శతాబ్దపు సేవా యజ్ఞం.. ఆర్ఎస్ఎస్ ప్రయాణం

by Ravi |   (  Updated:2025-10-29 01:15:36  IST  )

ఆర్ఎస్ఎస్ అనే మూడు అక్షరాలతో పిలువబడే 'రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్' గురించి దేశంలో విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ సంస్థ దేశభక్తికి కేరాఫ్. ప్రకృతి వైపరీత్యాలు, అకస్మాత్తుగా ప్రమాదాలు, యుద్ధాలు సంభవించినప్పుడు దేశ ప్రజలకు అండగా నిలిచేది

శతాబ్దపు సేవా యజ్ఞం.. ఆర్ఎస్ఎస్ ప్రయాణం
X

ఆర్ఎస్ఎస్ అనే మూడు అక్షరాలతో పిలువబడే 'రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్' గురించి దేశంలో విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ సంస్థ దేశభక్తికి కేరాఫ్. ప్రకృతి వైపరీత్యాలు, అకస్మాత్తుగా ప్రమాదాలు, యుద్ధాలు సంభవించినప్పుడు దేశ ప్రజలకు అండగా నిలిచేది ఆర్ఎస్ఎస్ అనే విషయం ఈ దేశాన్ని ప్రేమించే వాళ్లకు బాగా తెలుసు. ఈ సంస్థ శతాబ్ది ఉత్సవాలు అక్టోబర్ రెండో తేదీతో మొదలయ్యాయి.

ఈ సంస్థ లక్ష్యాలను గడపగడపకు తీసుకువెళ్లి,'మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః(ఈ భూమి నా తల్లి నేను ఆమె పుత్రుడను), 'హైందవః సోదరా సర్వే '(హిందువులందరూ సోదరులే) అనే ఉత్కృష్ట భావాన్ని ఈ దేశ ప్రజలలో నిర్మాణం చేయడానికి సంవత్సరం కాలం పాటు కార్యక్రమాలను నిర్దేశించుకుంది. ఈ సంస్థ ఎదుగుదలను, ఈ దేశాన్ని ప్రేమించే వ్యక్తుల ద్వారా ఆ సంస్థ పొందిన ఆదరాభిమానాలను అడ్డుకోవాలని సర్వ శక్తులు వడ్డిన అన్ని రకాల సంస్థలు శక్తి హీనం కావడమే ప్రపంచ రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తుంది.

సంస్కృతికి వారసుడని అనుకోకపోతే..

ఈ సంస్థ 1925 విజయదశమి రోజు నాగపూర్‌లో డాక్టర్. కేశవరావ్ బలీరాం హెడ్గేవార్ మార్గదర్శనంలో స్థాపితమైంది. అనుశీలన సమితిలో క్రియాశీలక సభ్యుడుగా ఉంటూ, అనేక విప్లవ సంస్థల ప్రతినిధులతో స్వాతంత్ర్య ఉద్యమ లక్ష్యాలను చర్చించిన ఆయన ఈ దేశ ప్రజల్లో ఈ దేశం నాది, ఈ దేశ సంస్కృతికి నేను వారసున్ని అనే భావన నిర్మాణం కాకపోతే బ్రిటిష్ వారి నుండి స్వాతంత్య్రం పొందినప్పటికీ ఆ స్వాతంత్రాన్ని నిలుపుకోలేరని భావించారని, ఆ ఉద్దేశంతోటే ఆయన ఈ సంస్థను స్థాపించినట్లు పెద్దలు చెబుతారు. ఈ సంస్థ కార్యకలాపాలను అన్ని ప్రాంతాల్లోకి, అన్ని వర్గాల్లోకి తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం ఈ సంస్థ రెండవ అధ్యక్షులు మాధవరావు సదాశివ గోల్వాల్కర్

నూరేళ్ల నిబద్ధతతో పనిచేస్తూ..

హిందూ సమాజంలోని అన్ని కులాల వారు సమన్వయంతో, సోదర భావంతో కలిసిమెలిసి ఉంటూ ఈ దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని 1964లో స్వామి చిన్మయానంద సరస్వతి సహాయ సహకారాలతో విశ్వహిందూ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం 'అఖిల భారత విద్యార్థి పరిషత్,' కార్మికుల కోసం 'బిఎంఎస్, 'వనవాసీల కోసం 'వనవాసీ కళ్యాణ ఆశ్రమం' ఇలా అనేక సంస్థలను ఏర్పాటు చేయడం లో గురూజీ పాత్ర అనన్య సామాన్యమైనది. ఈ సంస్థలో బాధ్యతలను నిర్వర్తించే వ్యక్తులకు ప్రాధాన్యత లేదు. తత్వానికి మాత్రమే ప్రాధాన్యత ఉంది. ఈ సంస్థకు గురువు పరమ పవిత్ర భగవాధ్వజమే కానీ వ్యక్తులు కాదు. ఇదే ఈ సంస్థ యొక్క విశిష్టత. దేశ హితమే ప్రధాన ధ్యేయంగా 60 లక్షల మంది స్వయం సేవకులు ఆ సంస్థ గొడుగు కింద దేశ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమైన విషయం. పైగా ఒక రాజకీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి, దేశ భద్రత విషయంలో, దేశ సమగ్రత విషయంలో నిర్మాణాత్మకమైన సలహాలను, సూచనలను దేశ రాజకీయ నాయకులకు అందిస్తూ, దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవడం ప్రపంచంలోని ఏ స్వచ్ఛంద సంస్థకు సాధ్యం కానీ విషయమే!

దేశ విభజనను అడ్డుకోలేకపోయినా..

మతం ఆధారంగా దేశాన్ని ముక్కలు చేయడం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి సుతరామూ ఇష్టం లేదు. 1947 నాటికి బాల్య దశలో ఉన్న సంఘానికి దేశ విభజనను అడ్డుకునే శక్తి లేదు. దేశ విభజన అనంతరం పాకిస్తాన్‌లో చిక్కుకుపోయిన హిందూ కుటుంబాలను కాపాడడంలో స్వయం సేవకులు ప్రాణాలను పణంగా పెట్టారు. కాందిశీకులకు పునరావాసం కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషించింది. 1947లో జమ్మూకశ్మీర్ సంస్థాన విషయమై పాకిస్తాన్‌తో భారత్ యుద్ధం చేసే సమయంలో మన యుద్ధ విమానాలు శ్రీనగర్ విమానాశ్రయంలో దిగటానికి వీలు లేని పరిస్థితుల్లో 670 మంది స్వయం సేవకులు విమానాశ్రయంలోని మంచు గడ్డలను తొలగించి, భారత సైన్యానికి ఆహ్వానం పలికారు. నాటి కశ్మీర్ రాజు హరి సింగ్‌ను కశ్మీర్ విలీకరణకు ఒప్పించడంలో ఆర్ఎస్ఎస్ ద్వితీయ సర్ సంఘ్ చాలక్ నిర్వహించిన పాత్ర, భారత చరిత్రలో నిలిచిపోయింది. ఈ సంప్రదింపులు జరపడానికి ప్రత్యేక విమానంలో గురూజీని శ్రీనగర్‌కు పంపడం జరిగింది.

యావజ్జీవిత జీవన వ్రతం

ఇక ఆర్ఎస్ఎస్ సంస్థలో కొనసాగే ప్రచారక్ వ్యవస్థ విలక్షణమైనది. అనన్య సామాన్యమైనది. కుటుంబాన్ని, బంధువులను వదిలి, దేశ హితమే ధ్యేయంగా, నిరాడంబరంగా భారతమాత సేవలో తరించడం ఆర్ఎస్ఎస్ ప్రచారకులకు సర్వసాధారణమైన విషయం. ఇలాంటి జీవన వ్రతాన్ని ఆచరించే ప్రచారకులు 5200 మంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల విస్తరణలో వీరు ప్రధాన భూమికగా నిలుస్తారు.

సామాజిక సమరసతా సాధన..

ఇక ఆర్ఎస్ఎస్‌ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే.. ఆ సంస్థ నిర్వహించే సేవా కార్యక్రమాలను దగ్గరుండి చూడవలసిందే. ప్రజలకు సర్వీసు అందించడంలో ఆ సంస్థకు ఎటువంటి వివక్ష ఉండదు. దేశంలోని నిమ్న వర్గాల బాధలను, వివక్షలను, మనోభావాలను స్వయం సేవకులు సంవేదనతో అర్థం చేసుకుంటారు. ఆ వర్గాల సమస్యలకు మూల కారణాలను వెతుకుతారు. సామాజిక సమరసత సాధనలో ఆర్ఎస్ఎస్ నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తోంది. నిమ్న వర్గాలకు చెందిన అనేకమంది స్వయం సేవకులు ఆర్ఎస్ఎస్‌లో కీలక బాధ్యతలను నిర్వర్తించడం ఆ సంస్థ వ్యతిరేకులకు అర్థం కాని విషయం! ఇక చివరగా ఆర్ఎస్ఎస్‌ను ఈ దేశంలో చాలామంది ద్వేషిస్తారు. దూషిస్తారు. కానీ ఆ సంస్థ కార్యకర్తలు దూషించే వారిని, ద్వేషించే వారిని కలుపుకుని దేశానికి సేవ చేయాలని కోరుకోవడమే విచిత్రం!

(ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా)

-ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

94417 37877

Next Story