- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలుగు రాష్ట్రాలకు ఉషస్సులు

జనవరి 20 నుండి 24 వరకు, స్విస్ పట్టణం దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరమ్ 2025 వార్షిక సమావేశానికి వేదికయింది. ఈ దఫా దావోస్ సదస్సులో పెట్టుబడుల సేకరణ కోణంలో తెలుగు రాష్ట్రాల పంట పండినట్లయింది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో వరుస భేటీలు, చర్చలు జరిపింది. వేల కోట్ల రూపాయల విలువైన ఎంవోయూలపై ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ సైతం రాష్ట్రానికి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడంలో గణనీయమైన ప్రగతిని సాధించింది.
2025 సవాళ్లను ఎదుర్కోడానికి అవసరమైన సూత్రాలు, విధానాలు, భాగస్వామ్యాలను రూపొందించడానికి, నమ్మకాన్ని పునర్నిర్మించడానికి కలిసి పని చేయడం దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరమ్ లక్ష్యం. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, ఈ పురోగతితో వచ్చే అవకాశాలపై అభివృద్ధి చెందుతున్న రంగాలపై రెండు తెలుగు రాష్ట్రాలు దృష్టి సారించి దావోస్ వేదికగా అనేక ఒప్పందాలను పెట్టుబడులను ఆకర్షించాయి.
తెలంగాణ పంట పండినట్లే
రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో వరుస భేటీలు, చర్చలు జరిపింది. అమెజాన్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం చర్చించింది . సీఐఐ సారథ్యంలో వివిధ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశాలు జరిపి పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రాంతమని సరైన విధి విధానాలతో పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు ప్రభుత్వాన్ని సంప్రదిస్తే త్వరిత గతిన అనుమతులు, ఇతర మౌలిక సౌకర్యాలను కల్పిస్తుందని తెలియజేశారు. దీంతో తెలంగాణాకు భారీగా పెట్టుబడులు వచ్చాయి.. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ యూనిలీవర్, హైదరా బాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రభు త్వంతో ఎంవోయూ చేసుకుంది. పామాయిల్ యూనిట్‌కు యూనిలీవర్, రాకెట్ తయారీ, పరీక్ష కేంద్రం ఏర్పాటుకు స్కైరూట్ ముందుకొచ్చింది. స్కైరూట్ ఏరోస్పేస్‌తో హైదరాబాద్‌లో రూ.500 కోట్లతో రాకెట్ తయారీ, పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసేందుకు స్కైరూట్ ఏరోస్పేస్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఈ సద స్సులో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, పునరుత్పాదక ఇంధనం, పంప్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి అందిస్తున్న ప్రోత్సాహకాలతో పాటు హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ, డేటా సెంటర్లపై ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ (HCL) హైదరాబాద్‌లో టెక్ సెంటర్ ఏర్పాటు చేయ నుంది. మొత్తం మీద 4 రోజుల దావోస్ పర్యటన సందర్భంగా 16 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం రూ. 1,78,950 కోట్ల మేరకు అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులను సాధించింది, వీటివల్ల కనీస పక్షంగా 50 వేల ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి.
ఏపీకి లక్ష కోట్ల పైగా పెట్టుబడులు..
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడంలో గణనీయమైన ప్రగతిని సాధించారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, ఆమోద ప్రక్రియలు, అభివృద్ధి లక్ష్యాలను ముఖ్యమంత్రి వివరించారు. డానిష్ షిప్పింగ్ దిగ్గజం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని వ్యక్తం చేసింది. నెట్‌వర్కింగ్, టెక్నాలజీ ఇన్నోవేషన్‌లో గ్లోబల్ లీడర్‌గా, విశాఖపట్నం లేదా తిరుపతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జిసిసి)ని స్థాపించడానికి సిస్కో ఆహ్వానించబడింది. రాష్ట్రం లో లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్‌ను స్థాపించాలని ఎల్‌జికెమ్‌ను ముఖ్యమంత్రి కోరారు. మూలాపేట, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో పెట్రో కెమికల్ యూనిట్లు, తిరుపతిలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కార్ల్స్‌బర్గ్ గ్రూప్ పండ్ల రసాలు, శీతల పానీయాలు, బీర్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ల ప్రధాన ఉత్పత్తిదారు అయిన ఆ కంపెనీ విశాఖపట్నం, కృష్ణపట్నం లేదా శ్రీ సిటీ ఇండస్ట్రియల్ పార్కులలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చింది. ఇలా సంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ విద్యుదుత్పత్తిపై దృష్టి కేంద్రీకరించామని, ఈ రంగాల్లోకి 115 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.లక్ష కోట్లు) పెట్టుబడులు ఏపీకి రానున్నాయి.
ఇలా రెండు తెలుగు రాష్ట్రాలు దావోస్‌లో వివిధ బహుళ జాతి కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ ఆధికారులతో చర్చలు జరిపి పెట్టుబడులకు ఇరు రాష్ట్రాలు అనుకూల ప్రాంతాలని పేర్కొనటం. కొన్ని ఒప్పందాలు చేసుకోవడం మరికొన్ని తుది దశలో ఉండటం ముదావహం. ఒప్పందాలకు కార్య రూపం తీసుకువచ్చి త్వరితగతిన అనుమతులు ఇతర సౌకర్యాలు అందించడంలో అధినేతలతో పాటు అధికారులు సైతం చిత్తశుద్ధితో వ్యవహరించి కార్యాచరణ చేపడితే రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాలు అభివృద్ధి ఉషస్సులు విరాజిల్లనున్నాయన్నది సుస్పష్టం.
- సుధాకర్ వి
99898 55445