స్వేచ్ఛా స్వాతంత్య్ర ఫలం.. స్వార్థపరుల పరం!

by Disha edit |
స్వేచ్ఛా స్వాతంత్య్ర ఫలం.. స్వార్థపరుల పరం!
X

ప్రతి ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట బురుజు నుంచి ఆచరణ లేని ఉపన్యాసాలు దంచడం దేశ ప్రధానుల గుత్త సొత్తుగా మారింది. 76ఏళ్లుగా వారి ఉపన్యాసాల్లో ఆదర్శాలే తప్ప.. ఆచరణ ఎరగవు. స్వాతంత్య్ర సమర సేనానుల త్యాగఫలమే స్వేచ్ఛా భారతం. స్వరాజ్యాన్ని సురాజ్యంగా మలచుకునే క్రమంలో ఎంత మేరకు పురోగతి సాధించామని తిరిగి చూస్తే మిగిలేది నిర్వేదమే.

ప్రాథమిక హక్కును.. విస్మరించి

దేశం కోసం ఎందరో యోధులు మహోన్నత త్యాగాలు చేశారు. ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం లేని స్వరాజ్యాన్ని కలలుగన్నారు. వివక్ష లేని సమాజాన్ని స్వప్నించారు. మతాలు, కులాలు, వర్గాల మధ్య భేదభావం లేని పరిస్థితిని ఊహించారు. కానీ నేడు జరుగుతున్నది ఏమిటి? ఎక్కడ చూసినా హింస, ద్వేషం, అసూయ, స్వార్థం, కుట్రలు, కుతంత్రాలే రాజ్యమేలుతున్నాయి. స్వాతంత్య్రం మేడిపండుగా, దారిద్య్రం రాచపుండుగా దేశాన్ని వెక్కిరిస్తున్నాయి. పరాయి పాలన పీడ విరగడై మనల్ని మనమే పరిపాలించుకుంటున్నా, నిరుపేదలు, నిర్భాగ్యుల సంఖ్య తరగడం లేదు. 76 ఏళ్ల స్వాతంత్య్రం అనంతరం కూడా దేశంలో పేదరికం ఇంకా 20 శాతం గుట్టలుపడి ఉందంటే ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు ఎవరి కోసం పని చేసాయో అర్థం చేసుకోవచ్చు. 1946లో మహాత్మాగాంధీ మేకాళీలో ప్రసంగిస్తూ మౌలిక మానవ హక్కుగా అందరికీ ఆహారం సమకూర్చాలని సూచించారు. ఈ ప్రాథమిక కర్తవ్యాన్ని స్వాతంత్ర్యం వచ్చాక మన పాలకులు విస్మరించడం వల్లనే ఫలితం అనుభవిస్తున్నాం.

దేశాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యలలో పేదరికం ప్రధానమైనది. ఇది దేశ సర్వతోముఖాభివృద్ధికి అవరోధంగా మారింది. భారతదేశంలో 19.45కోట్ల మంది అన్నార్తులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ బయటపెట్టింది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంతమంది ప్రజలు ఆకలి, పోషకాహార లోపాలతో బాధపడటం లేదు. ఆకలి, పేదరికం, అనారోగ్యాలను పారదోలుతామన్న ప్రతిజ్ఞలతో కొత్త పొద్దు పొడిచింది. కానీ 76 ఏళ్లుగా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రసంగాలు దంచుతున్నా 20 శాతం పేదరికం పేరుకుపోయింది. మన అందరికోసం ఎందరో చేసిన మహోన్నత త్యాగాలు వొట్టిపోలేదని నిరూపించలేక పోయాము. స్వాతంత్య్ర ఫలాలు అట్టడుగు ప్రజలకు అందజేయలేకపోయాము. మరి స్వాతంత్య్ర ప్రయోజనం ఎవరి కోసం? ప్రతి ఏటా స్వాతంత్య్ర దినాన మొక్కుబడి, అవాస్తవ ప్రసంగాలతో దేశానికి, ప్రజలకి ఒరిగింది ఏమిటి? అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించడం, విద్యా, వైద్యం వంటి రంగాలకు చేయూత ఇవ్వడం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించి రైతులను గట్టెక్కించడం కేంద్ర ప్రభుత్వం సాధించినట్లు చెబుతున్న విజయాల్లో దేశ ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పు కనపడుతుందా? ఏవో కొన్ని రంగాల్లో పురోగతి సాధించామంటున్నా వాస్తవిక స్థితిగతులు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి.

శక్తి మేర.. దేశం ఎదగలేదు!

మన దేశం ఆశించిన అభివృద్ధి సాధించకపోవడానికి కారణం మితిమీరిన స్వార్ధం, అవినీతే. ఇక్కడ విస్తారంగా సహజ వనరులు ఉన్నాయి. సాగు భూమికి కొదవలేదు. ఈ విషయంలో అమెరికా లాంటి దేశాల కన్నా మెరుగైన స్థితిలో ఉన్నాం. ఇనుప ఖనిజం ఉత్పత్తిలో మనది 4వ స్థానం. బొగ్గు, ఇనుప ఖనిజమే సహజ వాయువు, వజ్రాలు, పెట్రోలియం, మాంగనీస్, బాక్సైట్, అబ్రకం వంటి ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ అందులో సగం ఖనిజ సంపదనైనా లేని దేశాలు ఇండియా కన్నా మెరుగ్గా అభివృద్ధి చెందుతున్నాయి. సుస్థిర ప్రజాస్వామ్య దేశంగా భారత్ గొప్పగా రాణించడం అద్భుత విజయమే అయినా తన సహజ శక్తి సామర్ధ్యాల మేరకు ఎదగలేకపోయింది అన్నది నిష్టుర సత్యం. వ్యవసాయాన్ని, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి బాట పట్టించాలని స్వాతంత్య్రానికి ముందు తపించాం. మన ఆహార వస్తువులు మనమే ఉత్పత్తి చేసుకోవాలి అనుకున్నాం. కానీ నేడు ఆచరణ ఏది? సేద్యమే జీవనాధారంగా బ్రతికే దేశంలోకి ఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి రావడానికి కారణాలేంటి?

భారతదేశం గ్రామాల్లో జీవిస్తుందని గొప్పలు చెప్పుకున్నాం, జై కిసాన్ అన్నాం. అలాంటి గ్రామీణ భారతం నేడు విధ్వంసానికి గురై ఉపాధిలేక లక్షల సంఖ్యలో ప్రజలు పొట్ట చేత పట్టుకొని నగరాలకు, పట్టణాలకు వలసపోతున్నారు. కర్షకుల జీవితం గాలిలో దీపమైంది. పర్యవసానంగా స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 51 శాతం నుండి నేడు 14 శాతానికి పడిపోయింది. వ్యవసాయంపై ఆధారపడే వారి సంఖ్య 80 శాతం నుండి 60 శాతానికి పడిపోయింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్ళు అయినా ఈ రంగం సానుకూల మార్పులకు నోచుకోలేదు. పరిశోధనా ఫలాలు దేశ రైతాంగానికి చేరడం లేదు. ఏళ్ల తరబడి రసాయన ఎరువుల వినియోగం ప్రయోగాలతో దేశ ప్రజల, రైతుల ఆరోగ్యం గుల్లబారుతుంది. కర్షక లోకం కడగండ్లపై కమిషన్లు వేసి సూచనలు రాబడటం తప్ప ఆ సూచనలు అమలు చేసిన దాఖలాలు లేవు. రైతు కష్టజీవి. అతను పడే శ్రమ సొంత కుటుంబం కోసం కాదు. యావత్ కుటుంబానికి పట్టెడన్నం పెట్టడం కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. రోజుకు 2000కి పైగా రైతులు వ్యవసాయరంగాన్ని వీడుతున్నట్లు సమాచారం. వ్యవసాయరంగంలో మనం ఎంత అభివృద్ది సాధించామో చెప్పడానికి అరగంటకొక అన్నదాత ఆత్మహత్యే సాక్షం. సేద్య రంగాన్ని సంక్షోభం నుంచి ఉపశమిస్తే గాని గ్రామీణ భారతం, దేశ ఆర్ధికం తెరిపిన పడదు. నానాటికీ తీవ్రమవుతున్న భూతాపం వల్ల అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఉండటంతో దేశ సామాజిక, ఆర్థిక జీవనం అతలాకుతలం అవుతుంది. కానీ భూతాపం కట్టడికి నిర్మాణాత్మకంగా ముందుకు సాగడం లేదు ప్రభుత్వాలు.

గాంధీ ఆశించిన.. స్వాతంత్య్రం రానట్టే!

ప్రజారోగ్యమే దేశానికి మహాభాగ్యం. స్వస్థ సమాజమే జాతి సర్వతోముఖాభివృద్ధికి ప్రాణాధారం. ఈ స్పూర్తికి గొడుగు పట్టాల్సిన వైద్యరంగం రుగ్మతలను ఎదుర్కొంటున్నది. దేశీయోత్పత్తిలో 4.2శాతం వైద్యరంగానికి ఖర్చు పెడుతున్నా నేటికీ 70 శాతం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. పట్టణ ప్రాంతాల్లో 4.92లక్షలు, పల్లె ప్రాంతాల్లో 1.83లక్షల మేర ఏర్పాటైన ఆస్పత్రుల పడకలు 140 కోట్ల జనాభా అవసరాలు తీర్చలేకపోతున్నాయి. 20 లక్షల మంది వైద్యులు, 40 లక్షల మంది నర్సుల కొరత దేశాన్ని కుంగదీస్తోంది. ఉన్న సిబ్బందిలో 57 శాతానికి వైద్యపరమైన అర్హతలు లేవు! లక్షా యాభై వేలకు పైగా ఉపకేంద్రాలు, 25వేలకు పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 760 కి పైగా జిల్లా ఆస్పత్రులలో మౌలిక వసతులు లేక సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. 55 శాతానికి పైగా గ్రామీణులు ఆర్థిక స్థోమత లేక సరైన చికిత్స చేయించుకోలేకపోతున్నారు. దుకాణదారులు ఇచ్చే మందులతో సరిపెట్టుకుంటున్నారు. పేద ప్రజలు వారి వార్షిక ఆదాయానికి రెట్టింపు సొమ్మును వైద్య ఖర్చులకు వెచ్చించాల్సి వస్తుంది. రాష్ట్రాలకు చేరాల్సిన కేంద్ర ఆర్థిక నిధులు దారి తప్పి అవి భోక్తలకు విందు భోజనం అవుతున్నాయి. అలాగే పేదరికాన్ని పరిమార్చగలిగే శక్తివంతమైన ఆయుధం ‘చదువు’. విద్య కోసం బడ్జెట్‌లో వేలకోట్లు ఖర్చు పెడుతున్నా నేటికీ అక్షరాస్యత 73 శాతం మించడం లేదు. విద్యావ్యవస్థ పట్టాలిచ్చే పరిశ్రమగా మారింది. విద్యాహక్కు చట్టం అమలు కావడం లేదు. విద్య పక్కా వ్యాపారంగా మారింది. విద్యాస్థాయి, పరిశోధనా పటిమ, నూతన ఆవిష్కరణలు సహా అన్నింటా అంతర్జాతీయ సమాజం కన్నా వెనుకబడి ఉన్నాం. విద్యా, ఉపాధికి మధ్య అగాథం నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా యువత పెడదారులు పడుతోంది.

శుష్క నినాదంగా మేకిన్ ఇండియా

2015లో స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట బురుజుపై నుంచి మేకిన్ ఇండియాగా పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. కానీ నేడు ఆ నినాదంలో అంత ఆశావహ దృశ్యం కనిపించదు. తయారీ విధానాన్ని ఆర్భాటంగా ప్రకటించారు కానీ దానిని సమర్ధవంతంగా అమలు చేయడానికి విధానపరమైన చర్యలు చేపట్టలేదు. మేకిన్ ఇండియా శుష్క నినాదంగా మిగిలిపోయింది. మన దేశంలో నిరుద్యోగం గుట్టలు పడింది. మహిళలకు సముచిత భాగస్వామ్యం కల్పించినప్పుడే సామాజిక ప్రగతి సాధ్యపడుతుందనేవారు మహాత్మాగాంధి. స్వాతంత్య్రం అనంతరం భారత పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం 12 శాతానికి మించడం లేదు. అర్ధరాత్రి మహిళలు ఒంటరిగా తిరిగిన నాడే స్వరాజ్యం వచ్చినట్లని గాంధీజీ అన్నారు. దానిని పరిగణనలోకి తీసుకుంటే మనకి ఇంకా స్వాతంత్ర్యం రానట్టే. నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలపై దాడులు, అకృత్యాలు నిత్యకృత్యం అయ్యాయి. మహిళల భద్రత గాలిలో దీపమై మానవతా విలువలు మంటకలిసిపోతున్నాయి.

దేశ ప్రగతి.. కుంగదీస్తున్నదిదే!

రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయి. అనవసరమైన రాజకీయ వివాదాలు కూడా ప్రజాసేవలో భాగమయ్యాయి. రాద్దాంతాలు తప్ప సిద్దాంతాలు లేవు. స్వార్ధమే పరమావధిగా మారి రాజకీయ పార్టీలు ప్రదర్శిస్తున్న విన్యాసాలు ప్రజాస్వామ్యం నవనాడుల్ని కుంగదీస్తున్నాయి. ప్రజాహితాన్ని బలిపెట్టే ధోరణి ప్రబలి రాజ్యాంగ స్పూర్తే కదలిబారిపోవడం ప్రజాస్వామ్య వాదుల్ని కలిసివేస్తుంది. గంప లాభం చిల్లి తీర్చినట్లుగా భారతావని ప్రగతిని దారుణంగా కుంగదీస్తున్న మహమ్మారి అవినీతి. ఆ అవినీతి వలన, అవినీతి చేత, అవినీతి కొరకు పాలనా వ్యవస్థను దిగజార్చిన దుష్టరాజకీయం దేశానికి చేస్తున్న చెరుపు అంతా ఇంతా కాదు. ఏ రంగంలో చూసినా డబ్బు సంపాదించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్న వారే, నేర స్వామ్యంపై అంకుశం మోపడం లేదు. దేశానికి శత్రువైన అవినీతి దుంపను నాశనం చేసే ప్రయత్నం జరగడం లేదు. రాజకీయ అవసరాల కోసం అవినీతి పరులను అక్కున చేర్చుకుంటున్నారు. అవినీతిపరులకు అండగా నిలిచి అధికారంలోకి తెస్తున్నారు. ఏది ఏమైనా దాదాపు 90ఏళ్ల పాటు అవిశ్రాంతంగా పోరాడి సాధించుకున్న స్వరాజ్యం స్వార్థపరుల పరమైంది. ఎన్నో లక్ష్యాలతో, ఎన్నో ఉన్నత ఆశయాలతో సాధించిన స్వాతంత్ర్యం వలన దేశ ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నించుకుంటే నిరాశ, నిర్వేదమే మిగులుతుంది. పొరాడి సాధించుకున్న స్వరాజ్యం స్వార్ధపరుల పాలైన స్వతంత్ర దేశంలో భారతావని భాగ్యోదయాన్ని చూడగలమా? అని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు.

నీరుకొండ ప్రసాద్

సీనియర్ జర్నలిస్ట్

98496 25610

Next Story

Most Viewed