బీసీ వర్గాలకు ఎట్టకేలకు దక్కిన న్యాయం!

by Ravi |   (  Updated:2026-04-07 01:15:10  IST  )

బీసీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ నిర్ధారణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ, పీఎస్‌యూ, ప్రైవేట్ ఉద్యోగుల మధ్య ఉన్న వివక్షను తొలగిస్తూ బీసీ అభ్యర్థుల హక్కులను పునరుద్ధరించిన ఈ తీర్పుపై విశ్లేషణ.

బీసీ వర్గాలకు ఎట్టకేలకు దక్కిన న్యాయం!
X

మార్చి 11న కీలక తీర్పును వెలువరించిన భారత సుప్రీంకోర్టు.. బీసీ వర్గాల రిజర్వేషన్ల విషయంలో ఒక పెద్ద అవరోధాన్ని తొలగించింది. క్రీమీలేయర్‌ను అన్వయించే అంశంపై స్పష్టతనిచ్చిన సుప్రీంకోర్టు.. కొందరు ఉన్నతాధికారుల తప్పుడు వైఖరి కారణంగా ఇరవై రెండు యేళ్లుగా రిజర్వేషన్ల హక్కుకు దూరమైన బీసీ బిడ్డల హక్కులను సగౌరవంగా పునరుద్ధరించింది.

కంటికి కనిపించని, న్యాయస్థానాల పరిశీలనకు చిక్కని కుల వివక్ష.. బడుగు వర్గాల అభ్యర్థుల విషయంలో అనేక విధాలుగా అమలవుతున్నది. మొన్న ఇచ్చిన తీర్పుతో సుప్రీంకోర్టు.. బీసీ అభ్యర్థులను నానా అగచాట్లు పెడుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దల మొండి వైఖరిపై మొట్టికాయలు వేసింది. క్రీమీలేయర్‌ను నిర్ణయించడానికి, ఆదాయాన్ని గణించడానికి అనుసరించిన విభిన్న ప్రమాణాలను వివక్షగా పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఓబీసీ అభ్యర్థుల క్రీమీలేయర్ స్థితిని నిర్ణయించడానికి తల్లిదండ్రుల ఆదాయమే ఏకైక ప్రమాణం కాదని పేర్కొంది.

గద్దలు తన్నుకుపోయే కుతంత్రం

నాటి విశ్వనాథ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగా.. దేశంలోని మెజారిటీ వర్గమైన బీసీలకు (జాతీయ స్థాయిలో ఓబీసీలు) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మొదటిసారిగా రిజర్వేషన్లు దక్కాయి. వెనుకబడిన వర్గాలకు చేయూతను అందించిన పాపానికి వీపీ సింగ్ చివరికి తన ప్రధాన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. 1993 నుండి ఓబీసీ రిజర్వేషన్లు అమలు అయినవి. ఆ తర్వాత 2004లో డీఓపీటీ అదే అంశంపై ఒక వివరణ లేఖని విడుదల చేసింది. దీని ద్వారానే.. బీసీల ఉద్యోగావకాశాలను గద్దలు తన్నుకు పోయే కుతంత్రానికి తెర తీయబడింది.

అక్కడే రిజర్వేషన్ హక్కుకు భంగం!

2004 అక్టోబర్ 14న, కేంద్రం జారీ చేసిన లేఖలో.. PSUలు, బ్యాంకులు, ప్రైవేటు సంస్ధల విషయంలో.. ఆయా సంస్థలలోని ఉద్యోగుల కేటగిరీలను ప్రభుత్వ సంస్థలలోని పోస్టులతో సమానత్వ మూల్యాంకనం చేయనట్లయితే, ఆదాయ సంపద పరీక్ష ఆధారంగా క్రీమీలేయర్ స్థితిని తప్పని‌సరిగా నిర్ణయించాలని గుర్తించింది. వేతనాల నుండి వచ్చే ఆదాయం, ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయాన్ని (జీతాలు మరియు వ్యవసాయ భూమి మినహా) విడిగా అంచనా వేయాలని నిర్దేశించింది. ఇటు వేతన ఆదాయం కానీ.. అటు ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం కానీ.. వరుసగా మూడు సంవత్సరాలు నిర్దేశించిన పరిమితిని మించితే.. వారి పిల్లలు క్రీమీలేయరుగా పరిగణించబడ తారని పేర్కొన్నది. ఈ లేఖ కారణంగా.. క్రీమీలేయర్ నిర్ధారణ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు దక్కిన వెసలుబాటు.. PSUలు, బ్యాంకులు, ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు దక్కకుండా పోయింది. ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో జీతపు ఆదాయాన్ని పరి గణనలోకి తీసుకోవద్దన్నారు. అదే పీఎస్‌యూ, బ్యాంకులు, ప్రైవేటు సంస్థల ఉద్యోగుల విషయంలో మాత్రం.. జీతపు ఆదాయాన్ని లెక్కించడం మొదలుపెట్టారు.. ఈ భేద భావం.. చాలా మంది బీసీ వర్గాల పిల్లలకు, రిజర్వేషన్ హక్కు దక్కకుండా చేసింది.

కేంద్ర వైఖరిపై సుప్రీం మొట్టికాయలు..

మొన్న ఇచ్చిన తీర్పుతో సుప్రీంకోర్టు.. బీసీ అభ్యర్థులను నానా అగచాట్లు పెడుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దల మొండి వైఖరిపై మొట్టికాయలు వేసింది. న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం.. వెనుక బడిన వర్గాల వారికి దక్కాల్సిన ప్రయోజనాలను ఓబీసీలలోని సామాజికంగా అభివృద్ధి చెందిన వర్గాలు కైవసం చేసుకోకుండా నిలువరించడం కోసమే క్రీమీలేయర్‌ను మినహాయించడం తప్ప.. అదే సామాజిక వర్గానికి చెందిన సమాన స్థానాల్లో ఉన్న సభ్యుల మధ్య కృత్రిమ వ్యత్యాసాలను సృష్టించడం కాదు. అని స్పష్టీకరించింది.

సమానులను అసమానులుగా పరిగణించి..

హేతుబద్ధమైన సమర్థన లేకుండా అదే వెనుకబడిన తరగతిలోని ఒక వర్గానికి ప్రతికూలతలు కలిగించే వ్యాఖ్యానాన్ని అవలంబించడం సమానులను అసమానులుగా పరిగణించడమేనని, అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రైవేట్ సంస్థలు, పీఎస్‌యూలు, బ్యాంకుల ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులకు భిన్నంగా పరిగణించడం, దాని ఆధారంగా రిజర్వేషన్‌ అర్హతను నిర్ణయించడం వివక్షకు సమానం అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆఫీస్ మెమోరాండంలో ప్రస్తావించిన అంశాల్లో ఏదైనా అస్పష్టత ఉంటే వివరణ లేఖల ద్వారా ఆ అస్పష్టతను తొలగించవచ్చు తప్ప.. ఆఫీసు మెమోరాండం ద్వారా దాఖలు పడిన హక్కుల ను ఆ తర్వాత ఇవ్వబడిన వివరణ లేఖ ద్వారా రద్దు పరచడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంతిమంగా.. సదరు ఓబీసీ అభ్యర్థులను నాన్ క్రీమీ లేయర్‌గా పరిగణించాలని, వారికి దక్కాల్సిన ఉద్యోగాలను.. సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించి మరీ అందించాలని.. కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

బీసీల ప్రయాణం సుదీర్ఘమే!

అర్హతలు సాధించిన బీసీ అభ్యర్థులు ఉన్నా సరే.. నాట్ ఫౌండ్ సూటబుల్ అనే నిబంధనను ఉపయోగించి.. బీసీలకు దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలను ఖాళీగానే ఉంచుతు‌న్నారు. మరోవైపు మోడీ ప్రభుత్వం లాటరల్ ఎంట్రీ పద్ధతి ద్వారా రిజర్వేషన్ నిబంధనలు పక్కకు నెట్టేసి ఆధిపత్య వర్గాలకు చెందిన అభ్యర్థులతో ఉన్నత స్థానాలను నింపేస్తున్నది. మండల్ కమిషన్ అమలు ద్వారా 27% రిజర్వే‌షన్ల హక్కు బీసీ వర్గాలకు దక్కి నేటికీ 33 ఏళ్లు గడుస్తున్నా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నేటికీ 17 శాతం మాత్రమే బీసీ అభ్యర్థులు కొలువు తీరారు. ఉన్నత స్థాయి పదవుల్లో మరింత హీనంగా కేవలం నాలుగు శాతం బీసీ అభ్యర్థులే స్థానం సంపాదించగలిగారు. కంటికి కనిపించని, న్యాయస్థానాల పరిశీలనకు చిక్కని కుల వివక్ష.. బడుగు వర్గాల అభ్యర్థుల విషయంలో అనేక విధాలుగా అమల వుతున్నది. మనువు చేసిన అరాచకాలు మాసిపోవడానికి, దేశ ప్రజలకు సమన్యాయం దక్కడానికి.. ప్రయాణించాల్సిన దూరం ఇంకా చాలా మిగిలి ఉందన్నది స్పష్టం.

-ఆర్. రాజేశమ్,

కన్వీనర్, సామాజిక న్యాయ వేదిక

94404 43183

Next Story