మా యాస.. ఆత్మగౌరవానికి ప్రతీక

by Ravi |   (  Updated:2026-06-30 01:00:02  IST  )

తెలంగాణ యాస కేవలం మాట్లాడే తీరు కాదు.. అది ఆత్మగౌరవం, సంస్కృతి, చరిత్రకు ప్రతీక. తెలంగాణ యాస గొప్పతనం, దానిపై జరుగుతున్న అవహేళనలు, సినిమాల్లో పెరుగుతున్న ఆదరణ, భాషా గౌరవం ప్రాధాన్యంపై పూర్తి విశ్లేషణ.

మా యాస.. ఆత్మగౌరవానికి ప్రతీక
X

తెలంగాణ అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు.. అది ఆత్మీయతకు, ఆత్మగౌరవానికి, సంస్కృతి-సంప్రదాయాలకు ప్రతీక. ఆ ఆత్మీయతకు ప్రాణం పోసేది తెలంగాణ యాస. ఈ యాసలో ప్రేమ ఉంది, పలకరింపు ఉంది, మనిషిని మనిషికి దగ్గర చేసే అనుబంధం ఉంది. అలాంటి యాసను అవహేళన చేయడం అంటే కేవలం ఒక మాండలికాన్ని కాదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, వారి చరిత్రను, వారి అస్తిత్వాన్ని అవమానించడమే.

ఎన్నో అవమానాలను ఎదుర్కొని తన ప్రత్యేకతను నిల బెట్టుకున్న తెలంగాణ నేడు తన భాష, సంస్కృతి, కళలను ప్రపంచానికి గర్వంగా చాటుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ యాస గొప్పతనం, దానిపై జరుగుతున్న అవహేళనలు, వాటికి సమాజం ఇవ్వాల్సిన సమాధానం గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గుర్తింపును తగ్గించే ప్రయత్నం చేస్తూ..

తెలంగాణకు యాస భాషే గౌరవం, గుర్తింపు. ఆ యాసలోనే ఇక్కడి చరిత్ర, జీవన విధానం, ఆత్మీయత ప్రతిబింబిస్తాయి. అందరినీ తనవారిగా భావించే ఈ భాష తెలంగాణ సంస్కృతికి ప్రతీక. అనేక దశాబ్దాలుగా జరిగిన అణచివేత, హేళనల నేపథ్యంలోనే తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమం ఉవ్వెత్తున సాగి ప్రత్యేక రాష్ట్ర సాధనకు దారి తీసింది. ఇప్పుడు తెలంగాణ తన అస్తిత్వాన్ని ప్రపంచ స్థాయిలో చాటుకుంటోంది. అయినా కొంతమంది వ్యంగ్య వ్యాఖ్యలు, అవహేళనలతో ఈ గుర్తింపును తగ్గించే ప్రయత్నం చేయడం బాధాకరం. కానీ తెలంగాణ ఎదుగు దలను ఆపలేరు.. కళ, సంస్కృతి, భాష ద్వారా అది మరింత బలంగా ముందుకు సాగుతోంది.

యాసను వెక్కిరించడమంటే..?

ఇటీవలి కాలంలో తెలంగాణ యాసకు సినిమాల్లో మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తోంది. ఒకప్పుడు తక్కువగా చూపిన ఈ యాస ఇప్పుడు సినీ రంగంలో ఒక ప్రత్యేక ట్రెండ్‌గా మారింది. అటువంటి తరుణంలోనే ఓ సాధారణ నటులతో "ఇడుపు కాయితం" అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్భంగా తెలంగాణ యాసను అగౌరపరిచేలా ఆంధ్రలో డబ్బింగ్ చేస్తారా? అంటూ వ్యంగ్యపు చేష్టలతో తెలంగాణ యాస గౌరవాన్ని దెబ్బతీయాలని చూడటం మంచి పద్దతి కాదు. యాసను వెక్కిరించడం అంటే ఒక ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని చిన్నచూపు చూడటమే. తెలంగాణ గడ్డ ఆత్మీయత, సంస్కృతికి ప్రతీక. ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తన అస్తిత్వాన్ని నిలబెట్టుకున్న ఈ ప్రాంతాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. భాషల వైవిధ్యాన్ని గౌరవించడమే నిజమైన సంస్కారం.

నాడు హేళనకు గురైన యాస నేడు..

విభిన్నమైన ఆధునిక దేశాలు తమ మాతృభాషను గౌరవిస్తాయి. అదే విధంగా అభివృద్ధితో పాటు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆంగ్లం అవసరమే కానీ అది ఉపాధి సాధనంగా మాత్రమే చూడాలి. తెలంగాణలో ప్రస్తుతం యాసకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఒకప్పుడు సినిమాల్లో హేళనకు గురైన ఈ యాస ఇప్పుడు ప్రధాన స్రవంతిలోకి వచ్చింది. ప్రముఖ నటులు కూడా దీనిని ఉపయోగిస్తూ సినిమాలు చేస్తున్నారు. జాతి రత్నాలు, ఫిదా వంటి చిత్రాలు తెలంగాణ యాస, సంస్కృతిని విజయవంతంగా చూపించి ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఈ మార్పు వల్ల స్థానిక కళాకారులకు కూడా కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలం నుంచే కవులు, కళాకారులు యాస భాషకు బలం చేకూ ర్చారు. సభలు, సాహిత్యం, ఇప్పుడు సినిమా రంగం వరకు ఈ భాష తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతోంది. మన పండగలపై, సంస్కృతిపై ప్రభుత్వం సైతం గుర్తింపు తేవడంతో మరింత ఆదరణకు నోచుకుంటుంది.

మరిన్ని చిత్రాలు రావాలి!

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడక ముందు ఈ ప్రాంత పేర్లు, యాస తెరపై కనిపించే అవకాశాలు తక్కువగా ఉండేవి. కానీ నేడు ఇక్కడి లోకేషన్లు, భాష సినిమాల్లో గౌరవంగా చూపబడుతున్నాయి. బలగం వంటి చిత్రాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను సహజంగా ప్రతిబింబించి విశేష ఆదరణ పొందాయి. ప్రపంచ‌వ్యాప్తంగా భారతదేశం తన సంస్కృతి, సంప్రదాయాల వల్ల ప్రత్యేక గుర్తింపు పొందింది. అలాంటి దేశంలో మన తెలంగాణ యాస మరింత అభివృద్ధి చెందేలా ప్రయోగాత్మక చిత్రాలు రావడం అవసరం. మాతృభాష డిమాండ్ పెరగడం అంటే మన వారసత్వాన్ని బలోపేతం చేయడమే. తెలంగాణ ఉద్యమానికి సాహిత్యమే బలంగా నిలిచింది. అందుకే భాష, సాహిత్యాన్ని గౌరవించడం అంటే మన చరిత్రను గౌరవించడం. ఈ సంస్కృతి, సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాలి. తెలంగాణ యాసపై అవమా‌నకర వ్యాఖ్యలు చేసే వారికి సమాధానం చెప్పేది మాటలతో కాదు.. ప్రతిభతో, కళతో, సినిమాలతో మన భాషకు మరింత గౌరవం తీసుకురావడమే.

-సంపత్ గడ్డం

7893303516

Next Story