ఫెమినిస్టుకు నిర్వచనం తాయి కిళవి

by Ravi |   (  Updated:2026-04-18 01:01:14  IST  )

హీరో హీరోయిన్లు లేకుండా, ఒక 70 ఏళ్ల వృద్ధురాలి కథతో రూపొందిన ‘తాయి కిళవి’ సినిమా మహిళా సాధికారత, గ్రామీణ జీవితం, కుటుంబ సంబంధాలపై బలమైన సందేశాన్ని అందిస్తుంది.

ఫెమినిస్టుకు నిర్వచనం తాయి కిళవి
X

ఈ మధ్య సినిమా కథలన్నీ ప్రేమ, పెళ్లి, హీరో తండ్రితోనో, హీరోయిన్ తండ్రితోనో గొడవలు, ఫైటింగ్ సీన్స్. నాలుగైదు లవ్ సాంగ్స్. ఇవి ఉంటేనే హిట్ అవుతుందన్న భావన బాగా పెరిగింది. సందేశాత్మక సినిమాలు కూడా సక్సెస్ అవుతాయని తెలుగు సినిమా మరిచిపోతోంది. చూపించే తరహాలో, ఈ జనరేషన్‌కి అర్ధమయ్యేలా చెప్తే ఆదరిస్తారనడానికి తాజాగా తమిళ్‌లో రిలీజ్ అయిన ‘తాయి కిళవి’ సినిమా ఓ మంచి ఉదాహరణ. ఇది తెలుగులోనూ డబ్ అయింది.

ఈ సినిమాలో హీరో హీరోయిన్లు లేనే లేరు.. అంతా 70 ఏండ్ల ముసలావిడే. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ ఆమెనే. ఆమె చుట్టూ తిరిగిన కథ ఆధ్యంతం ఆసక్తిగా ఉంది. ఈ సినిమాలో మానవీయ కోణంతో పాటు సమాజానికి మంచి సందేశం దాగి ఉంది. మహిళా సాధి కారత ఎట్లా సాధ్యమవుతుందో చూపించిన సినిమా ఇది.

ఆద్యంతం గ్రామీణం..

ఈ సినిమాలో 70 ఏండ్ల వృద్ధురాలి పాత్రలో నటించింది ఎవరో గుర్తించడం కష్టం. అంతగా ఆ పాత్రలో ఒకప్పటి హీరోయిన్ రాధిక ఒదిగిపోయారు. ఆ పాత్ర ఆమె మాత్రమే చేయగలదని నిరూపించారు. ఓ కమల్ హాసన్, ఓ రజినీకాంత్.. పౌరాణిక పాత్రలతో పోలిస్తే ఎన్టీఆర్.. అంతగా పాత్రకు ఆమె జీవం పోశారంటే నమ్మండి. సాధారణ గ్రామీణ వృద్ధురాలు ఎలా ఉంటుందో అచ్చుగుద్దినట్లుగా అలా ఉంది. హాట్ స్టార్‌లో ఈ సినిమా చూసి మతి పోయింది. రాధిక సినిమా కదా అని టీవీలో సినిమా పెట్టాను. పేరు కూడా తమిళ్ భాష(తాయి కిళవి)లో ఉండడం వల్ల ఎలాంటి స్టోరీ ఉంటుందో మొదట అర్ధం కాలేదు. పక్కా తమిళ గ్రామీణ హాస్యంతో కూడినది. బలగం సినిమాలో తాత క్యారెక్టర్ గ్రామస్థులతో ఎంత జాలీగా ఉంటాడో.. ఆ క్యారెక్టర్‌కి ఇది రివర్స్‌గా ఉంటుంది. అంటే గయ్యాళి పాత్రగా కనిపిస్తుంటుంది. కానీ ఆ గయ్యాళితనం వెనుక మంచితనం కూడా ఉంటుంది.

కొడుకులు దూరం..

పావున్ తాయి అనే 70 ఏండ్లకు పైగాబడిన ముసలావిడ (రాధిక) ఊరంతటికీ డబ్బులు వడ్డీలకు ఇస్తుంది. వడ్డీలు వసూలు చేస్తూ బతుకుతుంది. ఎవరైనా వడ్డీ, అసలు డబ్బులు ఇవ్వకపోతే తిట్టి, తన్ని వసూలు చేస్తుంది. అలాగే ఊర్లో ఎవరైనా రౌడీ చేష్టలు, పేకాట వంటివి ఆడుతున్నా సహించని క్యారెక్టర్ ఆమెది. అందుకే గ్రామంలో చిన్నాపెద్దలందరికీ ఆమె అంటే పడేది కాదు..ఎప్పుడు చస్తుందా? అని ఎదురుచూసేవారు. ఆమె మాత్రం తాను చావనని, బలమైన తిండి తినేదాన్ని అంటూ గొప్పలు పలికేది. ఈమె చావాలని అందరూ దేవుడ్ని ప్రార్ధించేవారు. ఆమె వీధిలో నడుస్తూ వస్తుందంటే చాలు.. అంతా గప్ చుప్‌గా మారేది. అలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. పావున్ తాయికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి.. ఐతే ఆమె భర్త చనిపోగానే పిల్లలు ఆస్తి పంచాలని పేచీ పెడతారు.. ఊరి పెద్ద మనుషులంతా అదే చెబుతారు. కానీ పావున్ తాయి మాత్రం ససేమిరా అంటుంది. దాంతో ముగ్గురు కొడుకులు వేర్వేరు ప్రాంతాల్లో సెటిల్ అవుతారు. అల్లుడేమో కూతురుని వదిలేసి వెళ్లిపోతాడు.. ఆ రోజు నుంచి డబ్బులు వడ్డీకి ఇస్తూ బాగా సంపాదిస్తుంది. పావున్ తాయి వారానికి ఒకసారి టౌన్‌కి వెళ్లేది, కానీ ఎందుకో ఎవరికీ తెలియదు. ఆమె కొడుకులు ఆమె చనిపోతే ఆస్తి పంచుకోవాలనే ఆశలో ఉంటారు. పావున్ తాయి మాత్రం తన కూతురికి ఫైనాన్స్ మెనేజ్మెంట్ నేర్పించడంతో పాటు రకరకాల పనులు నేర్పిస్తుంది.

బంగారం చుట్టూనే..

ఈ సినిమా అంతా ఆమె దాచిపెట్టిన బంగారం ఎక్కడ పెట్టిందనే దాని మీద నడుస్తుంది. ఈ కథకు మూలం ఒక నిజ జీవిత పాత్ర అని చదివాను గానీ, ఈ సినిమా చూస్తున్నంత సేపూ ఏదో హాలీవుడ్ సినిమానో, లేక కొరియన్ సినిమానో చూసిన గుర్తు వస్తూ ఉంది. ఎవరికైనా తడితే చెప్పండి. ఒక రోజు పావున్ తాయికి పెరాలసిస్ వచ్చి పడిపోతుంది. ఈ సమయంలో ఊరంతా పండగ చేసుకుంటుంటారు.. ఈ క్రమంలో పావున్ తాయిని చూడటానికి టిప్‌టాప్‌గా రెడీ అయిన ఒక వ్యక్తి వస్తాడు.. అతను పావున్ తాయిని చూసి బయటికి వస్తాడు. అప్పటికే వేచి ఉన్న ఊరు ఆయన ఎవరు నువ్వు? పావున్ తాయి మీకు ఏం అవుతుందని అడుగుతాడు. అతను పావున్ తాయి మా బ్యాంకులో ఉన్న 120 తులాల బంగారం తీసుకొచ్చిందని చెప్తాడు. ఈ విషయాన్ని వెంటనే ముగ్గురు కొడుకులకు చెప్తాడు.. ఇహ ఆ బంగారం ఎక్కడ దాచి పెట్టిందో తెలుసుకోవడానికి ఆపసోపాలు పడుతారు.

మంచాన పడగానే..

పావున్ తాయి పక్షవాతం కారణంగా ఆమె మాట పడిపోయింది. దాంతో ఏవేవో సైగలు చేస్తుంది. ఆఖరికి ఆ సైగలకు అర్ధం తెలుసుకునేందుకు లక్షకు పైగా ఖర్చు పెట్టి నిపుణుడిని తీసుకొస్తారు. కానీ ఏం అంతు చిక్కలేదు. అప్పుడు ఇక బతికించకపోతే 120 తులాల బంగారం దక్కదని రహస్యంగా ముగ్గురు కొడుకులు మాట్లాడుకుంటారు. అప్పటి దాకా ఆ ముగ్గురికి మాటల్లేవు. ఇప్పుడు ఒక్కొక్కరికి 40 తులాల బంగారం వస్తుందని ఏకమవుతారు. వెంటనే డాక్టర్‌ని పిలిచి బతికించమని అడుగుతారు. ఆయన చూసి పెద్దాసుపత్రికి తీసుకెళ్లాల్సిందేనంటారు. ఇక తప్పేటట్లు లేదని పెద్దాసుపత్రిలో చేర్పిస్తారు. అక్కడ రూ.18 లక్షల దాకా ఖర్చు అవుతుందంటారు.. ఎలాగూ బంగారం వస్తుందని అప్పులు చేసి ఆపరేషన్ చేయిస్తారు. బతికి ఇంటికి వచ్చేస్తుంది. ఆరోగ్యంగా ఉన్నానంటూ ఊరంతటికి చెప్పేస్తుంది. ఆ ఊరోళ్లంతా పూజలు ఫలించలేదంటూ నిరాశకు గురవుతారు.

ఒంటరి మహిళగా..

మగవాడి సహకారం లేకపోయినా ఇంటిని చక్కదిద్దాలి మహిళ.. మహిళ అన్నీ చేయగలదు. డబ్బులు ఎలా పొదుపు చేయాలి, వాటిని ఎలా పెంచాలి? అన్ని విషయాలు మగవాళ్ల కంటే మహిళలకే బాగా తెలుసు.. అందుకే నేను పైసా పైసా కూడబెట్టాను. ఇంటి పెత్తనం భర్తలకు ఇవ్వొద్దు. మీరే తీసుకోవాలంటూ కోడళ్లకు, కూతురుకు చెప్తుంది. మహిళా సాధికారత అంటే ఊరకనే రాదు. చేసే పని ఏదైనా అందులో ముందు మీకు స్వాతంత్ర్యం ఉండాలి. అది సాధిస్తే.. వాడూ వీడూ ఇచ్చే స్వేచ్చ మీకెందుకే! నేనేమీ ఈ ఊర్లో చాలా మంది ఆడోళ్ళ కంటే ఎక్కువ కష్టమేమీ పడలేదు. కాస్త తెలివిగా బతికానంతే. అందుకే ఈ ఊరిలో ఆడదాని పేరు మీద ఉన్న ఇల్లు నా ఇల్లొక్కటే. ఈ సృష్టించడం, రక్షించడం, నాశనం చేయడం ఇవన్నీ మొగోళ్ళు చూసుకుంటారని చెప్పినోడే, (దేవుడు) దుడ్డూ, చదువూ ఆడోళ్ళ చేతిలో పెట్టాడు! ఎందుకంటే ఆరుని నూరు చెయ్యగలిగింది మనమే అని ఆ మొగోడిక్కూడా తెలుసు.. నేను ఆడదాన్ని అని మాటలు చెప్తే సరిపోదు. బతికి చూపించాలంతే.. అంటుంది. ఆఖరున 120 తులాల బంగారాన్ని ముగ్గురు కోడళ్లు, కూతురుకు సమానంగా పంచి ఇస్తుంది. ఫెమినిజం అంటే ఏమిటో అర్ధం కావాలంటే పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన పనిలేదు.. ఈ సినిమా చూపిస్తే చాలు. ఐతే ఇలాంటి పాత్రలు ప్రతి ఊరిలో కనిపిస్తూనే ఉంటాయి. మహిళా సాధికారత అంటే ఏమిటో చూపించడంతో పాటు కాసిన్ని డబ్బులు లేకపోతే వారసులెవరూ చూసుకోరని కూడా ఈ సినిమా స్పష్టం చేస్తుంది.

–శిరందాస్ ప్రవీణ్​కుమార్

80966 77450

Next Story