- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యాంగ ప్రబోధం అవసరం!
పిల్లలు ఉద్యానవనంలో మొగ్గల్లాంటి వారు. వారే దేశ భవిష్యత్తు. రేపటి పౌరులు.. కాబట్టి వారిని జాగ్రత్తగా ప్రేమగా పెంచాలి

"పిల్లలు ఉద్యానవనంలో మొగ్గల్లాంటి వారు. వారే దేశ భవిష్యత్తు. రేపటి పౌరులు.. కాబట్టి వారిని జాగ్రత్తగా ప్రేమగా పెంచాలి" అని మన భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చెప్పారు. అంటే, నేటి బాలలే భావిభారత ముఖచిత్రాన్ని మార్చే మూల స్తంభాలు.. కుల మతాల విద్వేషాలు, అవినీతి రాజకీయాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశం గొప్పతనం, భారత రాజ్యాంగ విలువలను నేటి బాలలకు వారి బాల్యం నుంచే ఒక స్ఫూర్తిగా బోధిస్తూ వారిలో దేశభక్తిని పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించి 1950 జనవరి 26న అమలు చేయడంతో భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. గణం అంటే ప్రజలు, తంత్రం అంటే పాలన. గణతంత్రం అంటే ప్రజాపాలన. రాజు రాచరికం లేకుండా ప్రజలే ప్రభువులుగా ఉండే దేశం.
దేశాభివృద్ధిలో రాజ్యాంగ పాత్ర విశిష్టం
మన దేశ జీవన విధానంలో ప్రత్యేకమైన భిన్నత్వంలో ఏకత్వం కొనసాగడానికి రాజ్యాంగం చాలా పెద్ద కీలక పాత్ర పోషించింది. భారత రాజ్యాంగం అత్యున్నత విలువలతో కూడినది. ప్రజలు కుల, మత, భాష, లింగ, ప్రాంత, జాతి మొదలైన తారతమ్యాలు లేకుండా దేశ ప్రజలందరూ హాయిగా జీవించటానికి భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కు కల్పించింది. ప్రజలంతా ఒకటే అనే భావన చిన్నారుల మనసుల్లో నాటేందుకు, సామా జిక, ఆర్థిక అంతరాలు మనుషులను దూరం చేయకూడదనే సమతా భావం పసి హృదయాలలో పెంపొందించేందుకు, బాలలకు వారి బాల్యం నుండే రాజ్యాంగ విలువలు బోధించాలి. ఒక రాజ్యాంగం ఎంత మంచిదైనా, గొప్ప దైన కావచ్చు కానీ దానిని అమలు చేసే వాళ్లు చెడ్డవారైతే అది పనిచేయదని డాక్టర్ అంబేడ్కర్ చెప్పిన మాటలని మనం ఎప్పుడూ మర్చిపోరాదు.
దేశభక్తికి గట్టి పునాది అవసరం!
యావత్తు భారతదేశం తన 76వ గణతంత్ర దినోత్సవ పండగను జరుపుకుంటున్న నేపథ్యంలో, దేశ గొప్పతనం, రాజ్యాంగ విలువలు, దేశం భక్తి అనే విశిష్ట అంశాలను ఒకసారి మననం చేసుకోవడం ప్రతి భారతీయ పౌరుడి ప్రథమ కర్తవ్యం. దేశభక్తి అనేది బాల్యం నుంచే నరనరాలలో పెంపొందించుకోవాల్సిన జాతీయ అంశం. దేశం లోని ప్రతి పౌరుడు గర్వంతో చాటి చెప్పుకొనేదే దేశభక్తి . దేశభక్తిని పెంపొందించడంలో బాల్యం నుంచే దేశ గొప్పతనాన్ని, రాజ్యాంగ విలువలను బోధించడం మన జాతి మనుగడకు చాలా అవసరం. దేశభక్తి అంటే జాతీయ జెండాను చేతబూని ఊపడం లేదా గొంతైత్తి జాతీయ గీతాలను ఆలపించడం మాత్రమే కాదు. దేశభక్తి అంటే దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం, రాజ్యాంగ విలువలను అర్థం చేసుకొని ఆచరించడం. ఇతరులు ఆచరించేలా ప్రవర్తించడం. బాల్యం నుండి చిన్నారులకు దేశం గొప్పతనాన్ని బోధించడం వలన వారి పసి హృదయాల్లో దేశం పట్ల గర్వం, సొంతం అనే భావన, ప్రేమ, స్ఫూర్తి కలుగుతాయి. ఈ భావనే వారి హృదయాంతరంగాల్లో దేశభక్తిని పెంపొందిస్తుంది. చిన్నతనంలోనే దేశభక్తి పట్ల ఇలాంటి ఒక స్ఫూర్తిదాయకమైన గట్టి పునాదిని నిర్మించడం వల్ల చిన్నారులు బాధ్యతాయుతమైన పౌరులుగా పెరిగి దేశ అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తారు.
ఇదే ప్రాథమిక అంశం కావాలి!
చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందించడంలో విద్య విశిష్టమైన పాత్ర పోషిస్తుంది. అన్ని విద్యాసంస్థలు దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం, రాజ్యాంగం, దేశం ఎదుర్కొన్న సవాళ్లు.. దేశం సాధించిన విజయాలకు సంబంధించిన అంశాలను పాఠ్యాంశాలుగా చేసి విద్యార్థుల్లో స్ఫూర్తి కలిగే విధంగా బోధించాలి. దేశానికి సంబంధించిన అనేక అంశాలు పాఠ్యాంశాలుగా ఉన్నప్పటికీ, వాటిని కేవలం మార్కులను సంపాదించడం కోసమే బోధించడం జరుగుతుంది. ఈ పద్ధతి మారాలి. దేశంలోని ప్రతి పౌరుడికి దేశం గొప్పతనం, రాజ్యాంగం తెలియాలనేది ప్రాథమిక అంశం కావాలి. దేశం ఎదుర్కొన్న సవాళ్లను, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను, సాధిస్తున్న విజయాలను, అపజయాలను, సమస్యలను, ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను, చేసిన పోరాటాలను బాల్యం నుంచే చిన్నారులకు బోధించడం వలన వారు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతూ భవిష్యత్తులో దేశ ప్రగతికి తోడ్పడేందుకు అవసరమైన సమస్య పరిష్కార నైపుణ్యాలను, విశ్లేషణాత్మక, తార్కిక ఆలోచనా శక్తిని అభివృద్ధి చేసుకుంటారు. అంతేకాదు, తాము ఈ దేశంలో పుట్టినందుకు గర్వ పడటమే కాకుండా దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలనే స్ఫూర్తిని వారు నరనరాల్లో పొందుపరచుకుంటారు.
- ననుబోలు రాజశేఖర్,
98857 39808






