యుద్ధ గతిని మార్చేసిన కృత్రిమ మేధాస్త్రం

by Ravi |   (  Updated:2025-07-29 00:45:54  IST  )

సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తోంది. అందులో సైనిక వైమానిక నౌకలు, ఆయుధ స్థావరాలకు

యుద్ధ గతిని మార్చేసిన కృత్రిమ మేధాస్త్రం
X

సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తోంది. అందులో సైనిక వైమానిక నౌకలు, ఆయుధ స్థావరాలకు కూడా మినహాయింపు కాదు. శత్రువులపై విజయం సాధించేందుకు, ఖచ్చితమైన ఫలితాల కోసం దేశాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నాయి. ఇందులో మానవ రహిత ఆయుధాలు, డ్రోన్లు, రోబోటిక్స్, ఆధునిక ఆయుధాలు వంటి పరికరాలు ప్రాధాన్యం పొందాయి. కృత్రిమ మేధ వాడకం పెరుగుతున్న ఈ కాలంలో రణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక సాధనాల వినియోగం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ పరిణామాలు కూడా ఆధునిక సాంకేతికత ప్రాముఖ్యతను స్పష్టంగా సూచిస్తున్నాయి. ఈ యుద్ధాలలో డ్రోన్లు, ఉపగ్రహ నెట్‌వర్కులు, లేజర్ గైడెడ్ క్షిపణులు ప్రధానంగా ఉపయోగించబడు తున్నాయి. ఖచ్చితంగా లక్ష్యాలను ఎంచుకుని దాడులు చేయడం, శత్రు ఆధారాలను రహస్యంగా గుర్తించి పేల్చడం వంటి అంశాలు ఆధునిక సాంకేతికతతో సాధ్యమవుతున్నాయి. యుద్ధంలో విజయం కేవలం శక్తితో కాకుండా జ్ఞానం, ధైర్యం, ఆయుధ సామర్థ్యం, ఆర్థిక శక్తి వంటి నాలుగు అంశాల సమన్వయంతో సాధించవచ్చు. సరైన సాధన, శ్రమ, ఆయుధ శాస్త్రం విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే యుద్ధంలో విజయం కోసం సమగ్ర సన్నద్ధత అవసరం.

కృత్రిమ మేధ.. అత్యాధునిక వ్యవస్థలు

యుద్ధ సమయంలో వేగంగా నిర్ణయాలు తీసుకో వడంలో, ప్రక్రియలను వేగవంతం చేయడంలో, సమాచార విశ్లేషణను మెరుగుపరచడంలో కృతిమ మేధ కీలక పాత్ర పోషిస్తుంది. డ్రోన్లు, మానవ రహిత యంత్రాలు యుద్ధాన్ని సులభతరం చేస్తున్నాయి. ఇవి సైనికుల ప్రాణాలకు ముప్పును తగ్గించడమే కాక, ఖచ్చితంగా లక్ష్యాలను చేధించడంలో కీలకంగా మారాయి. డ్రోన్లు మాత్రమే కాక, జలాంతర్గాముల కోసం రూపొందించిన మానవ రహిత జలయానాలు కూడా శత్రు స్థావరాలను గుర్తించడంలో ఉపయోగపడుతున్నాయి. రోబోటిక్ వ్యవస్థలు బాంబుల నిర్వీర్యకరణ వంటి ప్రమాదకర కార్యక్రమాల్లో ఉపయోగపడుతున్నాయి. ఈ అన్ని వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసే విధంగా రూప కల్పన చేయబడి, మానవ ప్రమేయాన్ని తగ్గించడంతో పాటు సమర్థతను పెంచుతున్నాయి.

ఆపరేషన్ సిందూర్.. ఉత్తమ ఉదాహరణ

ఇటీవల జరిగిన పాక్‌పై భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఈ పరిణామాలకు ఉత్తమ ఉదాహరణ. పాకిస్తాన్ డ్రోన్ల ముప్పును నాలుగు రోజుల్లో సమర్థంగా ఎదుర్కొన్న భారత్, పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. డ్రోన్లు భారత్ గగనతలాన్ని తాకక ముందే నిర్వీర్యం చేయడం దేశ రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని తెలియజేసింది. ఈ సందర్భంలో పాకిస్తాన్ చైనా సాంకేతికతపై ఆధారపడినప్పటికీ, భారత్ మాత్రం స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించి విజయవంతంగా వ్యూహాత్మక విజయం సాధించింది.

స్వదేశీ సామర్థ్యాన్ని పెంచుతూ..

ప్రస్తుతం భారత ప్రభుత్వం రక్షణ రంగంలో ప్రత్యేక దృష్టి సారిస్తూ బడ్జెట్ కేటాయింపుల్లో పెరుగుదల చేసింది. కొత్త ఆయుధాల కొనుగోలుకు మాత్రమే కాకుండా, స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర భారత్’ విధానాల కింద దేశీయ ఉత్పత్తుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తోంది. ఆయుధ తయారీ సంస్థలకు ప్రోత్సాహక రుణాలు, సాంకేతిక సహకారం అందిస్తూ, స్వదేశీ పరిశ్రమల సామర్థ్యాన్ని పెంపొందిస్తున్నారు. విదేశీ ఆయుధాలపై ఆధారాన్ని తగ్గించుకోవడానికి, దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో భారత సైన్యం ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాలతో సజీవంగా నిలబడేందుకు ఇలాంటి చర్యలు మరింత అవసరం.

-సుధాకర్ వి

99898 55445

Next Story