దావోస్ వేదికపై తెలంగాణ రైజింగ్

by Ravi |   (  Updated:2026-01-29 00:45:47  IST  )

2026 దావోస్ సదస్సులో తెలంగాణ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం రాష్ట్రం అనుసరిస్తున్న అభివృద్ధి మార్గంపై పెట్టుబడిదారుల విశ్వాసం మరింత బలపడుతున్నదనడానికి స్పష్టమైన సంకేతంగా నిలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన 2025 గ్లోబల్ సమ్మిట్, దావోస్‌లో జరిగిన 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం.. ఈ రెండు వేదికలు తెలంగాణకు పెట్టుబడుల సోపానాలుగా మారాయి.

దావోస్ వేదికపై తెలంగాణ రైజింగ్
X

2026 దావోస్ సదస్సులో తెలంగాణ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం రాష్ట్రం అనుసరిస్తున్న అభివృద్ధి మార్గంపై పెట్టుబడిదారుల విశ్వాసం మరింత బలపడుతున్నదనడానికి స్పష్టమైన సంకేతంగా నిలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన 2025 గ్లోబల్ సమ్మిట్, దావోస్‌లో జరిగిన 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం.. ఈ రెండు వేదికలు తెలంగాణకు పెట్టుబడుల సోపానాలుగా మారాయి. భారతదేశ స్వాతంత్ర్యం శతాబ్ది దశకు చేరువవుతున్న నేపథ్యంలో, తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను ప్రకటించింది. ఈ లక్ష్యానికి అనుగుణంగా ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడమే ప్రధాన ఉద్దేశంగా పెట్టుకుంది. 2025 గ్లోబల్ సమ్మిట్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు సాధించడం ఈ దిశలో కీలక ముందడుగు.

మారనున్న రాష్ట్ర భవిష్యత్

2026 జనవరి 20 నుంచి 22 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధుల బృందం, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఏనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సస్టెయినబిలిటీ, స్కిల్లింగ్ వంటి ఆధునిక రంగాల్లో పలు అంతర్జాతీయ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం రాష్ట్ర భవిష్యత్ దిశను స్పష్టంగా చూపిస్తోంది.

తెలంగాణకు భారీ పెట్టుబడులు..

దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం సాధించిన పెట్టుబడి ప్రతిపాదనలు గణనీయమైనవే.. రూ.12,500 కోట్లతో రష్మి గ్రూప్ స్టీల్ ప్లాంట్, రూ.6,000 కోట్లతో న్యూక్లియర్ సంస్థ విద్యుత్ ప్లాంట్, రూ.3,500 కోట్లతో లోరియల్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, రూ.5,000 కోట్లతో యూపీసీ వోల్డ్ డేటా సెంటర్, రూ.1,000 కోట్లతో విమానాల మరమ్మతు యూనిట్, రూ.623 కోట్లతో స్నైడర్ సంస్థ విస్తరణ, రూ.150 కోట్లతో గోద్రేజ్ డెయిరీ ప్లాంట్ విస్తరణ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తుకు కొత్త ఊపునిస్తున్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ రెన్యూవబుల్స్ సంస్థ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.

వేల సంఖ్యలో ఉద్యోగాల కల్పన..

ఈ పెట్టుబడులతో పాటు ఉద్యోగావకాశాలు కూడా గణ నీయంగా పెరగనున్నాయి. రష్మి స్టీల్ ప్లాంట్ ద్వారా సుమారు 12 వేల మందికి, యూపీసీ వోల్డ్ డేటా సెంటర్ ద్వారా 4 వేల మందికి, యూపీసీ రెన్యూవబుల్స్ ప్రాజెక్ట్ ద్వారా నిర్మాణ దశలోనే 3 వేల మందికి ఉపాధి లభించనుంది. లోరియల్ సంస్థ హైదరాబాద్‌ను తన గ్లోబల్ టెక్ హబ్‌గా ఎంపిక చేయడంతో 2 వేలకుపైగా టెక్, ఏఐ ఉద్యోగాలు సృష్టించబడే అవకాశముంది. ప్రతి ఏటా దావోస్ సదస్సు అనంతరం గ్రేటర్ హైదరాబాద్‌లో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు.. ఇది పెట్టుబడి ఒప్పందాల అమలును వేగవంతం చేసే అవకాశం కల్పిస్తుంది.

ప్రపంచ యవనికపై రైజింగ్ స్టేట్

గ్రేటర్ హైదరాబాద్ ఇప్పటికే ఐటీ రాజధానిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం 1500కు పైగా ఐటీ కంపెనీలు, 10 లక్షల‌కుపైగా ఉద్యోగులు ఈ రంగంలో ఉన్నారు. ఫార్మా, వైద్య రంగాల్లోనూ హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలతో ఫ్యూచర్ సిటీలో పరిశోధన ఆధారిత పరిశ్రమలకే ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వ దూరదృష్టిని చాటుతోంది. దావోస్ వేదికగా కురిసిన పెట్టుబడుల వర్షం కార్యరూపం దాల్చితే తెలంగాణ ప్రపంచ యవనికపై రైజింగ్ స్టేట్ గా కనిపించడం ఖాయమనే ధీమా వ్యక్తమవుతోంది.

- అమరవాజీ నాగరాజు

జర్నలిస్ట్

Next Story