- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారుతున్న ఓటర్ల తీర్పు.. ఓటు బ్యాంకు రాజకీయాలకు ముగింపు?
దేశ రాజకీయాల్లో ఓటర్ల తీరు మారుతోందా? డబ్బు, కులం, ఉచిత పథకాల రాజకీయాలకు ప్రజలు విసిగిపోయారా? యువత, సోషల్ మీడియా ప్రభావంతో కొత్త రాజకీయ మార్పులపై ఈ వ్యాసం విశ్లేషణ.

చాలా రోజుల తర్వాత నాకు ఓ అధికారి ఫోన్ చేశారు. నైట్ తినేసి రెస్ట్ తీసుకునే సమయం కావడంతో చాలా సేపు మాట్లా డడానికి అవకాశం లభించింది. దేశవ్యా ప్తంగా మంచి రోజులు రాబోతున్నాయన్న వాతావరణం కనిపిస్తోందన్నారు. మార్పు స్పష్టంగా తెలుస్తుంది. అన్ని రాజకీయ పార్టీల మీద జనం విసిగిపోయినట్లు తెలుస్తోంది. ఎవరికీ పనులు కావడం లేదు. ఏ అభివృద్ధి ఛాయలు కనిపించడం లేదు. కొన్ని దశాబ్దాలుగా ఓటు బ్యాంకు రాజకీయాలే నడుస్తున్నాయి. ఎన్నికల ప్పుడు ఓటుకు రూ.వేలల్లో ఇస్తే వాళ్లే ఓట్లు వేస్తారనుకుంటే ఇక పొరపడినట్లే.
రాజకీయ నాయకులు, ఈ పార్టీల మీద జనానికి మొహం కొట్టింది. కొత్తదనాన్ని కోరుకుంటున్నారని అన్నారు. అలా ఎలా మళ్లీ డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు కదా.. ఈ నాలుగేండ్ల బాధలు మర్చిపోయి, ఆఖరున ఏదో ఆకర్షణీయం ప్రదర్శిస్తే గంపగుత్తగా ఓట్లు పడుతాయన్న ధీమాతోనే నాయకులు ఉన్నారు కదా అన్నాను. దేశంలో పరిస్థితులు మారాయి. ధరల పెరుగుదల, హామీలు, పథకాలు, ప్రసంగాలు, రాజకీయ దూకుడులు.. ఇవన్నీ జనం గమనిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ అనేది కామెడీగా అనిపించొచ్చు. కానీ అతి తక్కువ సమయంలోనే అనూహ్య స్పందన లభించింది. అంటే దాని మేనిఫెస్టోను జనం హర్షిస్తున్నారన్న మాటే కదా అన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు కూడా కేవలం డబ్బులకే ఓట్లు రాలుతాయనుకునే నాయకులకు చెంపపెట్టు లాంటిదని గుర్తించకపోతే బోర్లాబొక్కల పడుతారన్నది మాటల సారాంశం. అలాగే చాలా సేపు ముచ్చట్లలో సంప్రదాయబద్ధ రాజకీయాలకు భిన్నంగా ఈ సారి ఎన్నికలు, ఫలితాలు ఉంటాయని స్పష్టమైంది.
స్కీమ్.. నై చెల్తా ..
దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు చెక్ పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న సంతోషం కలుగుతుంది. డబ్బులు, స్కీమ్స్, ఆకర్షణీయమైన పథకాలు.. ఇవేవీ ఓట్లు రాల్చవు. కులం, మతం, ప్రాంతం.. ఇవి కూడా ఎన్నికల్లో ప్రభావం చూపని రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తుంది. ఆ రోజే వస్తే సంతోషానికి అవధులు ఉండవు. ఇంట్లో పని చేసే మహిళ గెలుపు. ఓ ఆటో డ్రైవర్, మరో డ్రైవర్ కొడుకు గెలుపు. వీళ్లంతా డబ్బులు పంచితేనో, మేనిఫెస్టోను విపరీతంగా ప్రచారం చేస్తేనో గెలిచారా అవతలి వ్యక్తులు ఎంత బలీయమో కదా.. వారిని కాదని సామాన్యులను గెలిపించడంలో ఆంతర్యమేమిటి ఇలాంటి వాళ్లయితే ఓటుకు రూ.వెయ్యి, రూ.2 వేలు, రూ.5 వేలు ఇచ్చే స్థోమతైతే ఉండదు. మరి గెలుపు వెనుక రహస్యం! అందుకే త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయేమోననిపిస్తుంది. కేవలం ఉచిత పథకాలు ఓట్లు రాల్చవని పార్టీలు గుర్తించాలి. ఉచితాలను కోరుకుంటున్నారని సర్వేలు చెప్పొచ్చు. అనుచిత పథకాలు మంచివి కావని మేధావులెవరూ వద్దని చెప్పే సాహసం చేయకపోవచ్చు. బడ్జెట్‌లో అధిక మొత్తం ఈ ఫ్రీ స్కీమ్స్‌కే కేటాయించడం ద్వారా ఆర్ధిక వ్యవస్థను ఎటు వైపు తీసుకెళ్తున్నారో అందరికీ తెలుసు. కానీ మళ్లీ ఎన్నికల్లో ఇప్పుడున్న దాని కంటే ఎక్కువే ఇస్తామని ప్రతిపక్షం ప్రకటిస్తే వాళ్లే అధికారంలోకి వస్తారన్న భయం పట్టుకుంది. కానీ వారొచ్చినా అదే తీరు.. అందుకే ఇప్పుడున్న వ్యక్తులను చూసి విసిగిపోయారు.
వ్యంగ్యం నుంచి ప్రశ్న..
రాజకీయాల్లో జనాన్ని ఆకట్టుకునే ప్రసంగాలు, రెచ్చగొట్టే తీరును ఛీ కొడుతున్నారు. ఇన్నేండ్లుగా చూస్తోన్న రాజకీయాలకు, రానున్న రాజకీయాలకు చాలా తేడా ఉంటుంది. అందుకే రాజకీయాల వైపు యువతకు ఆసక్తి పెరుగుతుంది. ఈ క్రమంలోనే వచ్చిన ఓ కామెడీ రాజకీయ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చిన స్పందన ద్వారా స్పష్టమవుతుంది. మూడు, నాలుగు రోజుల్లోనే చేరిన సభ్యుల సంఖ్య చర్చనీయాంశంగా మారింది. ఇదిప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మేనిఫెస్టోలో లేవనెత్తిన అంశాలు ఎవరూ విమర్శించలేనివిగా, బలంగా ఉన్నాయి. ఈ పార్టీ అధికారికంగా నమోదు కాలేదు. కానీ దేశ రాజకీయాలపై విరక్తి చెందిన యువతను రాజకీయాల వైపు నడిపించే వేదికగా పని చేస్తుంది. ఓ ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. వ్యంగ్యం నుంచే ప్రశ్నల పరంపర కొనసాగింది. సంధించిన ప్రశ్నలకు అన్ని రాజకీయ పక్షాలు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. రానున్న రోజుల్లో ఇదే ఉధృతి కొనసాగితే డబ్బులకు ఓట్లు రాలవని తేటతెల్లమవుతుంది.
తక్కువ అంచనా వేయొద్దు!
రానున్న రోజుల్లో మీడియా నాది. చానల్ నాది, ఆ పత్రికలో రాయించుకుంటా.. అనుకుంటే చెల్లదు. ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ నాయకుల కార్యక్రమాలు, ప్రసంగాలకు వందల్లో కూడా వ్యూస్ రావడం లేదు. అదే ఓ సమస్య, అవినీతి, అవినీతి అధికారిపై చర్య, ప్రశ్నలు, నిలదీతలకే ఆదరణ లభిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. సొంత మీడియాలో రాయించుకుంటే జనానికి చేరవని సంప్రదాయ రాజకీయ నేతలు గుర్తించాలి. సోషల్ మీడియానే ఆసరా, ఆదరణ, అదే బలం, అదే బలగం. ఇవేవీ గుర్తించకుండా డబ్బులు పంచుతా, కార్యకర్తలు మావాళ్లు, మా కులపోళ్లే ఎక్కువగా ఉన్నారు, మాది రాజకీయ కుటుంబం.. ఇలాంటి పాత కాలపు మాటలు చెల్లుబాటు కావని నేటి సోషల్ మీడియా ట్రెండింగ్, ఇటీవలి ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తు న్నాయి. సంప్రదాయబద్ధ నాయకులు ఆలోచన తీరు, ప్రవర్తన మార్చుకోకపోతే జెన్ జి తరం ప్రభావాన్ని ఎదుర్కోవాల్సిందే.
గెలిచేందుకు ఐదేండ్ల కృషి..
ఎన్నికలప్పుడు మంచిగా మాట్లాడాలి. నాలుగు సార్లు ఊర్లల్లోకి రావాలి. జనంలో మధ్యలో తిరగాలి. ఆ తర్వాత నామినేషన్ కాగానే ప్రచారం చేయాలి. మందు పంచాలి. ఓటుకు రూ. వేలల్లో ఇవ్వాలి.. మళ్లీ గెలవాలని నాయకగణం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గెలిచాక మళ్లీ గెలిచేందుకే ఐదేండ్లు కష్టపడుతున్నారు. ఓటర్లకు డబ్బులు పంచేందుకే లెక్కకు మించి సంపాదిస్తున్నారు. అందుకే మొదటి ఎలక్షన్ అఫిడవిట్‌కి, రెండు, మూడోసారి సమర్పించే అఫిడవిట్లకు మధ్య అంతులేని తేడాలు ఉంటున్నాయి. సంపాదన వందల రెట్లు పెరుగుతుంది. జనం మాత్రం మళ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చే డబ్బుల కోసం ఎదురుచూస్తుంటారని ఈ నాయకుల లెక్కా పత్రం. కానీ ఈ సారి ఎన్నికల్లో అలాంటి పాచికలు పారవన్న గుర్తులు కనిపిస్తున్నాయి. యువత స్పందించే తీరు మారుతోంది. ప్రశ్నించే తత్వం పెరుగుతోంది. కులం, మతం, ప్రాంతం కంటే మరేదో జనం కోరుకుంటున్నారు. ఇప్పుడున్న నాయకుల ముఖాలు చూసి మొహం కొట్టిందనిపిస్తుంది. అందుకే నాయకుల్లారా.. కాస్త కండ్లు తెరవండి. జనానికి ఏం కావాలో తెలుసుకోండి. మీరే సంపాదించుకోకండి. కాస్త జనం బాధలు, మీ నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టండి.
- శిరందాస్ ప్రవీణ్ కుమార్
80966 77450






