అంబులెన్స్ వెళ్లదు.. ఆయువు నిలవదు!

by Ravi |   (  Updated:2026-06-18 00:45:21  IST  )

తెలంగాణ గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రవాణా సమస్యలు, వైద్యుల కొరత, అంబులెన్స్ సేవల అందుబాటు లోపాలు, గిరిజనుల ఆరోగ్య సవాళ్లపై విశ్లేషణాత్మక కథనం.

అంబులెన్స్ వెళ్లదు.. ఆయువు నిలవదు!
X

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దానికి పైగా గడిచింది. అభివృద్ధి, సంక్షేమం, డిజిటల్ పాలన, వైద్య సేవల విస్తరణ వంటి అంశాల్లో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి. కానీ రాష్ట్రంలోని అనేక గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ‘అత్యవసర వైద్యం’ ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉన్నది. ప్రసవ వేదనతో ఉన్న మహిళను డోలీలో మోసుకెళ్లడం, వాగులు దాటించడానికి కుర్చీలో కూర్చోబెట్టి భుజాలపై తీసుకెళ్లడం, అంబులెన్స్ గ్రామంలోకి రాలేక రోడ్డు పైనే ప్రసవాలు జరగడం వంటి ఘటనలు నేటికీ కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. ఆరోగ్యం అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. కానీ గిరిజన ప్రాంతాల్లో నివసించే వేలాది కుటుంబాలకు ఆ హక్కు ఇంకా పూర్తిస్థాయిలో అందడం లేదు..

వానొస్తే వణుకే..

రాష్ట్రంలో 108, 102 వంటి అంబులెన్స్ సేవలు అందు బాటులో ఉన్నాయి. గర్భిణుల కోసం ప్రత్యేకంగా ‘అమ్మ ఒడి’ వంటి పథకాలు కూడా అమలవుతున్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో సాధారణ రోజుల్లోనే రవాణా సదుపాయం అంతంత మాత్రమే. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఆ పల్లెలకు బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. ఈ సమయంలో విష జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు గిరిజన గూడేలను చుట్టుము‌డతాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా అస్వస్థతకు గురైతే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడం పెద్ద ప్రహసనంగా మారుతోంది. మోకాల్లోతు బురదలో, ఉధృతంగా ప్రవహించే వాగులను దాటుకుంటూ రోగులను తీసుకెళ్లాల్సి వస్తోంది. ఏ చిన్నపాటి జ్వరం వచ్చినా వైద్యం కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిన దుస్థితి గిరిజనుల పాలిట శాపంగా మారింది.

మంచాలు, డోలీలే దిక్కు!

స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. నేటికీ అటవీ ప్రాంతాల్లో రోగులను ఆస్పత్రులకు తరలించేందుకు మంచాలు, డోలీలే దిక్కవుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గూడెంలో నిండు గర్భిణికి నొప్పులు వస్తే.. కనీసం 108 అంబులెన్స్ వెళ్లేందుకు రోడ్డు లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను జోలె కట్టి కిలోమీటర్ల మేర మోసుకుంటూ వెళ్లారు. మార్గమధ్యంలోనే ప్రసవం జరిగి తల్లీబిడ్డల ప్రాణాలు ప్రమాదంలో పడిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. 2025 సెప్టెంబరులో వెలువడిన ఒక నివేదికలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే వారంలో ఇద్దరు నవజాత శిశువులు, ఒక బాలింత సమయానికి వైద్యం అందక మృతి చెందిన ఘటనలు తీవ్ర చర్చకు దారి తీశాయి. అత్యవసర సమయంలో వైద్యం అందక పసికందులు ప్రాణాలు విడుస్తున్న సంఘటనలు ఏజెన్సీ ప్రాంతాల్లో నిత్యకృత్యంగా మారాయి.

పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత!

గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సదు పాయాల లేమి ప్రధాన సమస్యగా మారింది. పీహెచ్‌సీలకు వెళ్దామంటే సరైన రోడ్లు ఉండవు, తీరా కష్టపడి అక్కడికి చేరుకున్నా ఎప్పుడూ వైద్యులు అందుబాటులో ఉండరు. మందుల కొరత, సిబ్బంది నిర్లక్ష్యం రోగులకు శాపంగా మారుతు‌న్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగులను పట్టణ ప్రాంతాల్లోని పెద్దాస్పత్రులకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు తప్పా.. అక్కడికక్కడే మెరుగైన వైద్యం అందించే వ్యవస్థలు కరువయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరచాలంటే ముందుగా రవాణా వ్యవస్థను బాగు చేయాలి.

శాశ్వత పరిష్కారం ఎప్పుడు?

ప్రభుత్వాలు స్పందించి గిరిజనుల ప్రాణాలకు భరోసా కల్పించేలా పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పుడే ఏజెన్సీ పల్లెల్లో నిజమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఒక సమాజ అభివృద్ధిని నగరాల్లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో కాదు.. అత్యంత దూరంలో ఉన్న గిరిజన గ్రామానికి అత్యవసర వైద్యం ఎంత వేగంగా చేరుతుందనే అంశంతో కొలవాలి. పట్టణాల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండటం మంచి విషయమే కానీ.. అడవిలోని ఒక గిరిజన తల్లి సురక్షితంగా ప్రసవించగలిగే పరిస్థితి లేకపోతే అభివృద్ధి అనేది అసంపూర్ణమే.

- నూకల దేవేందర్,

70134 39800

Next Story