కులరహిత స్ఫూర్తి.. ఇంటిగ్రేటెడ్ విప్లవం!

by Ravi |   (  Updated:2026-06-17 01:15:45  IST  )

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా కుల, మత భేదాలకు అతీతంగా అన్ని వర్గాల విద్యార్థులకు సమాన విద్య అందించే లక్ష్యంతో చేపడుతున్న విద్యా సంస్కరణలు, సామాజిక సమానత్వం దిశగా వేస్తున్న కీలక అడుగులపై ప్రత్యేక కథనం.

కులరహిత స్ఫూర్తి.. ఇంటిగ్రేటెడ్ విప్లవం!
X

కులరహిత సమాజం కావాలంటే అన్ని కులాలు, వర్గాల పిల్లలు ఒకే పాఠశాలలో కలిసి చదవాలి. తరగతి గదిలో మొదలయ్యే సమానత్వమే సమాజంలో సోదరభావానికి పునాది. విద్యే సామాజిక విముక్తికి ప్రధాన ఆయుధం.. ఇది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ వినిపించిన నినాదం. ఇదే స్ఫూర్తితో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళుతోంది.

నేటి సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కుల గజ్జి, మత మౌఢ్యంతో సమాజంలో పెచ్చరిల్లుతున్న దుష్ట పోక డలకు బ్రేకులు వేసే దిశగా బలమైన అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజకీయ లాభనష్టాలను పట్టించు కోకుండా, ప్రత్యర్థి పార్టీల విమర్శలను లెక్కచేయకుండా విద్యా రంగంలో సమూల మార్పులకు తొలి అడుగు వేస్తున్నారు. రెండున్నరేళ్ల తన పాలనలో విద్యారంగ బలో పేతానికి కృషి చేస్తున్నారు. నాడు సమైక్య రాష్ట్రంలో, తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన తప్పులను సరి దిద్దుతూ తెలంగాణ విద్యా విధానంలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్..

తరతరాలుగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల, మత వివక్షను కూకటి వేళ్లతో సహా తొలగించాలంటే “అక్షరమే ఆయుధం” అన్న మహాత్మా జ్యోతీబా పూలే, డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ ఆశయాలకు ఆచరణాత్మక రూపం ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది ‘ఇంటిగ్రేటెడ్ రెసిడె న్షియల్ స్కూల్స్’. సమాజంలో కుల గోడలను కూల్చాలంటే, ఇన్నాళ్లు ప్రభుత్వాల చిన్నచూపు, దూరదృష్టి లేమి కారణంగా అసమానతల మధ్య సాగుతున్న చదువును సమానత్వం దిశగా నడిపించాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను వేదికగా మార్చాలని భావిస్తోంది. ప్రతి నియోజకవర్గానికి ఒక “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్” ఏర్పాటు చేస్తోంది. 25 ఎకరాల విస్తీర్ణంలో పాఠ శాలల నిర్మాణాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. అత్యాధునిక మౌలిక వసతులు, ప్రపంచంతో పోటీపడే నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది రేవంత్ సర్కార్.

గోడలు లేని స్కూలు.. భేదం లేని చదువు..

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆధునిక భారత దేశ స్వప్నమైనా, పెరియార్ ఈ.వి. రామస్వామి ఆత్మగౌరవ నినాదమైనా, బీ.ఆర్. అంబేడ్కర్ సమానత్వ స్పూర్తైనా... వారందరూ చెప్పింది ఒక్కటే... చదువు సమానత్వానికి పునాది కావాలని. అయితే గత పాలకులు దీనిని విస్మరించారనే చెప్పాలి. సమైక్య పాలకులు వివక్ష చూపారని పోరాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో సైతం విద్యా వ్యవస్థలో ఆశించిన మార్పు రాలేదు. ఓట్ల కోసం నినాదాల మాదిరిగా గురుకులాలను తీసుకొచ్చిన గత ప్రభుత్వం, వాటిని గొప్పగా ప్రచారం చేసుకుంది. కానీ అదే గురుకులాల్లోని చిన్నారుల మధ్య కుల, మత గోడలను ప్రభుత్వమే మరింత బలోపేతం చేసిందన్న విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాల పేరుతో విద్యార్థులను వర్గాలవారీగా విభ జించడం ద్వారా కుల, మత విభజనకు ప్రభుత్వం తెలియకుండానే బలం చేకూర్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి. అంతేకాదు, ఆ పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు, సరైన వాతావరణం కల్పించడంలో కూడా లోపాలు ఉన్నాయి. ఇప్పటికీ అనేక గురుకులాలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతుండటం దీనికి నిదర్శనం. “నవ తెలంగాణ నిర్మాణం” తమతోనే సాధ్యమని చెప్పిన వారు, పదేళ్లలో ఈ సమస్యలను ఎందుకు పూర్తిగా పరిష్కరించలేకపోయారో చెప్పాలనే ప్రశ్నలు ఇప్పుడు బుద్ధిజీవుల నుంచి వినిపిస్తున్నాయి.

ఇంటిగ్రేటెడ్‌తోనే నవ తెలంగాణ నిర్మాణం

“మంటికైనా ఇంటోడు కావాలి” అన్నట్లు... ఏ వ్యవస్థను మార్చాలన్నా దాని బలం, బలహీనతలు తెలిసిన వ్యక్తి నాయకత్వం అవసరం. చిన్నప్పటి నుంచి కాన్వెంట్ స్కూళ్లకు దూరంగా, సర్కార్ బడిలోనే చదివిన రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పాఠశాలలపై పూర్తి అవగాహన ఉంది. సర్కార్ బడిలో ఉండే లోటుపాట్లు ఆయనకు బాగా తెలుసు. తాను చదివిన కాలానికి, ఇప్పటి ప్రైవేట్-ప్రభుత్వ విద్య మధ్య పెరిగిన అంతరాన్ని, దాని వల్ల సమాజంలో పెరుగుతున్న అసమానతలను గుర్తించిన సీఎం, నవ సమాజ నిర్మాణం దిశగా విద్యారంగంలో సమూల మార్పులకు నాంది పలుకుతున్నారు. కేవలం ప్రభుత్వ విద్యలో ప్రమాణాలు పెంచడమే కాకుండా, సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపాలంటే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలే మార్గమని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లో డిజిటల్ తరగతులు, సాంకేతికత ఆధారిత బోధన, విద్యార్థుల శారీరక దృఢత్వం, పరిశోధనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తూనే... సమాజంలోని అన్ని కులాలు, వర్గాల పిల్లలను ఒకే కప్పు కిందకు తీసుకువస్తోంది. దీంతో పిల్లలు కలిసి భోజనం చేయడం, కలిసి చదువుకోవడం, కలిసి ఆడుకోవడం ద్వారా సమాజంలో సోదరభావం పెరుగుతుందన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలకు ఆచరణ రూపం దక్కనుంది.

కొత్త రూపు.. కొత్త మార్పు దిశగా బడి

“విద్య అనేది కేవలం బతుకుదెరువు కోసం కాదు.. అది మనిషిని సంస్కారవంతుడిగా, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా మార్చాలి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఆ బాధ్యతను నెర వేర్చాలి” అని బలంగా నమ్ముతున్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ బడికి తీసుకొస్తున్న ఈ కొత్త రూపు, రాబోయే తరాల్లో ఒక గొప్ప సామాజిక మార్పుకు సంకేతంగా నిలుస్తోంది. కులాల చీలిక లేని, మతాల విభజన లేని విద్యా విధానంతో నవ తెలంగాణ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నాంది పలికింది. ఈ ప్రభుత్వ సంకల్పానికి ప్రజలు, పౌర సమాజం మద్దతు తోడైతే... భవిష్యత్ తెలంగాణలో “సర్కార్ బడి” అద్భుతాన్ని ఆవిష్కరించడం ఖాయం.

-ఏముల కొండల్ గౌడ్

తెలంగాణ విద్యా కమిషన్ , కన్సల్టెంట్

94406 02724

Next Story