- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధ్యాయ సంఘాల పాత్ర హక్కులకేనా.. బాధ్యతలకు లేదా?
రాష్ట్ర విద్యాకమిషన్ నివేదిక నేపథ్యంలో ఉపాధ్యాయుల వేతనాలు, హక్కులు మాత్రమే కాకుండా వారి బాధ్యతలు, నైతిక విలువలు, సర్వీస్ నిబంధనల ఉల్లంఘనపై ఉద్భవించిన కీలక చర్చపై విశ్లేషణ.

రాష్ట్ర విద్యాకమిషన్ నివేదిక చుట్టూ ప్రారంభమైన చర్చ ఉపాధ్యాయుల వేతనాలకే పరిమితం కాకుండా, వారి బాధ్యతలు, నైతిక విలువలు, సేవా ధోరణిపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది.. ఒకవైపు తమ హక్కులు, వేతనాల పరిరక్షణ కోసం ఉపాధ్యాయ సంఘాలు గళమెత్తుతుం డగా, మరోవైపు కొందరు ఉపాధ్యాయులు సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాల్లో నిమగ్నమవుతున్నారన్న ఆరోపణలు వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తు న్నాయి.. ఈ పరిణామాలు విద్యావ్యవస్థలో సమతుల్యత, బాధ్యత, పారదర్శకత అవసరాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
హక్కులు, వేతనాల కోసం మాట్లాడే, పోరాడే హక్కు ప్రతి ఉద్యోగ సంఘానికీ ఉంటుంది. కానీ హక్కుల గురించి మాట్లాడేటప్పుడు కాస్త బాధ్యతల గురించి కూడా ఆత్మవిమర్శ జరగాలి. రాష్ట్రంలో చాలామంది ఉపాధ్యాయులు సర్వీస్ రూల్స్‌కు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.. అలాంటి ఉపాధ్యాయులను దారిలోకి తెచ్చేందుకు ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు ప్రయత్నించడం లేదు?
గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాలు..
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది. సమాజాన్ని నిర్మించే బాధ్యత వాళ్లపై ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు వారికి మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తాయి.. అయితే సర్వీస్ రూల్స్ ప్రకారం ఒక ఉద్యోగి లాభాపేక్షతో కూడిన ఎలాంటి ఇతర వ్యాపారాలు, లావాదేవీలు చేయకూడదు.. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉన్నది. అనేక మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. గుట్టుచప్పుడు కాకుండా అనేక రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఇందులో రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా అవతారమెత్తిన వారు కొందరుంటే.. ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ సామాన్యుల రక్తం పీల్చే వారు మరికొందరు ఉన్నారు.. భార్య లేదా బంధువుల పేర్లపై హోటళ్లు, ఇతర వాణిజ్య కార్యక లాపాలు నిర్వహించే మాస్టార్లు అనేక పట్టణాల్లో కనిపిస్తారు.. నెలనెలా లక్షల్లో చీటీలు నడుపుతూ చిట్ ఫండ్ వ్యాపారాలను నడిపేవారు ఎందరో..? ఇవన్నీ తెలిసినా అలాంటి ఉపాధ్యాయులను దారిలోకి తెచ్చేందుకు ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు ప్రయత్నించడం లేదు?
అనేక మందిపై చర్యలు..
బడిలో పాఠాలు చెప్పాల్సిన గొంతులు.. రియల్ ఎస్టేట్ వెంచర్లలో బేరాలు ఆడుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదు? అనేవి ఇప్పుడు సామాన్యుల మెదళ్లలో మెదులుతున్న ప్రశ్నలు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అనేక మంది ఉపాధ్యాయులు చేస్తున్న దందాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్‌లైన్ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీల పేరుతో జనాలను నిలువునా ముంచిన యూ బిట్ కాయిన్ వ్యవ హారంలో నిర్మల్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏజెంట్లుగా పని చేసినట్లు తేలింది. విద్యాశాఖ సైతం వారిని సస్పెండ్ చేసింది. ఇటీవల ఖమ్మం జిల్లాలో ఒక టీచర్ ఏకంగా ప్రైవేట్ పాఠశాలలు ప్రమోటర్‌గా మారగా.. ఉన్నతాధికారులు వేటు వేశారు. అంతేకాకుండా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా స్థిరాస్థి వ్యాపారంలో ఉపాధ్యాయుల పాత్ర రోజు రోజుకు పెరిగిపోతున్నది. అనేక వివాదాల్లో టీచర్లపై కేసులు అయిన సందర్భాలు సైతం ఉన్నాయి.
ఉపాధ్యాయ సంఘాల మౌనం.. దేనికి సంకేతం?
సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉపా ధ్యాయుల పట్ల ఉపాధ్యాయ సంఘాల తీరు తీవ్ర విమర్శ నాత్మకంగా ఉంది. ప్రభుత్వ విధానాలపై కన్నెర్రజేసే ఈ సంఘాలు.. కొందరు పాధ్యాయులు ఇంతలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే.. చూసీ చూడనట్లు ఎందుకు వదిలేస్తున్నాయి.. వారిని మందలించే ధైర్యం సంఘాలకు లేదా? అత్యధిక శాతం మంది ఉపాధ్యాయులు ఎంతో చిత్తశుద్ధితో, అంకితభావంతో పని చేస్తున్నారు.. మారుమూల గ్రామాల్లో సైతం పేద విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కానీ కాసుల కోసం కక్కుర్తిపడే కొందరు టీచర్లు.. అందరికీ తలవంపులు తీసుకొస్తున్నారు. ఇలాంటి దందాలు చేస్తున్న టీచర్ల గురుంచి ప్రతి ఊళ్లో జనాలకు తెలుసు.. అలాంటప్పుడు ఉపాధ్యాయ సంఘాలకు వారి గురించి తెలియదని చెప్పలేం. కానీ తమ సంఘ సభ్యులను పెంచుకోవాలనే స్వార్థమో.. చందాలు ఇస్తున్నారే కారణమో తెలియదు కానీ.. తప్పు చేస్తున్న వారిని దారిలోకి తెచ్చే ప్రయత్నం ఏ సంఘం కూడా చేయడం లేదు.
విద్యా ప్రతిష్టను కాపాడుకోవడం ముఖ్యమే!
ఉపాధ్యాయ సంఘాలు కేవలం హక్కుల కోసం మాత్రమే కాకుండా.. బాధ్యతల పట్ల కూడా తమ సభ్యులను అప్రమత్తం చేయాలి. వేతనాలు, బదిలీలు, పదోన్నతుల కోసం పోరాడ డం ఎంత ముఖ్యమో.. విద్యా వ్యవస్థ ప్రతిష్టను కూడా కాపాడుకోవడం అంతే ముఖ్యం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని సంఘాల నుంచి బహిష్కరించాలి. అప్పుడే సమాజంలో ఉపాధ్యాయులకు, ఆ సంఘాలకు గౌరవం ఉంటుంది. ప్రభుత్వం సైతం నివేదికలు తెప్పించుకొని వదిలే యకుండా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి.
- మహమ్మద్ ఆరిఫ్,
96184 00190






