ఎన్నికల కమిషన్ హడావిడి.. అనుమానాస్పదమే!

by Ravi |   (  Updated:2025-07-02 00:30:45  IST  )

మన దేశంలోని ఎన్నికల ప్రక్రియలో దొంగ ఓట్లు.. ఒక రుగ్మత అయితే చాలామంది అర్హులకు ఓటు హక్కు లేకపోవడం

ఎన్నికల కమిషన్ హడావిడి.. అనుమానాస్పదమే!
X

మన దేశంలోని ఎన్నికల ప్రక్రియలో దొంగ ఓట్లు.. ఒక రుగ్మత అయితే చాలామంది అర్హులకు ఓటు హక్కు లేకపోవడం, ఓటరు కార్డు ఉన్నప్పటికీ జాబితాలో పేరులేక ఆఖరులో వెనక్కి తిరగడం మరో రుగ్మత. ఇప్పటికీ సమగ్రమైన, ఖచ్చితమైన జాబితా తయారీ దేశంలో ఎక్కడైనా ఇప్పటికీ నెర వేరని ఆదర్శమే.. లోపరహితంగా ఉన్న ఆ ప్రక్రి యను చేపట్టాలనుకోవడం ఎన్నికల సంఘంకి మొదటి బాధ్యత. ప్రస్తుత పరిస్థితుల్లో అది పెద్ద ఆదర్శమే అనుకోవాలి.. ఈ నేపథ్యంలో బిహార్‌ రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలను సవరించాలని భారత ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం తీవ్ర రాజకీయ చర్చలకు దారితీస్తోంది. త్వరలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.. ఈ లోపు ప్రత్యేక ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో ఎన్నికల కమిషన్ రెండు నెలల్లో అక్కడి ఓటర్ల జాబితాల్ని సమూ లంగా ప్రక్షాళన చేయాలనుకుంటుంది. ఈ నిర్ణయం మంచిదే. కానీ బిహార్ విషయంలో ఎందుకు ఆ ప్రయత్నాన్ని అభినందించలేక పోతున్నామంటే ఈ రివ్యూకి ఆ సంఘం కేటాయించిన సమయం.. అర్హత కోసం ఓటర్లను అడుగుతున్న రుజువులు.. 2003లో ఆ రాష్ట్రంలో ఓటరు జాబి తాలో ఉన్నవారిని ఏమీ అడగటం లేదు. అయితే అప్పుడు ఓటర్లు 4 కోట్ల మంది అయితే ఈ యేడు ఏడు కోట్ల మందికి పైనే.. ఎటు చూసినా వారిలో మూడు కోట్ల మంది తాము వివిధ గుర్తింపు పత్రాలతో అర్హులమే అని రుజువు చేసుకోవాలి. ఆ రాష్ట్రంలో జనన ధృవీకరణ పత్రాలు మంజూరు చెయ్యడం మిగతా చోట్ల కన్నా తక్కువ. వలసలు ఎక్కువే.. నిరక్షరాస్యత, పేదరికం ఎక్కువ. పైగా మూడు కోట్ల మంది అర్హతను రెండు నెలల్లో తనిఖీ చేసి, నిర్ధారించడం సిబ్బందికి తలకు మించిన పని.. దీంతో ఈ మొత్తం ప్రక్రియలో ఓటు హక్కు అన్యాయంగా కోల్పోయేవాళ్లే ఎక్కువ తేలే అవకాశం ఉంది. కాబట్టి నిదానంగా, టైమ్ తీసుకుని చక్కదిద్దాల్సిన ప్రక్రియని, హడావిడిగా ముగించడం మేలు కన్నా కీడే చేస్తుంది.

డా. డి.వి.జి. శంకరరావు

94408 36931

Next Story