- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్య బలోపేతమే.. తెలంగాణ భవిష్యత్!
తెలంగాణలో విద్యారంగం రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే అతిపెద్ద సామాజిక బలం. కానీ దశాబ్దం గడిచినా, విద్యారంగం ఇంకా బలోపేత దశకు చేరకపోవడం ఆందోళన కలిగించే విషయం. ప్రపంచం విద్యలో పెట్టుబడిని భవిష్యత్తుపై పెట్టుబడిగా చూస్తుంటే, మనం మాత్రం దానిని ఖర్చుగా భావించడం

తెలంగాణలో విద్యారంగం రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే అతిపెద్ద సామాజిక బలం. కానీ దశాబ్దం గడిచినా, విద్యారంగం ఇంకా బలోపేత దశకు చేరకపోవడం ఆందోళన కలిగించే విషయం. ప్రపంచం విద్యలో పెట్టుబడిని భవిష్యత్తుపై పెట్టుబడిగా చూస్తుంటే, మనం మాత్రం దానిని ఖర్చుగా భావించడం తీవ్రమైన వ్యూహపరమైన తప్పిదం..
బడ్జెట్ కేటాయింపుల లోటు, ఖాళీ పోస్టుల భర్తీ ఆలస్యం, మౌలిక వసతుల దుర్వస్థితి, ఉపాధ్యాయుల ఆర్థిక ఒత్తిడి. ఇవన్ని రాష్ట్ర అభివృద్ధి పునాదులను బలహీనపరుస్తున్నాయి. విద్యారంగం మీద రాష్ట్రంలో 3.3 నుండి 3.5 లక్షల కుటుంబాలు నేరుగా జీవనాధారాన్ని పొందుతున్నాయి. ఇంత పెద్దదైన, సమాజ నిర్మాణానికి వెన్నెముకలాంటిది అయిన విద్యారంగాన్ని బలోపేతం చేయడాన్ని ప్రభుత్వం భారంగా భావించకుండా, రాష్ట్ర భవిష్యత్తును రక్షించడానికి చేయవలసిన బాధ్యతగా భావించాలి.
రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం దాటింది. ఈ కాలంలో ప్రభుత్వాలు మారాయి, విధానాలు మారాయి, అభివృద్ధి లక్ష్యాలు ముందుకు సాగుతున్నాయి. అయితే, ఒక రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే అత్యంత కీలక రంగం అయిన విద్య మాత్రం ఇంకా బలోపేతం దశకు చేరలేదు. ఇంకా బలపర్చాల్సిన అవసరాన్ని గట్టిగా సూచిస్తోంది. జ్ఞానం, విజ్ఞానం, నైపుణ్యం.. ఇవి సమాజ పురోగతికి ప్రధాన ఆస్తులు.. ఇవి బలపడాలంటే విద్యారంగం బలంగా, స్థిరంగా ఉండాలి. కానీ ప్రస్తుతం తెలంగాణలో విద్యారంగం అనేక స్థాయిలలో సవాళ్లు ఎదుర్కొంటోంది.
విద్యకు అసలైన అర్థం..
విద్య అనేది కేవలం పాఠశాలలు, గురువులు, తరగతి గదులు, పుస్తకాలు, పరీక్షలు మాత్రమే కాదు. ఇది ఒక రాష్ట్ర ఆర్థిక, సామాజిక, రాజకీయ ఎదుగుదలకు పునాది. జ్ఞానం ఉన్న సమాజం అభివృద్ధి చెందుతుంది, జ్ఞానం లేని సమాజం వెనుకబడిపోతుందనే సత్యాన్ని ప్రపంచంలోని అన్ని అభివృద్ధి చెందిన దేశాలు గుర్తించి విద్యారంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఉపాధ్యాయ వృత్తిని అత్యున్నత స్థానంలో ఉంచుతున్నాయి. అయితే మన రాష్ట్రంలో విద్యకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇప్పటికీ పూర్తిగా ప్రతిఫలించలేదనే చెప్పాలి.
విద్యకు బడ్జెట్ కేటాయింపు లోపం..
యునెస్కో, జాతీయ విద్యా విధానం (NEP-2020) ప్రకారం ఏ రాష్ట్రం అయినా తమ మొత్తం బడ్జెట్‌లో కనీసం 18 నుంచి 20 శాతం విద్యారంగానికి కేటాయించాలి. కానీ తెలంగాణలో ప్రస్తుతం విద్యారంగానికి కేటాయిస్తున్న మొత్తం బడ్జెట్ కేవలం 6 నుంచి 7 శాతం మాత్రమే ఉండటం తీవ్రమైన ఆందోళనకర విషయం. 2024-25 రాష్ట్ర మొత్తం బడ్జెట్ ₹2.65 లక్షల కోట్లు కాగా, విద్యారంగానికి కనీసం ₹53,000 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం సుమారు ₹21,000 కోట్లకు లోపే కేటాయిస్తున్నారు. అంటే సంవత్సరానికి విద్యారంగంలో సుమారు ₹30,000 కోట్ల వరకు భారీ లోటు కొనసాగుతోంది.
బడ్జెట్ లోటు వల్ల ప్రత్యక్ష ప్రభావాలు..
ఈ లోటు.. బోధన నాణ్యత, పాఠశాల మౌలిక సదు పాయాలు, ఆధునిక సాంకేతిక విద్య, గ్రామీణ ప్రాంతాల్లో విద్య అవకాశాలపై నేరుగా దుష్ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఉపాధ్యాయుల జీతభత్యాల విషయంలో కూడా తీవ్రమైన లోటు ఉంది. విద్యా బడ్జెట్‌లో కనీసం 60 నుంచి 70 శాతం ఉపాధ్యాయుల జీతాలు, పెన్షన్‌లు, ఇతర అల వెన్సులకు కేటాయించాలి. అంత ప్రామాణికంగా లెక్కిస్తే ఉపాధ్యాయుల జీతభత్యాల బడ్జెట్ సుమారు ₹30,000 కోట్లు ఉండాలి. కానీ ప్రస్తుతం ₹14,000 కోట్లకు లోపే కేటాయిస్తున్నారు. అంటే సంవత్సరానికి ₹16,000 కోట్లకు సమానమైన లోటు వుంది. ఈ లోటు కారణంగా ఉపా ధ్యాయులు ఆర్ధిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల నియమాకం ఆలస్యంగా చేపట్టడం, పదోన్నతులు ఆలస్యమౌతుండటం, ఒకే గురువు ఎన్నో తరగ తులు చూసే పరిస్థితి, యువత ఉపాధ్యాయ వృత్తిని దూరంగా చూడటం లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి.
విద్యపై పెట్టుబడి అంటే..
విద్యలో పెట్టుబడి తగ్గిపోతే రాష్ట్ర భవిష్యత్తుపై నేరుగా దెబ్బ. ఒక రూపాయి విద్యలో పెట్టుబడి పెడితే పది రూపాయల ఆర్థిక లాభం వస్తుందని ప్రపంచ బ్యాంకు సూచిస్తోంది. అంటే విద్యపై ఖర్చు ఖర్చు కాదు.. రాష్ట్ర అభివృద్ధిపై పెట్టుబడి. ప్రభుత్వ స్కూళ్ల నాణ్యత పడిపోతే, ప్రభుత్వ విద్య బలహీనపడితే, ఎక్కువగా ప్రభావం పేద, గ్రామీణ, వెనుకబడిన వర్గాల పిల్లలపైనే పడుతుంది. ఇది కేవలం విద్యారంగ సమస్య కాదు. ఇది సమాజ సమానత్వం, సమాజ న్యాయం, భవిష్యత్తు అవకాశాలపై పెద్ద ప్రమాదం. అందువల్ల తెలంగాణలో విద్యారంగాన్ని బలోపేతం చేయడా నికి ప్రభుత్వం అత్యవసరంగా చర్యలు తీసుకోవాలి. విద్యారంగానికి బడ్జెట్‌లో 20 శాతం కేటాయించాలి. ఉపాధ్యాయుల జీత భత్యాల బడ్జెట్‌ను ₹30,000 కోట్లకు పెంచాలి. రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. పాఠశాలల మౌలిక వసతుల పున రుద్ధరణకు ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయాలి.
గురువులను గౌరవిస్తేనే..
విద్య బలపడితేనే తెలంగాణ బలపడుతుంది. భవిష్యత్ తరాన్ని జ్ఞానంతో తీర్చిదిద్దడం ప్రభుత్వ అత్యున్నత బాధ్యత. విద్యలో పెట్టుబడి పెట్టకపోవటం అంటే రాష్ట్ర భవిష్యత్తునే ప్రమాదంలో పెట్టడం. విద్య ఒక ఖర్చు కాదు. అది భవిష్యత్ తరాలకు చేసే పెట్టుబడి. గురువులను గౌరవించే రాష్ట్రం ఎదుగుతుంది. విద్యకు న్యాయం జరిగితేనే సమాజానికి న్యాయం జరుగుతుంది. అందుకే విద్యారంగం, ఉపాధ్యాయుల జీవనోపాధి, పాఠశాలలు బలపడటం.. ఇవి ఏ ప్రభుత్వానికైనా కర్తవ్యాలు, దానం కాదు.
– పోలంపెల్లి ఆదర్శన్ రెడ్డి,
తెలంగాణ టీచర్స్ యూనియన్
92477 45123






