ఆదివాసీల పురోభివృద్ధికి తోడ్పడండి!

by Ravi |   (  Updated:2026-01-22 00:30:54  IST  )

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహించడం చరిత్రలో సంచలన మార్పు. అలాగే గిరిజన కుంభమేళాకు ప్రభుత్వం రూ. 251 కోట్లు కేటాయించి భిన్న సంస్కృతి గల కోయల వందేళ్ల చరిత్రకు పునర్వైభవం తీసుకురావడం శుభ పరిణామం.

ఆదివాసీల పురోభివృద్ధికి తోడ్పడండి!
X

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహించడం చరిత్రలో సంచలన మార్పు. అలాగే గిరిజన కుంభమేళాకు ప్రభుత్వం రూ. 251 కోట్లు కేటాయించి భిన్న సంస్కృతి గల కోయల వందేళ్ల చరిత్రకు పునర్వైభవం తీసుకురావడం శుభ పరిణామం. వాటితో పాటు ప్రజా ప్రభుత్వం తెలంగాణలోని 9 తెగల ఆదివాసీల చిరకాల సమస్యల పరిష్కారానికి ఈ క్రింది నిర్ణయాలు తీసుకోవాలని ఆదివాసీలు కోరుతున్నారు.. అందులో మొదటిది ఐదవ షెడ్యూల్ భూభాగంలో నివసిస్తున్న ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాన్ని జిల్లాల పునర్వ్యవస్థీ కరణలో భాగంగా ప్రత్యేక గిరిజన జిల్లాలుగా ఏర్పాటు చేసి మేడారం పరిసర ప్రాంతాన్ని ‘సమ్మక్క-సారక్క ములుగు’ జిల్లాగా పేరు మార్చాలి. ఇక్కడ భారత దేశంలోని గొప్ప ఆదివాసీ పోరాట యోధుల స్మారక చిహ్నలను ప్రతిష్టించాలి. జాతరకు మూల స్తంభమైన సుమారు 150 కోయల ఇలవేల్పుల ప్రాశస్థాన్ని గుర్తిస్తూ... ఆదివాసీ తలపతులకు తగిన నిధులు కేటాయించాలి. మేడారం జాతర నిర్వహణ విజయవంతం కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డులో ఆదివాసీలను నియమించేలా ప్రత్యేక జీవో తీసుకురావాలి. గిరిజనుల ఏజెన్సీ పరిపాలనను నిర్దేశించిన పెసా చట్టం అమలును పటిష్టం చేయాలి. జస్టిస్ బి. ఎన్. లోకూర్ కమిటీ 1985 రిపోర్టుని పునః పరిశీలించి తెలంగాణ గిరిజనుల రిజర్వేషన్లు, చట్టపరమైన రక్షణలను ప్రక్షాళన చేయాలి. సుప్రీంకోర్టు పెండింగ్‌లో ఉన్న జీవో నంబర్. 3ని పునరుద్ధరించేలా, దాని స్థానంలో కొత్త చట్టం తెచ్చి క్రమబద్దీకరించాలి. ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగ ఆదివాసీ యువతకు 100శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలి. ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించాలి. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో ఆదివాసీలకు తొలి ప్రాధాన్యతనివ్వాలి. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. అలాగే ఐటీడీఏలను బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు అందేలా చూడాలి. మేడారం కేంద్రంగా ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి మార్గాలను పెంపొందించాలి.

- గుమ్మడి లక్ష్మీనారాయణ,

91822 96576

Next Story