ఆచితూచి రూపొందించిన వాస్తవిక బడ్జెట్

by Ravi |   (  Updated:2026-03-21 01:05:19  IST  )

తెలంగాణ ప్రభుత్వ 2026–27 బడ్జెట్‌లో విద్యారంగం, వైద్య రంగం, బీసీ సంక్షేమానికి కేటాయింపులు, విద్యార్థుల భవిష్యత్తు, ప్రాథమిక విద్య బలోపేతం, రైతు సంక్షేమం మరియు నాణ్యమైన వైద్య సేవలపై విశ్లేషణ.

ఆచితూచి రూపొందించిన వాస్తవిక బడ్జెట్
X

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక వనరులు, పెరుగుతున్న ద్రవోల్బణం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆచితూచి రూపొందించిన వాస్తవిక బడ్జెట్‌గా శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కనబడుతుంది.

ప్రతిపాదించిన 3,24,234 కోట్ల బడ్జెట్‌లో ప్రాధాన్యతా రంగాలుగా విద్యారంగానికి రూ. 26,674 (8.22%) కోట్లు, వైద్య రంగానికి రూ. 13,679 (4.21%) కోట్లు, వ్యవసాయ రంగానికి రూ. 23,179 (7.14%) కోట్లు బీసీ సంక్షేమ రంగానికి రూ. 12,511 (3.85%) కోట్లు, గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్‌లు ఉన్నాయి.

ఈ రంగాలకు పెద్దపీట

సామాన్యుని సంపాదనలో సింహభాగం విద్యా, వైద్యలకే ఖర్చు అవుతుంది. విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేసిన రాష్ట్రాలు అభివృద్ధి సూచికలో ముందు వరుసలో ఉన్నాయి. గత బడ్జెట్‌తో పోల్చుకుంటే ఈ బడ్జెట్‌లో విద్యారంగానికి, వైద్య రంగానికి, బీసీ సంక్షేమానికి అధికంగా కేటాయించారు. విద్య వైద్య రంగానికి అధిక కేటాయింపులు చేస్తే ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందే అవకాశం మెరుగవుతుంది.

విద్యారంగ బడ్జెట్ ఇంకా పెంచాలి!

దేశంలో నాణ్యమైన విద్యను అందించడం కోసం ఆయా రాష్ట్రాలు వాటి బడ్జెట్లో బిహార్ 21.7% ఢిల్లీ 21.4% రాజస్థాన్ 19% హిమాచల్ ప్రదేశ్ 18.9% విద్యా రంగానికి నిధులు కేటాయించాయి. అదే దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపుల్ని ఒకసారి పరిశీలిస్తే, తమిళనాడు 14%, ఒడిస్సా 14% కేరళ 13.4% ఆంధ్ర‌ప్రదేశ్ 12.6% కేటాయింపులు జరిపాయి. మేము అధికారంలోకి వస్తే విద్యారంగానికి కనీసం 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత మూడు సంవత్సరాల బడ్జెట్లలో 7.3% ,7.57%, 8.22% నిధులు మాత్రమే కేటాయించింది.

ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే..!

బడ్జెట్‌లో చెబుతున్నట్లు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి కనీసం 9 వేల కోట్లు, పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం అందించడానికి 250 కోట్లు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం 170 కోట్లు, పాలిటె క్నిక్ కళాశాల అప్‌గ్రెడేషన్ కోసం 2500 కోట్లు అవసరంఅవుతాయని విద్యాశాఖ ప్రాథమిక అంచనా వేసింది. తీరా బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తే, విద్యారంగానికి గత సంవత్స‌రంతో పోల్చితే 0.65% అధికంగా కేటాయింపులు ఈ బడ్జెట్‌లో జరిగాయి. ఈ నామమాత్రం పెంపుదల కేటాయింపులతో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ప్రపంచ స్థాయితో పోటీపడాలన్న ప్రభుత్వ లక్ష్యం ఏ విధంగా నెరవేరు‌తుందన్నది ప్రశ్న. అయితే బడ్జెట్‌లో విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఐటీఐ, ఐటీసీల్లో చదివే విద్యార్థులకు 2000 స్కాలర్షిప్ అందించే ప్రతిపాదనలు హర్షనీయం.

ప్రాథమిక విద్య బలోపేతం!

ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి 33 జిల్లాలలో 1,362 ప్రీ-ప్రైమరీ సెక్షన్లు ఏర్పాటు, రాబోయే విద్యా సంవత్స‌రంలో ఈ కార్యక్రమాన్ని 2,000 నుండి 2,500 ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం ప్రాథమిక విద్య బలోపేతానికి దోహదపడుతాయి. చదువు లేకపోతే జ్ఞానం రాదు, జ్ఞానం రాకపోతే నైతిక విలువలు ఉండవు, నైతిక విలువలు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు, సమాజంలోని అట్టడుగు వర్గాలకు విద్య ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయని పూలే చెప్పిన మాటలు గమనంలోకి తీసుకొని విద్యారంగానికి కనీసం 15%- 20% నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది.

నాణ్యమైన వైద్య సేవలు అందాలంటే..!

కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. బడ్జెట్‌లో 4.21% నిధులతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకి నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించడం కష్టం. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే కేవలం రూ.1286 కోట్లు ఈ బడ్జెట్లో అధికంగా వైద్య‌రంగానికి కేటాయించడం జరిగింది. రాష్ట్రంలోని ఒక కోటి 15 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అందిస్తామని బడ్జెట్లో ప్రకటించారు. ప్రజల ఆరోగ్య భద్రతకు ఈ పథకం దోహదపడుతుంది. కానీ వైద్య రంగానికి తక్కువ కేటాయింపులతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఎలా అందించగలం.

బీసీ కేటాయింపులు సరిపోతాయా?

తెలంగాణ రాష్ట్రంలో 56.39% బీసీలు ఉన్నారని ప్రభుత్వ అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. బడ్జెట్లో బీసీ సంక్షేమానికి కేవలం 3.85% నిధుల కేటాయింపు మాత్రమే జరిగింది. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు మరీ ఇంత తక్కువ బడ్జెట్ కేటాయింపులు వారి సంక్షేమానికి ఏ విధంగా సరిపడతాయి? ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమానికి కూడా కేటాయింపుల్లో ఏ పెంపుదలా లేకపోవడం గమనార్హం.

పీఆర్సీ ప్రతిపాదన ఏది?

ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలకు కేటాయించిన నిధులకు ఏ మాత్రం పొంతన లేదు. విద్యారంగానికి ప్రాధాన్య‌తమిస్తున్నామని చెబుతూనే నామమాత్ర పెంపుతో కేటాయింపులు జరిపారు. రైతును రాజును చేస్తామని చెబుతూ రైతన్న సంక్షేమానికి, వ్యవసాయానికి వెన్ను దన్నుగా నిలిచే చర్యలు లేకపోవడం గమనార్హం. ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమని కట్టుబడి ఉన్నామని చెబుతూ పీఆర్సీపై ఎలాంటి ప్రతిపాదన లేకపోవడం, కేవలం ఈహెచ్ఎస్ గురించిన ప్రస్తావన చేశారు. స్థూలంగా బడ్జెట్‌ని విశ్లేషిస్తే అంతంత మాత్రమే ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రపంచ వ్యాప్త భౌగోళిక పరిస్థితికి అడ్డం పడుతూ సంక్షేమ రంగానికి నిధుల కేటాయింపు కొనసాగిస్తూ ఆచితూచి రూపొందించిన వాస్తవిక బడ్జెట్‌గా ఉంది.

- పాకాల శంకర్ గౌడ్

98483 77734

Next Story