కుల రాజకీయాల కురుక్షేత్రం.. బిహార్ ఎన్నికల్లో గెలుపు అవకాశం ఏ పార్టీకి ఉంది?

by Ravi |   (  Updated:2025-10-08 01:16:08  IST  )

ఒకప్పుడు బిహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం అలా కాదు. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు జరగబోతున్న

కుల రాజకీయాల కురుక్షేత్రం.. బిహార్ ఎన్నికల్లో గెలుపు అవకాశం ఏ పార్టీకి ఉంది?
X

ఒకప్పుడు బిహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం అలా కాదు. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఆ ఎన్నికల రాజకీయ సెగతో అన్ని పార్టీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బిహార్ రాష్ట్రంలో పలు చిన్న పార్టీలు కూడా కీలకపాత్ర పోషించనున్నాయి.

గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి, మహాఘట్‌ బంధన్ (ఎంజీబీ) కూటముల్లో మార్పులు, చేర్పులతో పాటు రాష్ట్రంలో కొత్త పార్టీల రంగప్రవేశం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బిహార్ ఎన్నికలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు సవాళ్లుగా మారుతున్నాయి.

అన్ని పార్టీలకు కురుక్షేత్రంగా..

13 కోట్లకు పైగా జనాభాతో 243 స్థానాలున్న రాష్ట్రంలో ఈసారి కూడా రాజకీయాలు ఎప్పటిలాగే కుల సమీకరణాల చుట్టే తిరుగుతూ అన్ని పార్టీలకు కురుక్షేత్రంగా మారాయి. రాష్ట్రంలో అధికార ఎన్‌డీఏ కూటమిలో జేడీయూ, బీజేపీ, ఎల్జీపీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ప్రతిపక్ష ఎంజీబీ కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమిలో ఉన్న వికశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) ప్రస్తుతం ఎమ్జీబీ కూటమిలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఎల్జీపీ ఇప్పుడు ఎన్‌డీఏలో ఉంది. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) జేడీ (యూ) లో విలీనమైంది. ఈ రెండు కూటములను సవాల్ చేస్తూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచిన ఏఐఎంఐఎం రాబోయే ఎన్నికల్లో కూడా మైనార్టీ ఓట్లపై ప్రభావం చూపనుంది.

నితీష్‌పై విశ్వసనీయత ఉంటుందా?

నితీష్ కుమార్ తన సీఏం పీఠం కాపాడుకుంటూ పలుమార్లు కూటములు మార్చారు. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి పోటీ చేసి ముఖ్యమంత్రి అయిన నితీష్ 2017లో బయటకు వచ్చి బీజేపీతో కలిశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ తరఫున పోటీచేసిన నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. స్వ ప్రయోజనాలే లక్ష్యంగా నితీష్ కుమార్ ఇలా పదే పదే పొత్తులు, కూటములను మారుస్తుండడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి నితీష్‌పై విశ్వసనీయత అనేది జేడీ (యూ)కి, ఎన్‌డీఏకు సవాలుగా మారింది. నితీష్ కుమార్ వరుసగా కూటములు మార్చడం వల్ల ఆయన విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం ఓటర్లలో ఆయనపై విరక్తి పెరిగింది. బీజేపీతో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయంలో స్పష్టత లేకపోవడం గందరగోళం సృష్టిస్తోంది. బీజేపీ ఎక్కువ సీట్లు కోరుతుండగా, జేడీయూ బలహీనపడే ప్రమాదం ఉంది.

అవినీతి ముద్రను తొలగించుకోలేక..

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ 10 లక్షల ఉద్యోగాల హామీతో యువతను ఆకర్షిస్తున్నారు. అయితే, ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, పార్టీపై ఉన్న అవినీతి ముద్రను తొలగించడం కష్టమవుతోంది. కాంగ్రెస్ బలహీనత, వామపక్షాల పరిమిత శక్తి కారణంగా కూటమి ఐక్యత కష్టంగా కనిపిస్తున్నా, యాదవులు, ముస్లింలు వంటి బలమైన ఓటు బ్యాంక్ వీరి ఆధారంగా ఉంది.

కొత్త ఆకర్షణగా జన సురాజ్..

ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన సురాజ్ పార్టీ విద్య, ఆరోగ్యం, పారదర్శక పాలన వంటి అంశాలను ప్రధానంగా ఎత్తి చూపుతోంది. పట్టణ యువతలో ఈ పార్టీకి ఆకర్షణ పెరుగుతోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కుల రాజకీయాలే బలంగా ఉండటం వల్ల దాని ప్రభావం పరిమితంగానే ఉండవచ్చు. అయినప్పటికీ ఈ పార్టీ ప్రధాన కూటముల ఓట్లను విభజించే సామర్థ్యం కలిగి ఉంది.

కుల రాజకీయాలు బలంగా ఉండటంతో..

బిహార్‌లో ఓబీసీ, ఎస్సీ, ముస్లిం వర్గాలు కలిపి 80%కు పైగా ఉన్నారు. వీరి మద్దతే ఎవరికి అధికారం వస్తుందో నిర్ణయిస్తుంది. 2020లో ముస్లిం ఓట్లలో 76% మహాఘట్‌ బంధన్‌కు రావడం గమనించదగ్గ అంశం. అగ్రకులాలు తక్కువ శాతంలో ఉన్నప్పటికీ రాజకీయంగా ప్రభావం చూపుతూనే ఉన్నాయి. పట్టణాల్లో ఎన్‌డీఏ పాలనపై కొంత సంతృప్తి ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంది. వరదలు, వ్యవసాయ సమస్యలు, ఉపాధి కొరత కారణంగా రైతులు ప్రభుత్వంపై విసిగి పోయారు. మహిళల విషయంలో, మద్యం నిషేధం నితీష్‌కు మద్దతు తెచ్చినా, ఈసారి అది ఏ‌వైపు వెళుతుందో స్పష్టంగా తెలియడం లేదు. బీజేపీ డిజిటల్ ప్రచారంలో ఆధిపత్యం సాధించింది. గ్రామ స్థాయి కార్యకర్తల బలమైన నెట్‌వర్క్ కూడా వీరికి అనుకూలం. ఆర్జేడీ ఈ విషయంలో వెనుకబడి ఉంది. జన సురాజ్ పట్టణ యువతలో డిజిటల్ మీడియాతో పాప్యులర్ అవుతున్నా, గ్రామీణ ఓటర్లపై దాని ప్రభావం పరిమితంగానే ఉంటుంది.

జాతీయ రాజకీయాలపై ప్రభావం

బిహార్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేస్తాయి. ఎన్‌డీఏ గెలిస్తే బీజేపీ జాతీయ స్థాయిలో బలపడుతుంది. మహాఘట్‌‌బంధన్ విజయం సాధిస్తే ఈ కూటమికి ఊపు వస్తుంది. జన సురాజ్ పార్టీ గణనీయమైన సీట్లు గెలిస్తే, దేశవ్యాప్తంగా కొత్త రాజకీయ ధోరణులకు మార్గం ఏర్పడవచ్చు. బిహార్ ఎన్నికలు కేవలం స్థానిక శాసన సభ పోటీ కాదు. ఇవి దేశ రాజకీయ భవిష్యత్తు దిశను సూచించే కురుక్షేత్రం. అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాలు చర్చలో ఉన్నప్పటికీ, కుల రాజకీయాలే ఇంకా ప్రధాన ఆధారంగా నిలుస్తున్నాయి. ఎవరు గెలిచినా, బిహార్ ఈసారి కూడా దేశానికి అద్దం పట్టనుందనేది ఖాయం.

-వాడవల్లి శ్రీధర్

99898 55445

Next Story