- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెట్ రద్దుకై చలో ఢిల్లీ..
టెట్ ఈ పేరు వింటేనే ఉపాధ్యాయుల గుండెల్లో రైళ్లు పరిగెడు తున్నాయి. పాతికేళ్లకు పైగా సర్వీసు పూర్తిచేసిన ఉపాధ్యాయులంతా టెట్‌తో కుస్తీ పడుతున్నారు.. గత ఏడాది సెప్టెంబర్ 30న సుప్రీం కోర్టు తీర్పు ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెట్ పరీక్షలకు ఉపాధ్యాయులను కూడా అనుమతించడంతో సుమారు డబ్బై వేలకు పైగా ఉపాధ్యాయులు ఈ పరీక్షకు హాజరయ్యారు..

టెట్ ఈ పేరు వింటేనే ఉపాధ్యాయుల గుండెల్లో రైళ్లు పరిగెడు తున్నాయి. పాతికేళ్లకు పైగా సర్వీసు పూర్తిచేసిన ఉపాధ్యాయులంతా టెట్‌తో కుస్తీ పడుతున్నారు.. గత ఏడాది సెప్టెంబర్ 30న సుప్రీం కోర్టు తీర్పు ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెట్ పరీక్షలకు ఉపాధ్యాయులను కూడా అనుమతించడంతో సుమారు డబ్బై వేలకు పైగా ఉపాధ్యాయులు ఈ పరీక్షకు హాజరయ్యారు.. నిన్న పాఠశాల విద్యాశాఖ రెస్పాన్స్ షీట్లు విడుదల చేయటంతో ఉపాధ్యాయుల్లో మిశ్రమ స్పందన కనిపించింది.
30 ఏళ్ల సర్వీస్ తర్వాత టెట్ పాసవ్వాలా?
విద్యాహక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులు కూడా రెండేళ్లలో టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలో ఉపాధ్యాయుల నుండి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. విద్యాహక్కు చట్టం కన్నా ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెలువరించిన డీఎస్సీ నోటిఫికేషన్‌లోని అర్హతల ఆధారంగా మెరిట్ సాధించి ఉద్యోగంలో చేరారు.. సుమారు 30 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు టెట్ పాసవ్వాలని లేకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తామని తీర్పు వెలువరించడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ తీర్పుపై అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, ఉపాధ్యాయ సంఘాలు రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి. జాతీయ ఉపాధ్యాయ శిక్షణా సంస్థ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి తీర్పు వచ్చిందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
గణితం, సైకాలజీ అందరికీ అవసరమా?
వృత్తిలో కొనసాగుతున్న ఉపాధ్యాయులు టెట్ పరీక్షకు సన్నద్ధం కావాలని ప్రయత్నించినప్పటికీ అసంబద్ధమైన సిలబస్ వారికి కొరక రాని కొయ్యగా తయారైంది. గణితం, ఇంగ్లీషు, తెలుగు, సైకాలజీ లను సిలబస్‌గా నిర్ణయించటం పట్ల ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా ఉన్నత పాఠశాలల్లో జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రాలను బోధిస్తున్న ఉపాధ్యాయులు తాము ఇప్పుడు గణితం నేర్చుకుని టెట్ పాసవ్వడం వల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటో అంతుచిక్కడం లేదని ఉపాధ్యాయ లోకం వాపోతున్నది. ఇంటర్ ఆ పై స్థాయిలో గణితం, ఫిజికల్ సైన్స్ చదివిన ఉపాధ్యాయులకు మాత్రమే ప్రస్తుత సిలబస్ ప్రకారం టెట్ ఉత్తీర్ణతకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్న విషయం గతంలో వెలువడిన ఫలితాలు అద్దం పడుతున్నాయి. జీవశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయులు గణితంపై వచ్చే ముప్పై మార్కులను కోల్పోవలసి వస్తున్నది. అలాగే లాంగ్వేజెస్ బోధించే ఉపాధ్యాయులు అటు గణితం, ఇటు సాంఘిక శాస్త్రం చదవలేక ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం.
టీచర్ల మార్కులలో ఈ వ్యత్యాసం ఏంటి?
విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టెట్ నోటిఫికేషన్లలో ఎక్కడ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించకుండా ఇప్పుడు టెట్ తప్పనిసరి చేయడం వెనుక అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందరూ సమానమే, పేద, గొప్ప బేధాలు లేవంటూ, కులాలకు, మతాలకు అతీతంగా అందరూ ఒక్కటే అని బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఉత్తీర్ణత సాధించే మార్కులలో వ్యత్యాసాన్ని ప్రవేశపెట్టడం హాస్యాస్పదంగా ఉన్నది. సామాజిక వర్గాల ఆధారంగా 60 శాతం,75 శాతం, 90 శాతం మార్కులుగా నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగం సాధించడానికి రిజర్వేషన్లు ఇవ్వడం ఆమోదయోగ్యమే కానీ ఇలాంటి అర్హత సాధించే పరీక్షలలో కూడా వివక్ష చూపించడం ఎంతవరకు సమంజసం.
ఫిబ్రవరి 5న చలో ఢిల్లీ ..
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని, సుప్రికోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో చట్ట సవరణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5న జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఉమ్మడి పోరాటం చేస్తున్నట్లు ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ (AIJACTO) ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రకటించింది. దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా ఉపాధ్యాయులు ఈ టెట్ సమస్యను ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని లేకపోతే ఎలాంటి ఉద్యమాలకైనా వెనుకాడబోమని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
- సుధాకర్.ఏ.వి
రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు,షూట్స్
90006 74747






