- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీ అంటేనే వెన్నులో వణుకు!
అధికారంలో ఉన్న అయిదేళ్లు ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాలరాయడానికి శ్రమించిన జగన్ రెడ్డి అహంకారాన్ని జనం నేలకు దించిన తరవాత కూడా జన తంత్రాన్ని గౌరవించడం లేదు.. ప్రజాసమస్యలపై మాట్లాడటానికి అసెంబ్లీకే పోనక్కర్లేదన్నది జగన్ రెడ్డి దొంగ సిద్దాంతం..

అధికారంలో ఉన్న అయిదేళ్లు ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాలరాయడానికి శ్రమించిన జగన్ రెడ్డి అహంకారాన్ని జనం నేలకు దించిన తరవాత కూడా జన తంత్రాన్ని గౌరవించడం లేదు.. ప్రజాసమస్యలపై మాట్లాడటానికి అసెంబ్లీకే పోనక్కర్లేదన్నది జగన్ రెడ్డి దొంగ సిద్దాంతం.. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించి, అధికార యంత్రాంగాన్ని జనానికి జవాబుదారీగా చేయడానికి ఉద్దేశించినవే చట్టసభలు. అసెంబ్లీలో సభ్యులు ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పితీరాలి..
ఎమ్మెల్యేలనూ రానివ్వరేంటి?
ప్రజలు తమ నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రజాప్రతినిధులు వాటిని సభలో ప్రస్తావిస్తే, అవి త్వరగా పరిష్కారమవుతాయి. అసెంబ్లీ వేదికగా జనానికి మేలుచేసే అవకాశాన్ని జగన్ రెడ్డి కాల దన్నుతుంటే ఆయన ఎమ్మెల్యేలు కూడా సభకు ఎగనామం పెట్టి తమను నమ్మి గెలిపించిన 11 నియోజకవర్గాల ప్రజల గుండెల మీద తన్నుతున్నారు.. ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే వెనుక లక్షలాది మంది ఆశలు ఉంటాయి.. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని, చర్చల్లో పాల్గొని నిధులు సాధిస్తారని నమ్మి ఓటు వేస్తారు. కానీ, సభను బహిష్కరించడం ద్వారా వైసీపీ ప్రజా ప్రతి నిధులు తమను గెలిపించిన ఓటర్లకు వెన్నుపోటు పొడుస్తున్నారు..
మైకుల ముందే జనోద్ధారకుడా?
అసెంబ్లీ అంటే అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం కనుగొనే వేదిక. అంతేకాదు ప్రభుత్వ విధి, విధానాలను, ప్రశ్నించడానికి, అవకతవకలను వెలుగులోకి తేచ్చి ప్రశ్నించడానికి ఒక అవకాశం వున్న, అయిదు కోట్ల ప్రజల మనోభీష్టాలను ప్రతిబింబించే రాజ్యాంగ దేవాలయం. అటువంటి అసెంబ్లీకి వెళ్లకుండా, శాసనసభ్యుడుగా, మాజీ ముఖ్య మంత్రిగా తన భాధ్యతలు నిర్వర్తించకుండా మురికి మీడియా గొట్టాల ముందు అసలైన జనోద్దారకుడిని నేనే అంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు..
సొంత మీడియోలో గర్జిస్తే సరా?
అసెంబ్లీ లో ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికే ప్రతి పక్షం ఉందన్న నాటి సిద్ధాంతాలపై జగన్‌కి ఏ మాత్రం నమ్మకం లేదు.. తాడేపల్లి ప్యాలెస్‌లోనో, బెంగళూరు ప్యాలెస్ లోనో సేద తీరుతూ అప్పుడప్పుడు బయటికి వచ్చి మీడియా ముందు అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు.. తనకు నలభై శాతం ఓట్లు పడ్డాయని చెప్పుకొనే జగన్ మరి అంతమంది ప్రజల తరపున అసెంబ్లీలో మాట్లాడటానికి వెళ్లాల్సిన భాధ్యత లేదా? చంద్రబాబు పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నట్టు బయట పెడబొబ్బలు పెడుతున్నారు.. మరి మీరు చెప్పే ప్రజల కష్టాలపై అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడరు? బయట సొంత మీడియా మైకులు ముందు గర్జించడం కాదు. ధైర్యం ఉంటే, ప్రజల పట్ల బాధ్యత ఉంటే, మీరు ప్రజా పక్షం అయితే అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరు?
అపరాధం లేకుంటే అసెంబ్లీకి రావచ్చు కదా?
మీ ఏలుబడిలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామీ పవిత్రమైన దివ్య ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేసి కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన మహాపా తకాన్ని కప్పి పుచ్చుకునేందుకు లడ్డు తయారీ విషయంలో అపరాధమేమి జరగలేదని అడ్డగోలుగా బుకాయిస్తున్నారు. కల్తీ నెయ్యి వాడే ప్రసక్తే లేదని, తాము పవిత్రులం అంటూ వీధులకెక్కి వీరంగాలు వేస్తున్నారు కదా.. మరి అదే విషయం అసెంబ్లీకి వెళ్లి ఎందుకు మాట్లాడరు?
పది నిమిషాలు మొక్కుబడిగా కూర్చుని..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాసన సభ్యులుగా ప్రమాణం చెయ్యడానికి ఒక్కసారి, మరోసారి గవర్నర్ ప్రసంగం సమయంలో అసెంబ్లీకి వచ్చారు జగన్, ఆయన ఎమ్మెల్యేలు.. తర్వాత జరిగిన అసెంబ్లీకి రాలేదు. ఇప్పుడు అటెండెన్సు కోసం మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ప్రజా స్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేసి గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. శాసనసభ అంటే కేవలం సంతకాలు పెట్టి వెళ్లేదా? ఆరు నెలలు సభకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు అవుతుందనే నిబంధన నుంచి తప్పించుకోవడానికే ఒక పది నిమిషాలు మొక్కుబడిగా కూర్చుని వెళ్లి పోతున్నారు..
ప్రజలను వంచించండం కాదా?
రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల కంటే ఎక్కువ కాలం సభకు హాజరు కాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుంది. ఆ గడువు ముంచుకొస్తున్నప్పుడో, లేదా ఆ నిబంధనను మేనేజ్ చేయడానికో వచ్చి. సంతకం పెట్టి వాకౌట్ చేయడం ప్రజలను వంచించడమే. మీకు జీతాలు కావాలి, కానీ బాధ్యత పట్టదా?ప్రజలు చెల్లించే పన్నుల నుంచి నెలకు లక్షల రూపాయల జీతాలు, అలవెన్సులు తీసుకుంటున్న ప్రజాప్రతినిధులు సభకు రాకపోవడం నైతిక నేరం కాదా?. పది నిమిషాలు ఉండి వెళ్ళిపోయే వారికి పూర్తి జీతాలు తీసుకోవడానికి మనసెలా వస్తోంది?
సభ్యత్వం కోసం సాకులెందుకు?
అసెంబ్లీకి రాకుండా నియోజకవర్గాల అభివృద్ధి కోసం, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల కోసం, పేదలకు అందాల్సిన పథకాల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యతను విస్మరించి, కేవలం సభ్యత్వం పోకుండా ఉండటం కోసం సభకు రావడం ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాయడమే.. జనానికి నిజంగా మంచి చేయాలనే ఆలోచనే కనుక జగన్ రెడ్డికి ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదాకోసం శోకాలు పెట్టరు.. సభ లోపల ఉండి ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం లేకనే పలాయన వాదం వినిపిస్తున్నారు. సొంత మీడియా మైకుల ముందు వినిపించే గర్జనలు సభలో వినిపిస్తేనే వాటికి విలువ, అధికారిక రికార్డుల్లో స్థానం ఉంటుంది. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపడానికి అసెంబ్లీని మించిన వేదిక లేదు.. ఏది ఏమైనా అసెంబ్లీ వంక చూడాలంటేనే జగన్ వెన్నులో వణుకుపుతుంది!
- నీరుకొండ ప్రసాద్
98496 25610






