తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి

by Ravi |   (  Updated:2025-02-21 00:30:33  IST  )

నాటి నిజాం కాలం నుండి నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ కాలం వరకు జరిగిన అన్ని దశల్లో తెలంగాణ విముక్తి పోరాటాల్లో పాల్గొని తనదైన

తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి
X

నాటి నిజాం కాలం నుండి నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ కాలం వరకు జరిగిన అన్ని దశల్లో తెలంగాణ విముక్తి పోరాటాల్లో పాల్గొని తనదైన ముద్ర వేసిన ఉద్యమ శీలి, జీవిత చరమాంకం శ్వాస, ధ్యాస, జీవితం తెలంగాణగా బతికిన నికార్సయిన తెలంగాణవాది, తెలంగాణ గాంధీ ప్రజాబంధు భూపతి కృష్ణమూర్తి. ఈయన 1926 ఫిబ్రవరి 21న జన్మించారు. అతని స్వగ్రామం మహబూబాబాద్ జిల్లాలోని ముల్కనూరు.

కేవలం 8వ తరగతితో చదువు ఆపేసిన కృష్ణమూర్తి తల్లిదండ్రుల నుండి క్రమశిక్షణ, దేశభక్తిని అలవర్చుకున్నారు. ఈయన నాడు దేశంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితుడైనాడు. భారత జాతీయ కాంగ్రెస్‌లో సభ్యుడైనాడు. 1944లో వార్ధా వెళ్లి అక్కడ గాంధీ ఆశ్రమంలో కొద్ది రోజులు ఉన్నారు. ఆ సమయంలో ప్రతిరోజు గాంధీతో కలిసి ఉదయపు నడకలో పాల్గొనేవారు. రోజు స్వేచ్ఛ, సత్యం, అహింస మార్గం పైన గాంధీ ఉపన్యాసాలు వినేవారు. 'అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండడం అన్యాయంతో సమానం' అన్న గాంధీ మాటలకు ఎంతో ప్రభావితుడైనారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని..

ఈయన గాంధీ ఆశ్రమం నుండి తిరిగి వచ్చి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమాన్ని నడిపారు. అదే సమయంలో నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ విముక్తికై ఉద్యమించారు. రాజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలను సమాయత్తపరచడానికి అనేక గ్రామాలు తిరిగారు. ప్రతి వారం గ్రామాల్లో జెండా పండుగ నిర్వహించేవారు. తెలంగాణ విమోచనాంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని కృష్ణమూర్తి బలంగా కోరుకున్నారు. తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేయడానికి ఒప్పుకోలేదు. ఆ సందర్భంగా ఫజల్ అలీ కమిషన్ వరంగల్ వచ్చినప్పుడు కమిషన్ ముందు తెలంగాణను ఎట్టి పరిస్థితిలో వేరే ప్రాంతంలో కలపొద్దని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని గట్టిగా వాదించారు. అసంఖ్యాక ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తెలంగాణ ఆంధ్రాలో విలీనమై మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆనాటి నుండి కృష్ణమూర్తి అనేక వేదికలపై నాటి పాలకులు తెలంగాణాపై చూపుతున్న వివక్షతపై, తెలంగాణ వెనుకబాటుపై గళమెత్తి తెలంగాణ ప్రజలను నాయకులను చైతన్యపరచారు. ఈయన 1969 జరిగిన తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు. ఉద్యమం కొరకు ఆస్తులన్నీ అమ్మేశారు. మేధావులు, యువకులతో కలిసి తెలంగాణ ప్రజాసమితిని స్థాపించారు. కొంతమంది నాయకులు తమ స్వప్రయోజనాలు కోసం ఉద్యమాన్ని వదిలిపెట్టినా ప్రత్యేక తెలంగాణ కొరకు తానే తెలంగాణ ప్రజాసమితికి పెద్దదిక్కుగా ఉంటూ ఒంటరి పోరాటం చేశారు.

పదవుల ఆశ జూపినా..

నాడు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కృష్ణమూర్తికి పదవుల ఆశ చూపినా, ఇతర ప్రయోజనాలు కల్పిస్తామన్న తన ప్రత్యేక తెలంగాణ లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేసి పాలకుల ముందు తలవంచలేదు. జయశంకర్ సార్‌తో కలిసి ఎన్నో ఉద్యమాలు చేశారు. వయస్సు మీద పడుతున్న లెక్కచేయక మలిదశ ఉద్యమంలో పాల్గొన్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తన కళ్లారా చూస్తానని పలుకుతూ తన ఆశయం ఎంత దృఢమైనదో తెలియజెప్పారు. ఎందరో తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచారు. మలిదశ ఉద్యమంలో తెలంగాణ ప్రజాసమితి పునరుద్ధరించి చివరి వరకు ఆ ప్రజాసమితి తరపున పోరాటం చేశాడు. నిజాయితి, సేవా దృష్టి, నైతికత లేని రాజకీయాలను ఇష్టపడనన్న కృష్ణమూర్తికి నిజంగా రాజకీ యం సరిపడక రాజకీయాలకు దూరమయ్యారు. తెలం గాణ రాష్ట్ర ఏర్పాటును కళ్లారా చూసి సంతోషించారు. అమరవీరుల త్యాగాల వల్లనే తెలంగాణ సిద్ధించిందని ప్రతి తెలంగాణ బిడ్డ ఆ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవాలనుకున్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం 1969 అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని అది ప్రభుత్వ ధర్మమని ప్రభుత్వానికి సూచిం చారు. అవినీతి, లంచగొండితనం,అరాచకం, నిరుద్యోగంలేని తెలంగాణ కావాలని తన ఆకాంక్షను తెలంగాణ భవిష్యత్తు తరాలకు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమాన్ని కొందరు తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటే, తన జీవితాన్ని తెలంగాణ కోసమే అంకితం చేసిన ఆదర్శ నాయకుడు భూపతి కృష్ణమూర్తి 2015 ఫిబ్రవరి 15న మరణించారు.ఆయన త్యాగాలను గుర్తుచేసుకోవడం మన బాధ్యత!

(నేడు భూపతి కృష్ణమూర్తి జయంతి)

సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

90006 74747

Next Story