- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎన్నిక తక్షణం పూర్తి చేయాలి!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల అనంతరం కో-ఆప్షన్ సభ్యుల నియామకం ఆలస్యం కావడంతో కార్యవర్గాల ఏర్పాటు నిలిచిపోయింది. దీని వల్ల న్యాయవాదుల ఎన్‌రోల్‌మెంట్, ప్రాక్టీస్, ఇన్సూరెన్స్ ప్రయోజనాలు నిలిచిపోయి న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్ ఎన్నికలను 2026 జనవరి 31లోగా పూర్తి చేయాలని గత ఏడాది చివరి నెలల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎన్నికలు నిర్వహించగా, మార్చిలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. రెండు రాష్ట్రాల్లోనూ 23 మంది సభ్యులు చొప్పున బార్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. అయితే, రెండు రాష్ట్రాలకు ఇద్దరిద్దరిని సుప్రీంకోర్టు నియమించిన హైపవర్ కమిటీ కో- ఆప్షన్ సభ్యులను నామినేట్ చేయవలసివుంది. ఈ సభ్యులకు కూడా ఓటు హక్కు ఉండటంతో మొత్తం 25 మంది సభ్యులలో ఒకరిని ఛైర్మన్‌గా ఎన్నుకోవాలి. కానీ కో-ఆప్షన్ ప్రక్రియ ఆలస్యం కావడంతో కొత్త కార్యవర్గాల ఏర్పాటు నెలల తరబడి నిలిచిపోయింది. దీని ఫలితంగా న్యాయవాదులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొత్తగా న్యాయ విద్య పూర్తి చేసిన వారు బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌మెంట్ పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. గత డిసెంబర్ నుంచి ఎన్‌రోల్ ప్రక్రియ నిలిచిపోయిందని, కొత్త పాలకవర్గాలు ఏర్పడిన తర్వాతే ఇది పునఃప్రారంభమవుతుందని సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. సభ్యత్వం లేకుండా కోర్టుల్లో ప్రాక్టీస్ చేసే అవకాశం ఉండదు. ఈ ఆలస్యంతో కొత్త న్యాయవాదులు ఆరు నెలల సీనియారిటీ కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఇన్సూరెన్స్ ప్రయోజనాలు కూడా నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక, తదుపరి ఛైర్మన్ ఎన్నికలను త్వరగా పూర్తి చేయాలి.
-తిప్పినేని రామదాసప్పనాయుడు,
72071 65577






