళన తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా గాయపరిచింది. సినిమాల్లో తెలంగాణ యాసను హాస్యానికి పరిమితం చేయడం, బతుకమ్మ-బోనాల వంటి పండుగలకు తగిన గుర్తింపు లేక పోవడం, తెలంగాణ చరిత్రకు పాఠ్యపుస్తకాలలో సరైన స్థానం దక్కకపోవడం ప్రజల్లో అస్తిత్వ సంక్షోభాన్ని పెంచాయి.

ఆత్మగౌరవ ఉద్యమంగా మలిదశ పోరాటం!

ఈ నేపథ్యంలో 2001లో ప్రారంభమైన మలిదశ ఉద్యమం అన్ని వర్గాలను ఏకం చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలు, కళాకారుల ఆటపాటలు, విద్యార్థుల ఉద్యమాలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాలు ఉద్యమాన్ని శిఖరాగ్రానికి చేర్చాయి. వందలాది మంది యువత బలిదానాలు తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేశాయి. చివరకు 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.

సమగ్ర అభివృద్ధి లక్ష్యం కావాలి!

తెలంగాణ సాధనతో పోరాటం ముగియలేదు.. కొత్త బాధ్యత ప్రారంభమైంది. అమరుల త్యాగాలు కేవలం చరిత్ర పుస్తకాలకే పరిమితం కాకూడదు. ఉద్యమ ఆకాంక్షలైన సమాన అవకాశాలు, యువత ఉపాధి, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి ప్రతి ఇంటికి చేరినప్పుడే ఆ త్యాగాలకు నిజమైన అర్థం లభిస్తుంది. జూన్ 2 సంబరాల రోజు మాత్రమే కాదు.. వేలాది కుటుంబాల కన్నీటి చరిత్రను గుర్తు చేసుకునే రోజు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కలల రాష్ట్రాన్ని నిర్మించడమే వారికి అందించే గొప్ప నివాళి.

-కాలగిరి శ్రీనివాస్ రెడ్డి,

90101 28884

Next Story