దునియా మెచ్చిన ఉచిత బస్సు పథకం!

by Ravi |   (  Updated:2026-01-22 01:00:29  IST  )

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వేల సంఖ్యలో సంక్షేమ పథకాలు రూపొందాయి, అమలయ్యాయి.. కానీ ఇప్పటివరకు ఇలాంటి పథకం అందరూ ఫాలో అవ్వాల్సిందే అన్నట్లుగా లేదు.

దునియా మెచ్చిన ఉచిత బస్సు పథకం!
X

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వేల సంఖ్యలో సంక్షేమ పథకాలు రూపొందాయి, అమలయ్యాయి.. కానీ ఇప్పటివరకు ఇలాంటి పథకం అందరూ ఫాలో అవ్వాల్సిందే అన్నట్లుగా లేదు. మొదటిసారిగా ఒక సంక్షేమ పథకం మాత్రం.. దునియా మొత్తం ఊపేస్తుంది. దానిపైనే అంతటా చర్చ సాగుతోంది. ఏ రాజకీయ పార్టీ ఐనా సరే ఆ పథకాన్ని ఎన్నికల హామీగా ఇచ్చే పరిస్థితి తలెత్తింది. అదే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం..

ఒకవేళ పార్టీలు హమీ ఇవ్వకపోయినా గెలిచిన తర్వాతనైనా ఆ పథకాన్ని ప్రవేశ పెడుతున్నారు. ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో అమల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం బెస్ట్ స్కీమ్‌గా పథకాల్లో ముందంజలో ఉందని చెప్పక తప్పదు.

తెలంగాణలో ఉచిత బస్సు..

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించింది. మరోవైపు మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉచిత ఆర్టీసీ బస్సు పథకం కొనసాగుతోంది. ‘స్త్రీ శక్తి’ పేరుతో ఈ పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీన్ని ప్రారంభించారు. దీని ద్వారా కోట్లాది మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందుతు‌న్నారు. ఈ పథకం అన్ని రాష్ట్రాలకు ఆదర్శమైంది. దేశంలోని చాలా రాష్ట్రాలు ఫ్రీ బస్సును ఫాలో అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. అధికారం చేపట్టిన రెండో రోజే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ముఖ్యంగా మహిళలు, ట్రాన్స్ జెండర్ ప్రయాణికులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తుంది. రాష్ట్రానికి చెందిన మహిళలకు ఆధార్ కార్డు ఉంటే చాలు.. తెలంగాణలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ గా ప్రయాణం చేయవచ్చు.

ఢిల్లీలో ప్రారంభమై..

ఈ పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ కూడా విపరీతంగా పెరిగింది. రెండేళ్ల కాలంలో ఉచిత బస్సు ప్రయాణం చేసిన వారి సంఖ్య కోట్లలో ఉంది. ఈ పథకాన్ని ప్రారంభించిన రెండేండ్లలోనే 260 కోట్ల జీరో టికెట్స్ తెగినయ్ అంటే.. ఫ్రీ బస్సుకు ఉన్న ఆదరణ ఎలాంటిదో చెప్పనక్కర్లేదు. ఇక ఫ్రీ బస్సు ద్వారా మహిళలకు రూ 8,500 కోట్లు ఆదా అయినట్లు ఆర్టీసీ అధికారుల లెక్కలు చెబు తున్నాయి. మన దేశంలో ఉచిత ప్రభుత్వ ట్రాన్స్ పోర్ట్ సిస్టం ముందుగా ఢిల్లీలోనే మొదలైంది. 2019లోనే అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ఢిల్లీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మహిళల్లో చైతన్యం, సాధికారత, విద్య, ఉద్యోగ అవకాశాలను పెంచడమే లక్ష్యంగా అప్పటి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం రవాణా ఖర్చులను తగ్గించడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది.

ఇక పురుషులకూ ఉచిత బస్సు..

మొట్టమొదటిసారి ఢిల్లీలో మొదలైన ఉచిత బస్సు పథకాన్ని తర్వాత పంజాబ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలు అందుకున్నాయి. తమిళనాడు ప్రభుత్వం కూడా మహిళలకు ఫ్రీ ఆర్టీసీ బస్సు సదు పాయాన్ని కల్పించింది. ఈ పథకాన్ని ‘జీరో టికెట్ బస్ ట్రావెల్ స్కీమ్’ పేరుతో కొనసాగిస్తోంది. 2021 మే నెలలో తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఇప్పటివరకు మహిళలు, ట్రాన్స్‌జెండర్స్, బాలికలకు మాత్రమే ఫ్రీ బస్సు సౌకర్యం ఉంది. అన్నాడీఎంకే హామీతో విస్తృత చర్చకు దారి తీసినట్లైంది. మహిళలు, టాన్స్ జెండర్స్ ఆర్టీసీ బస్సుల్లో 30 కి.మీ వరకు ఉచిత ప్రయాణాన్ని పొందవచ్చు. ఈ ఏడాదిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల మేనిఫెస్టో‌లో అన్నాడీఎంకే పార్టీ పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఇదే దేశ వ్యాప్తంగా చర్చనీయంగా మారింది.

వివిధ రాష్ట్రాల్లో పలు పేర్లతో..

కర్ణాటక‌లో శక్తి యోజన పేరుతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందిస్తున్నారు. దీన్ని 2023లో కర్ణాటకలో ప్రారంభించారు. ప్రత్యేక స్మార్ట్ కార్డు ద్వారా అక్కడి మహిళలు, టాన్స్‌జెండర్స్ ఉచిత బస్సు సౌకర్యం పొందుతున్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అందు బాటులో ఉంది. దీన్ని అక్కడి ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1న ప్రారంభించింది. జీరో టికెట్ ట్రావెల్ ఇనిషియేటివ్ పేరుతో ఫ్రీ బస్ పథకం కొనసాగుతోంది. దీని ద్వారా మహిళలు జమ్మూ & కశ్మీర్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (JKRTC) స్మార్ట్ సిటీ ఈ-బస్సులలో తమ ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. దీని ద్వారా కోట్లాది మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందుతున్నారు.

అన్ని రాష్ట్రాలకు ఆదర్శమైన పథకం!

పంజాబ్‌లో 2021 ఏప్రిల్ 1న మహిళలకు ఉచిత బస్సు సేవ పేరుతో ఫ్రీ బస్సు పథకం అమల్లోకి వచ్చింది. దీని కింద రాష్ట్ర ప్రభుత్వ బస్సుల్లో మహిళలు, బాలికలు, విద్యార్థినులు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇవేకాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రయోగాత్మకంగా సీజన్ టైంలో ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తెస్తున్నారు. ప్రత్యేకంగా ఉత్సవాలు, పండుగలు జరిగే వేళల్లో ప్రజలకు ఫ్రీ బస్సు స్కీమ్ అమల్లోకి వస్తుంది. ఈ పథకం అన్ని రాష్ట్రాలకు ఆదర్శ‌మైంది. దేశంలోని చాలా రాష్ట్రాలు ఫ్రీ బస్సును ఫాలో అవుతున్నాయి.

-రాజు కంచ

99638 01882

Next Story