- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ.. డిక్షనరీకి అందని చరిత్ర
తెలంగాణ అనేది కేవలం ఒక పదం కాదు. శతాబ్దాల చరిత్ర, సంస్కృతి, పోరాటాలు, త్యాగాలు, ఆత్మగౌరవానికి ప్రతీక. నిఘంటువులో పేరు ఉందా లేదా అన్నది కాదు, కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చెక్కబడిన అస్తిత్వమే తెలంగాణ అని వివరిస్తున్న భావోద్వేగభరిత వ్యాసం.

“తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు” అని కొందరు చెప్పొచ్చు. కానీ చరిత్రను డిక్షనరీలు రాయవు.. ప్రజలే రాస్తారు. కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలు, త్యాగాలు, ఉద్యమాలు కలిసి నిర్మించిన అస్తిత్వమే తెలంగాణ. ఒక నిఘంటువులో పేరు లేకపోవడం వల్ల ఒక జాతి చరిత్ర మాయమవదు. ఒక ప్రాంతం ఉనికి చెరిగి పోదు. తెలంగాణ అనేది కేవలం ఐదు అక్షరాల పదం కాదు. అది శతాబ్దాల నాగరికతకు ప్రతీక. అనేక పోరాటాల పునాది. ఎన్నో తరాల ఆత్మ గౌరవానికి చిరునామా. తెలంగాణ చరిత్ర వేల ఏళ్ల నాటిది. తెలంగాణ నేలలో ప్రతి అడుగూ చరిత్రతో నిండిపోయి ఉంది. ప్రతి రాయి ఒక గాథ చెబుతుంది. ప్రతి చెరువు ఒక నాగరికతను గుర్తు చేస్తుంది. అణచివేతకు వ్యతిరేకంగా తిరగబడటం తెలంగాణ గడ్డ స్వభావం. ప్రత్యేక తెలంగాణ కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నం. అది కేవలం పరిపాలనా విభజన కాదు. దశాబ్దాల ఆకాంక్షకు దక్కిన గౌరవం. తెలంగాణ భాషను ఒకప్పుడు కొందరు చిన్నచూపు చూశారు. కానీ నేడు అదే యాస సినీ ప్రపంచాన్ని, సాహిత్య ప్రపంచాన్ని, రాజకీయ వేదికలను ప్రభావితం చేస్తోంది. తెలంగాణ మాటల్లో మట్టి వాసన ఉంటుంది. ప్రేమ ఉంటుంది. ఆత్మీయత ఉంటుంది. తెలంగాణ సంస్కృతి ప్రకృతితో మమేకమై ఉంటుంది. ఇక్కడ పండుగలు కేవలం ఆచారాలు కావు. జీవన విధానాలు. ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన తెలంగాణ నేడు దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. అందుకే తెలం గాణను కేవలం భౌగోళిక సరిహద్దులతో కొలవలేం. అది ప్రజల ఆత్మగౌరవం. పోరాటాల చరిత్ర. త్యాగాల ప్రతీక. సంస్కృతికి నిలయం. డిక్షనరీలో పేరు ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చెక్కబడిన పేరే అసలైన చరిత్ర.
-ఐనేని జయంత్ రావు
90308 08919






