సురవరం ఓ సజీవ జ్ఞాపకం!

by Ravi |   (  Updated:2025-08-26 01:00:56  IST  )

నేను ఒక పెద్ద వెటరన్ కమ్యూనిస్టు బయోగ్రఫీ రాస్తున్నా ఏదో సమాచారం కోసం సురవరం గారికి ఫోన్ చేసా. ఆయన ఆల్ ఇండియా

సురవరం ఓ సజీవ జ్ఞాపకం!
X

నేను ఒక పెద్ద వెటరన్ కమ్యూనిస్టు బయోగ్రఫీ రాస్తున్నా ఏదో సమాచారం కోసం సురవరం గారికి ఫోన్ చేసా. ఆయన ఆల్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రెటరీ హోదా నుంచి రిలీవ్ అయ్యాడు అనుకుంటా. మద్రాస్‌లో అంతర్భాగం అయిన కాలంలో 1952 మొదటి ఎన్నికల్లో ఎంపికైన ప్రజా ప్రతినిధుల గ్రూప్ ఫోటో మీ పార్టీ ఆఫీసులో ఉన్నదా అని అడిగా? (ఇదే ప్రశ్న CPM కి కూడా) నాకు ఆ ఫోటో కావాలి అని అడిగా. అయ్యో సీతారాం గారు ఆ ఫొటోస్ మా దగ్గర లేవు అని ఆయన అమాయకంగా అన్నాడు.

‘1917’ లెనిన్ గ్రాండ్ ముట్టడి ఫోటోస్ ఉన్నాయి. మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రష్యాలో జరిగిన హింసకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. 1930 తమిళనాడు అసెంబ్లీకి సంబంధించిన ఫొటోస్ ఇంకా ఇంటర్నెట్‌లో ఉన్నాయి. మరి వందేళ్ల కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో మీ పార్టీ నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ఫొటోస్ మీ ఆఫీసులో లేవు, కనీసం అసెంబ్లీ పార్లమెంట్ డిబేట్స్, దశాబ్దాలుగా నడిపిన పార్టీ పత్రికల రికార్డు జరిగినా కాపాడుకోలేని పార్టీలు ఎందుకు? ఆ పార్టీ ఆఫీసులు కూల్చిపారేయకుండా...' అని ఓ బూతు పదం కూడా వాడాను. ఆ మాటకు ఆయన ఎంత నొచ్చుకున్నాడో అనేది నేను ఆ రోజు అసలు పట్టించు‌కో లేదు కానీ నేను ఆ మాట అనకుండా ఉండాల్సిందని ఇప్పుడు అనిపిస్తోంది.

మేం మంచి మిత్రులుగా మారి..

ఆ తర్వాత అదే పుస్తకం రీసెర్చ్ పని మీద నేను నర్సాపురం వెళ్లా. ఒక డెబ్భై ఐదు ఏళ్ల కామ్రేడ్ నా కోసం నరసాపురం రైల్వే స్టేషన్‌లో మూడు గంటలు వెయిట్ చేసేలా చేశారు సురవరం. ఆయన నా గురించి ఏం చెప్పారో నాకనవసరం. నేను అక్కడ ఉన్న రెండు రోజులు ఆ పెద్ద మనిషి నాతోనే నిలబడి ఉన్నారు. కానీ తర్వాత కాలంలో మేము మంచి మిత్రులం అయ్యాం. దానికి ఏకైక కారణం ఆయన సహచరి విజయలక్ష్మీ మేడం పూర్వీకులు కూడా బర్మా విస్తాపితులు అవడమే.. నేను రాసిన పుస్తకం కూడా రెండో ప్రపంచ యుద్ధకాలంలో బర్మా నుండి అక్రమంగా తరిమి వేయబడ్డ వేలాది మంది తెలుగు కుటుంబాలలో సురవరం మామయ్య కుటుంబం కూడా ఉంది. అందుకు ఆ పుస్తకం అంటే ఆయనకు ఇష్టం. పుస్తకం రాగానే తన ఆరోగ్యం సహకరించకున్నా కూడా మొదటి సమీక్ష ఆయనే రాశాడు. అంత పెద్ద మనిషి నా పుస్తకం గురించి రాయడం మురిసిపోయా. నెలకు ఒక్కసారి అయినా మేం ఎన్నో విషయాలు మాట్లాడుకునేది. నేను అంటే ఆయనకు విపరీతమైన అభిమానం. ఎప్పుడు ఫోన్ చేసినా డాక్టర్ సాబ్ బాగున్నారా అనేవాడు. అది ఎంత దాకా వచ్చింది అంటే నా fb పోస్ట్‌లకు కూడా కామెంట్స్ రాసేవాడు. నేను కమ్యూనిస్టు‌లను తిడితే కాల్ చేసి నొచ్చుకునేవాడు. జాతీయోద్యమంతో సాయుధ పోరాట కాలంలో ఆ కుటుంబం ఎన్నో కష్టాలు పడ్డ అంశాన్ని నాతో చెప్పుకునేవాడు. పోయిన చరిత్ర గురించి, ఎకరాల ఎకరాల భూములు పోయిన దాని పట్ల ఆయనకు బాధ లేదు. కానీ శత్రుదాడిలో కాలిపోయిన ఒక Manuscript గురించి ఆయనకు బాగా బాధ ఉండేది.

చరిత్రలో ఒక పేజీకి నోచుకోకుండా..

సురవరం వారిది సంపన్న కుటుంబం. వారు మహబూబ్‌నగర్ నుంచి నల్గొండ జిల్లాకి ఎందుకు వలస వచ్చారో నాకు తెలియదు. కానీ కుటుంబం మొత్తం ఎర్రజెండా వెలుగులోనే బతికింది. గోల్కొండ పత్రిక నడిపిన ప్రతాపరెడ్డి ఆయన పెదనాన్న. సాయుధ పోరాట కాలంలో ఆ కుటుంబ చరిత్ర (బహుశా పెద్దలు చెబుతుండగా రాసి పెట్టుకున్న పెద్ద నోట్) ఒకటి ఎంతోకాలంగా ఆ ఇంట్లో ఉండేది అని చెప్పేవాడు. శత్రువులు ఇంటిని తగలబెట్టడం మూలంగా ఆ విలువైన రాత ప్రతి పోయింది అని చెప్పాడు. ఆ ప్రమాదం తర్వాత బాగా నష్టపోయింది ఆ కుటుంబం. చదివిన రాత ప్రతినే కదా మళ్లీ గుర్తు తెచ్చుకుని చెప్పండి నాలాంటి వాళ్లు రికార్డ్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాం అని నేను అనేక సార్లు అనేవాన్ని. ఒక దశలో ఇంటికి రండి కామ్రేడ్ అని పిలిచాడు. నా పనుల్లో పడి నేను పట్టించుకోలేదు. తర్వాత వయసు మీద పడడంతో మాట సరిగా రావడం లేదు. కాబట్టి రెండేళ్లుగా ఆ కామ్రేడ్‌తో మాట్లాడలేకపోయా ఇప్పుడు అనిపిస్తోంది త్యాగాలు చేసిన కుటుంబాలు ఇలా చరిత్రలో ఒక పేజీకి కూడా నోచుకోలేక పోతున్నారు అని. మీలా వెనకటి తరం పట్ల ఆప్యాయత కురిపించే చరిత్ర పట్ల అనురక్తి ఉన్నవాళ్లు ఇప్పుడు కనబడడం లేదు. మీలాంటి స్కాలర్‌ల అవసరం మా పార్టీకి ఉంది అన్నాడు (సిగ్గు అనిపించింది నాకు). ఒక దశలో మీరు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వండి కామ్రేడ్ అన్నాడు. అంత పెద్ద మనిషి నాతో బేషజం లేకుంటా చేసిన సంభాషణ కూడా రికార్డు చేసుకోలేదు అదే నా బాధ. ఎనిమిది దశాబ్దాల కమిటెడ్ జీవితాన్ని రికార్డు చేసుకోలేని ఆ పార్టీని, ఈ కాలపు రాతగాళ్లను అసలు క్షమించకూడదు. ఉంటా కామ్రేడ్ మీరు నాతో పంచుకున్న విలువైన సజీవ జ్ఞాపకాలకు నివాళి అర్పిస్తూ..

-గుఱ్ఱం సీతారాములు

99516 61001

Next Story