తెలంగాణ సాయుధ పోరాటం.. ప్రజా పోరాటమా.. మత పోరాటమా! చరిత్ర వక్రీకరణ ఎందుకు?

by Ravi |   (  Updated:2025-09-17 01:15:42  IST  )

మహోజ్వల వీర తెలంగాణ ప్రజాపోరాటం చుట్టూ నేడు పలువిధాల వక్రీకరణలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు తమకున్న రాజకీయ ఎజెండాకు అనుకూలంగా చరిత్రను వక్రీకరిస్తున్నాయి.

తెలంగాణ సాయుధ పోరాటం.. ప్రజా పోరాటమా.. మత పోరాటమా! చరిత్ర వక్రీకరణ ఎందుకు?
X

మహోజ్వల వీర తెలంగాణ ప్రజాపోరాటం చుట్టూ నేడు పలువిధాల వక్రీకరణలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు తమకున్న రాజకీయ ఎజెండాకు అనుకూలంగా చరిత్రను వక్రీకరిస్తున్నాయి. వీర తెలంగాణ చరిత్రకు ఈ గడ్డపై సామాన్య జనమే వారసులు.. ఓట్ల రాజకీయాలు నెరపుతున్న స్వార్థపరశక్తులు.. తమ సాధన సంపత్తులన్నింటిని మోహరించి, ప్రజాశ్రేణుల సమిష్టి స్మృతులనూ చెరిపివేసే దుస్సాహసానికి ఒడిగడుతు న్నారు. నిజం నిత్యం ప్రచారంలో లేకపోతే.. అబద్ధాలే రాజ్యమేలుతాయి..

1940, 50 దశకాల్లో తెలంగాణ గడ్డపై అసలు జరిగిందేమిటి? తెలంగాణ ప్రజా పోరాటం మొదటి నుండి నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగానే కాదు... అంతకంటే ప్రధానం‌గా తెలంగాణను చెరబట్టిన దొరల భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా కొనసాగింది.

శ్రామికవర్గ ఎజెండాతో సాగిన పోరాటం..

1944లో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభ 11వ మహాసభ నాటికి.. అందులోని ప్రధాన నాయకులందరూ సామ్యవాద ఆదర్శాలతో ప్రభా వితులై.. కమ్యూనిస్టులుగా మారారు. అప్పటి నుండి తెలంగాణ ప్రజాపోరాటం ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కొనసాగింది. బాంచన్‌ కాల్మొక్తా అంటూ బతికిన తెలంగాణ బిడ్డలు.. బరిసెలు, బందూకులూ చేతబట్టి.. దొరల రాజ్యం కూల్చడానికి ఉద్యమించిన వీరోచిత చరిత్ర అది. నిఖార్సైన శ్రామికవర్గ ఎజెండాతో సాగిన ఆ పోరాటంలో.. మూడువేల గ్రామాలు విముక్తమై గ్రామ రాజ్య కమిటీల ఆధ్వర్యంలో ప్రజారాజ్యం ఏర్పడింది. దొరల కబ్జాలో ఉన్న పది లక్షల ఎకరాల భూమి పేద రైతులకు పంచబడింది. రుణ పత్రాలు రద్దయ్యాయి. వ్య‌వసాయ కూలీల వేతనాలు పెరిగాయి. కుల వివక్ష, లింగ వివక్ష కట్టడి చేయబడినాయి. ఢిల్లీ పీఠమెక్కిన కాంగ్రెస్‌ పెద్దలు.. భూస్వాము లు, పెట్టుబడిదారుల పక్షం వహించడమే సెప్టెంబర్ 17గా చరిత్రలో నమోదయింది.

ఈ అరాచకం కూడా ఇస్లామిక్ పాలనేనా?

తెలంగాణ గడ్డపై సాగిన ఆ ప్రజా పోరాటాన్ని.. ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు జరిపిన ఒక మతపరమైన పోరాటంగా చిత్రీకరించే వక్రీకరణ యత్నాల కు పాల్పడుతున్న వారికి.. ఒక సూటి ప్రశ్న.. ఆనాడు జరిగిన పోరాటానికి చరిత్ర ఇచ్చిన పేరు ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం’. ఆ పోరాటం నడిపింది రైతన్నలయినప్పుడు.. రైతాంగ సమస్యలయిన.. భూమి సమస్య, కూలీ సమస్య, శ్రమ దోపిడి సమస్యలపై పోరాటం జరుగుతుంది తప్ప, వేరే అంశాల ప్రస్తావనే ఉండదు కదా! నేడు ఓట్ల రాజకీయం నడుపుతున్నోళ్లు మన ప్రజల దగ్గరికి వచ్చి.. ‘నాడు నిజాం సాగించిన ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా హిందువులు చేసిందే తెలంగాణ పోరాటం’ అంటూ తప్పుగా మాట్లాడుతున్నారు. ఈ వక్రీకరణ చక్రవర్తులకు తెలంగాణ బిడ్డల తరఫున మనం ఒక ప్రశ్న వేయాలి. చిట్యాల ఐలమ్మ పొలాన్ని గుంజుకుని, ఆమె ఇద్దరు కొడుకులను జైలుపాలు చేసి, ఆమె ఇల్లు కూలగొట్టి, ఆమె బతుకును ఆగమాగం చేసిన ఆ ప్రాంతపు దొర విసునూరు రామచంద్రారెడ్డిది ఏ మతం? ఆ విసునూరు దొర సాగించింది ఇస్లామిక్ పాలనే అంటారా? దొడ్డి కొమురయ్యను తుపాకీతో కాల్చి చంపిన కడివెండి దొరసాని జానమ్మ నడిపింది కూడా ఇస్లామిక్ పాలనేనా? గ్రామాల్లో ఏ ఆడబిడ్డ కంటికి నదురుగా కనపడ్డా.. ఆ రాత్రి దొర గడీలో, దొర చేతుల్లో నలిగి పోవాల్సిందే అన్నచరిత్ర వీరికి అసలు తెలుసా? ఆ దొరలు నడిపింది కూడా ఇస్లామిక్ పాలనేనా?

ఏ మతం రాజులైనా నిరంకుశులే..

నాడు తెలంగాణలో పైన ఇస్లాం మతానికి చెందిన నిజామోడు కూర్చుంటే.. తెలంగాణ అంతటా అరాచక పాలన క్రింది స్థాయిలో ఉన్న హిందూ మతంలో కొనసాగిన దొరలు నడిపిండ్రన్న చరిత్ర తెల్వనోల్లు తెలంగాణ బిడ్డలెట్లా ఐతరు? అది హిందూ పాలనా కాదు, ఇస్లామిక్ పాలనా కాదు.. నిఖార్సైన ఫ్యూడల్ అరాచక పాలనే! చరిత్ర నిరూపించే వాస్తవమేమిటంటే.. రాజులు ఏ మతం వారైనా నిరంకుశులు, ప్రజా కంటకులే.. స్వమతంలో తనకు వత్తాసుగా నిలిచే కొందరు కులీన, పురోహిత వర్గాల వారిని తప్ప మిగతా ప్రజలందరినీ, మతాలతో సం బంధం లేకుండా, రాచి రంపాన పెట్టిన నికృ ష్ట చరిత్ర రాజులందరిదీ. మతపరమైన సెంటి మెంట్లు సామాన్య ప్రజలకే గాని, రాజులకూ, రాజులకు వత్తాసుగా నిలిచిన దొరలకూ ఏనాడూ లేవు.. ప్రజలను నాడు అరిగోసలను పెట్టిన వెట్టికి వ్యతిరేకంగా మొదలైన పోరాటం.. క్రమక్రమంగా కూలీ సమస్యలు, భూమి సమస్యలను పరిష్కరించే సాధనంగా మారి, ఆ క్రమంలోనే కిందున్న దొరలతో పా‌టు పైనున్న నిజాం ప్రభువును సైతం తెలం గాణ ప్రజలు ఎదిరించడానికి కారణమైంది.

మతోన్మాద రాజకీయాలని ఓడించి..

అయితే తమపైన జులుం చేయడానికి నిజాం ప్రభువుకైనా, దొరలకైనా మతం అడ్డు రాలేదన్న సత్యాన్ని తెలంగాణాలోని ఇరు మతాల ప్రజలందరూ స్పష్టంగా అర్థం చేసుకున్నారు. అందుకే ఐలమ్మ, రావి నారాయణ రెడ్డిలతో పాటు మఖ్దూమ్ మొహియుద్దీన్, షోయబుల్లా ఖాన్‌లు భుజం భుజం కలిపి పోరాడుతూ.. మతోన్మాద రాజకీయాలని సమైక్యంగా ఓడించారు. శ్రామిక వర్గ చైతన్యం పరిఢవిల్లిన చోట మత విభేదాలు సమసిపోతాయనడానికి వీర తెలంగాణా పోరాటం ఒక ప్రబల నిదర్శనం. విభజన రాజకీయాల్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ అసలు సమస్యలపై నికరంగా పోరాడడమే వీర తెలంగాణ చరిత్ర. తెలుగు బిడ్డలకు వారసత్వంగా దక్కిన సంస్కృతి అది. ఆ చరిత్రను వక్రీకరించడానికి జరుగుతున్న ప్రయత్నాలు విఫలం కాక తప్పదు! ప్రజా చరిత్రను ప్రజలే కాపాడుకోవాలి!!

-ఆర్. రాజేశమ్,

కన్వీనర్, సామాజిక న్యాయ వేదిక

94404 43183

Next Story