సర్పంచుల పీక నొక్కుతున్న సర్కార్

by Disha edit |
సర్పంచుల పీక నొక్కుతున్న సర్కార్
X

ప్రాచీన కాలంలో గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా ఐదు ప్రధాన వృత్తుల ప్రతినిధులతో వుండేది. అయితే వీరికి ఎక్కువగా అధికారముండేది కాదు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ రిప్పన్ ప్రోత్సాహంతో 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాల ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలు బలం పుంజుకున్నాయి. ఈ చట్టాలు రాజ్యాంగంలో గ్రామ పంచాయితీల ఏర్పాటుకు, వాటి అధికారాలకు ప్రాధాన్యం ఇచ్చాయి. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్. 1959 నవంబర్ 1న ఉమ్మడి రాష్ట్రంలో ఈ వ్యవస్థ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా విడుదల చేసే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించడం దారుణం.

కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేక ఖాతాలు తెరిపించి వాటిలో నిధులు జమ చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ కీతో ఆ నిధులను దారి మళ్లించి పంచాయతీల ఖాతాలన్నీ ఖాళీ చేయడం స్థానిక సంస్థల నడ్డివిరచడమే. ఇటీవల కేంద్రం జమ చేసిన 700 కోట్ల రూపాయలను పంచాయతీల కరెంటు బిల్లులంటూ, ట్రాక్టర్ ఈఎంఐల పేరుతో ఆ నిధులను దారి మళ్ళిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచులకు ఉన్న పవర్‌ను కాలరాసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిదని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వలే తాము కూడా ప్రజలు ఎన్నుకుంటేనే పాలనా పగ్గాలు చేపట్టామని గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న ఏకపక్ష విధానాలకు, చర్యలకు నిరసనగా ఇప్పటికే చాలామంది సర్పంచులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు సంబంధించిన చరిత్ర తెలుసుకోవడం మనందరిపై ఉంది. అదేంటో చూద్దాం.

ఈ వ్యవస్థ ద్వారా ఎదిగి..

గ్రామస్వరాజ్యం స్థానిక సంస్థల పటిష్టతతోనే సాధ్యపడి తద్వారా దేశాభివృద్ధి సాధ్యపడుతుందన్నది అక్షరసత్యం. కానీ వాటి బలోపేతానికి చట్టప్రకారం ఆ సంస్థలకు ఇవ్వాల్సిన అధికారాలు, నిధులను ఇవ్వడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. వీటి పటిష్టతకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అనేక మార్పులు, చేర్పులు, సవరణలు చేశారు. కానీ అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడాలు లేవు. ఎవరు అధికారంలో ఉన్నా చేసిందదే. అయితే 2018లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ శాసనసభలో ఈ వ్యవస్థపై సమగ్రమైన మార్పులు ప్రతిపాదిస్తూ స్థానిక సంస్థల ప్రతినిధులకు పూర్తి అధికారాలు ఉండేలా నూతన చట్టం రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం పలువురిని ఆకట్టుకున్నది. ఇప్పటివరకు ఆ వ్యవస్థ ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటుందో ఆయన సోదాహరణంగా వివరించారు. ఈ చట్టం అమలుతో ఆ వ్యవస్థ రూపురేఖలు మారిపోతాయని, నిధులకు కొరత ఉండదని చట్టప్రకారం ఇవ్వాల్సిన అధికారాలు ఇచ్చేస్తారని ఎన్నో ఆశలు పెంచుకున్నారు. అయితే ఇందులో కొంచెం మార్పు కనిపించినా చట్టప్రకారం వారికి ఇవ్వాల్సిన అధికారాలు నేటికి పూర్తిగా ఇవ్వలేదు.

నిజానికి ఈ వ్యవస్థ తొలినాళ్లలో ఎన్నో సర్పంచులకు మర్యాద, అధికారాలు, నిధులు ఉండేవి కానీ రానురానూ ఒక వ్యూహం ప్రకారం వాటిని నిర్వీర్యం చేశారు. అధికారం మారినప్పుడల్లా ఆ వ్యవస్థలో మార్పులు చేయడం ఆనవాయితీగా మారిపోయింది. బలోపేతం కోసం ఎన్నో కమిటీలు చేసిన సిఫార్సులు అమలు పరచకపోగా ఆ వ్యవస్థను పటిష్టం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసినట్లు చెప్పుకుంటారు. కానీ వాస్తవ పరిస్థితి గమనిస్తే అందరూ ఆ వ్యవస్థను పాడుపెట్టినవారే. అయితే ఈ వ్యవస్థను బలోపేతం చేయకుండా ఉండటానికి ప్రధాన కారణం తమ అధికారాలకు దెబ్బతగులుతుందనే భయమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. అందుకే ఈ వ్యవస్థ బలపడకుండా ఎప్పటికప్పుడు మోకాలడ్డుతున్నారు. ఈ వ్యవస్థ ద్వారా రాజకీయ ప్రవేశం చేసి ఎదిగిన కొందరు నాయకులు ఇప్పుడు దీనిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం విచారకరం.

ఎన్నో కమిటీలు సూచించినా..

గ్రామీణ వ్యవస్థ చంద్రగుప్తుడి కంటే ముందే ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది. 1882లో లార్డ్ రిప్పన్ దీనికి ప్రతిపత్తి కల్పించారు. గాంధీ గ్రామ స్వరాజ్యం లక్ష్యంలోనూ స్థానిక సంస్థల పటిష్టత ముఖ్యమైన అంశంగా ఉంది. రాజ్యాంగంలోను స్వపరిపాలన సంస్థలను పోషించాలని నిర్దేశించారు. 1952లో మొదటి పంచవర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను వంద గ్రామాలను, లక్ష్య జనాభాను యూనిట్‌గా తీసుకొని వీటిని ప్రారంభించింది. అయితే ఇవి లక్ష్యసాధనలో ఎంత ఉపయోగపడ్డాయి? మార్పులేమైనా చేయాలా? తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు బల్వంతరాయ్ మెహతా అధ్యక్షతన కమిటీ నియమించారు. ఈ కమిటీ తన నివేదికలో గ్రామీణాభివృద్ధికి నిర్ణయాలు తీసుకునే అధికారం, స్వేచ్ఛ స్థానిక సంస్థలకే ఉండాలని పేర్కొంది. దాని తర్వాత ఏసీపాయ్ కమిటీ, అశోక్ మెహతా కమిటీ ఇలా ఎన్నో అధ్యయనాలు చేసి తగిన సూచనలు చేశాయి.

1981లో నరసింహన్ కమిటీ స్థానిక సంస్థలకు అవసరం మేర నిధులు, వనరులు లేకపోవడంతో అనుకున్న లక్ష్యానికి దూరమవుతున్నాయని వాటిని పటిష్టం చేయాలని సిఫార్సులను తన నివేదికలో పొందుపరచింది. అలాగే స్థానిక సంస్థలను మరింత వికేంద్రీకరణ చేయాలని ప్రతిపాదించింది. ఈ కమిటీ ప్రతిపాదనల మేరకే 1985 వరకు ఉన్న సమితులను రద్దు చేసి మండల ప్రజా పరిషత్తు, జిల్లా ప్రజాపరిషత్లు ఏర్పాటు చేశారు. దేశమంతా ఒకే పంచాయతి వ్యవస్థ కోసం 73వ రాజ్యాంగ సవరణ చేశారు. 1992 పీవీ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని ఎన్నో మార్పులతో తీసుకొచ్చింది. కానీ పీవీ తర్వాత ప్రభుత్వాలు ఆ చట్టాన్ని పెద్దగా పట్టించుకోలేదు. స్థానిక సంస్థల్లో సమర్థమైన పాలనకు అవకాశాలు లేకుండా పోయాయి. 29 అంశాలకు సంబంధించిన విధులు, నిర్వహణ విభాగాలు, పంచాయతీరాజ్ సంస్థకు అప్పగించేందుకు చట్టం చేసిన ఇప్పటికి పూర్తి అధికారం వాటికి అప్పగించలేదు.

గ్రామ స్వరాజ్యం కోసం..

గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన కార్యక్రమాలు మంచివే కానీ దానికి అవసరమైన నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? నిధుల మంజూరు చేయకున్నా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే అధికారుల ఒత్తిడితో ఎంతో మంది సర్పంచులు మానసిక వేదనకు గురవుతున్నారు. కొందరు బలవన్మరణాలకు కూడా పాల్పడుతున్నారు. కొంతమంది అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టినా బిల్లులు రాక అప్పుల పాలయ్యి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తమ పరిస్థితి 'అడకత్తెరలో పోక చెక్కలాగా' ఉందని వాపోతున్నారు. తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన కార్యక్రమాలు ఎన్ని నిర్వహించినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.

రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని కేంద్రం ముందు గావుకేకలు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల చట్టం కల్పించిన అధికారాలు ఇవ్వడానికి వెనకాడటం ఎంతవరకు సమంజసమో చెప్పాలి. నూతన పంచాయతీరాజ్ వ్యవస్థతో స్థానిక సంస్థలకు ఎంతో ప్రతిష్టత చేకూరుతుందని ఆశించారు కానీ అవి నెరవేరకపోవడంతో స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోతున్నాయి. ఇప్పటికైనా నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేసి నిధులు, విధులు స్థానిక సంస్థల ప్రతినిధులకు అప్పగించగలిగితే గ్రామస్వరాజ్యం బాట పట్టినట్టే. అప్పుడే గాంధీజీ. అంబేద్కర్ ఆశించిన గ్రామ స్వరాజ్యం సాధించగలుగుతాం.

మన్నారం నాగరాజు

తెలంగాణ లోక్ సత్తా పార్టీ, రాష్ట్ర అధ్యక్షులు

95508 44433

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

న్యాయ వ్యవస్థపై ముప్పేట దాడి...కేంద్రానికీ ఏపీనే ఆదర్శమా?Next Story