ఫీజు బకాయిల భారంలో విద్యార్థులు..

by Ravi |   (  Updated:2025-09-06 00:30:43  IST  )

ఉన్నత చదువు అభ్యసించే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ లాంటి పథకాలు ఒక గొప్ప ఆర్థిక భరోసా.

ఫీజు బకాయిల భారంలో విద్యార్థులు..
X

ఉన్నత చదువు అభ్యసించే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ లాంటి పథకాలు ఒక గొప్ప ఆర్థిక భరోసా. ఇవి ఉన్నంత వరకూ ఉన్నత చదువు చదవాలనుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఏ ఢోకా ఉండదు. కానీ, గత కొన్నేళ్లుగా ఈ పథకం కింద ప్రభుత్వం విడుదల చేసే బకాయిలు సమయానికి విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిపోయింది. ప్రస్తుతం తెలంగాణాలో పెండింగ్‌లో ఉన్న బకాయిలు మొత్తం ₹9,000 కోట్లకు పైగా చేరుకుంది. ప్రతీ సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేరుతున్నారు. వారి ఆశలు మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌పైనే ఆధారపడి ఉంటాయి. కానీ ఈ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయాయి. కొన్ని కళాశాలలు చదువు పూర్తయినా స్కాలర్‌షిప్ పడలేదని సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపేస్తున్నాయి. దీంతో కొందరు విద్యార్థులు లోన్లు తీసుకుని, అప్పు తీసుకొని చదువు కొనసాగిస్తున్నారు. వారిని బ్యాంకు, అప్పు వడ్డీలు తల్లిదండ్రులను బరు వెక్కిస్తున్నాయి. దీంతో చాలా మంది విద్యార్థులు మధ్యలోనే చదువును మానేయాల్సి వస్తోంది. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు. విద్యార్థుల కలలు, కుటుంబాల ఆశలు ధ్వంసం అవుతున్నాయి. 2019 నుండి ఇప్పటివరకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు సక్రమంగా జరగలేదు. బడ్జెట్‌లో నిధులు కేటాయించినా, విడుదలలో ఆలస్యం కారణంగా మొత్తం బకాయిలు రూ. 9,000 కోట్లకు పైగా చేరుకున్నాయి. ప్రతి విద్యార్థి విద్య అనేది ప్రాథమిక హక్కు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ అనేవి దానం కాదు. విద్యార్థుల హక్కు. ఒకవైపు ‘విద్యావంతమైన తెలంగాణ’ అని చెబుతూనే, మరోవైపు విద్యార్థుల భవిష్యత్తు చీకటిలో మిగిలిపోవడం విరుద్ధంగా ఉంది. ఇందుకు తక్షిణ పరిష్కారాలు అవసరం. అందుకే ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ₹9,000 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. అలాగే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఎడ్యుకేషన్ గ్యారెంటీ ఫండ్ ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి.

-రిషి మలిశెట్టి

90140 40507

Next Story