- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శృంగారం వేరు.. అసభ్యత వేరు..!
ఇటీవలి సినిమా పాటల వివాదాల నేపథ్యంలో శృంగారం, అసభ్యత మధ్య ఉన్న తేడా, కళలో మానవ గౌరవం స్థానం, స్త్రీల చిత్రీకరణ, వినోద మాధ్యమాల సామాజిక బాధ్యత వంటి అంశాలపై విశ్లేషణాత్మక చర్చ. సమస్య పదాల్లోనే కాదు, వాటి వెనుక ఉన్న భావజాలంలోనూ ఉందనే కోణాన్ని ఈ వ్యాసం పరిశీలిస్తుంది.

గత వారం ఒక పాట చుట్టూ జరుగుతున్న చర్చలను చూస్తే, అవి ఒక గేయరచయితను సమర్థించడం లేదా వ్యతిరేకించడం వరకే పరిమితమైనట్టుగా కనిపిస్తున్నాయి. కానీ అసలు చర్చ అక్కడ లేదు. చర్చ అంతా శృంగారం, అసభ్యత మధ్య ఉన్న తేడా గురించి, కళ మనిషిని ఎలా చూపించాలి అనే విషయం గురించి చర్చ జరగాలి.
ప్రేమను, సంబంధాలను, స్త్రీని, మానవ గౌరవాన్ని కలిపి తీసుకెళ్లాల్సిన సాహిత్యం కొన్నిసార్లు వాటికి విరుద్ధమైన దిశలో వెళ్తున్నట్టు అనిపిస్తోంది.
పురాణాల్లో ఉందని అన్నీ సమర్థించాలా?
పురాణాలు, ఇతిహాసాలు, పాత సాహిత్యం తమ కాలపు మనుషులు ఎలా ఆలోచించారో, ఎలా జీవించారో చెప్పే సాంస్కృతిక పత్రాలు.. వాటిని చదివేటప్పుడు ఆ కాలాన్ని అర్థం చేసుకోవాలి. అదే సమయంలో మన కాలపు విలువలతో వాటిని ప్రశ్నించాలి కూడా. అదే ఆరోగ్యకరమైన అధ్యయనం. మన పురాణాల్లో ప్రేమ ఉంది, శృంగారం ఉంది, కామం ఉంది, అధికారం ఉంది, పితృస్వామ్యం ఉంది, తిరుగుబాటు కూడా ఉంది. కానీ అక్కడ శరీరం మాత్రమే ఉండదు. భావోద్వేగం ఉంటుంది. నిరీక్షణ ఉంటుంది. విరహం ఉంటుంది. ఒక మనిషిని సంపూర్ణ వ్యక్తిగా చూడడం ఉంటుంది. అందుకే ఆ శృంగారం కళగా నిలిచింది.
పదాల్లో బూతు, భావంలో సంత!
ఈ రోజు వివాదాలకు కారణమవుతున్న పాటల విషయంలో విమర్శకులు చెబుతున్నది ఇదే. వారి అభ్యంతరం కేవలం బూతు పదాల పట్ల మాత్రమే కాదు. మనిషిని సరుకుగా మార్చే భాష పట్ల కూడా. ఒక సంబంధాన్ని అనుబంధంగా కాకుండా లావాదేవీగా చూపించే ధోరణి పట్ల. ఒక స్త్రీని సంపూర్ణ వ్యక్తిగా కాకుండా సేవగా, వస్తువుగా, వినోద సాధనంగా చూపించే దృష్టి పట్ల. అసభ్య పదజాలం అభ్యంతరకరమే. కానీ వాటిని మించిన సమస్య, వాటి వెనుక దాగి ఉన్న భావజాలం. పదాల్లో బూతు ఉండవచ్చు. కానీ భావంలో ఒక మనిషిని సంతలో సరుకులా నిలబెట్టే దృక్పథం ఉంటే అది మరింత ప్రమాదకరం. దీనిని వ్యతిరేకించేవారు కళకు వ్యతిరేకులు కారు. ప్రేమకు వ్యతిరేకులు కారు. వారు ప్రశ్నిస్తున్నది మానవ గౌరవాన్ని తగ్గించే భాషను, దృక్పథాన్ని.
ఎక్స్‌పోజింగ్ కాదు.. చూసే చూపే సమస్య!
ఒక వ్యక్తి ఎలా దుస్తులు ధరించాలనేది అతని లేదా ఆమె స్వేచ్ఛ. కానీ పాటలు, సినిమాలు, వినోదం నిరంతరం మనుషులను కేవలం శరీరాలుగా మాత్రమే చూపించడం మొదలుపెడితే, వ్యక్తిత్వం కంటే రూపం ముఖ్యమవుతుంది. గౌరవం కంటే ఆకర్షణ ముఖ్యమవుతుంది. సమస్య శరీరం కనిపించడంలో లేదు. శరీరాన్ని తప్ప మనిషిని చూడలేకపోవడంలో ఉంది. ఒక్క పాటతో ఎవరూ మారిపోరు. ఒక్క సినిమాతో సమాజం కూలిపోదు. కానీ సంస్కృతి ఒక్కరోజులో ఏర్పడదు. మనం ప్రతిరోజూ వినే పాటలు, చూసే దృశ్యాలు, మాట్లాడే భాష కలిసి ఒక సామాజిక వాతావరణాన్ని నిర్మిస్తాయి. ఒకప్పుడు అసౌకర్యంగా అనిపించిన విషయం పదేపదే వినిపిస్తే సహజంగా అనిపించడం మొదలవుతుంది. ఒక ప్పుడు ప్రేమ, బాధ్యత, గౌరవం గుర్తుకొచ్చే చోట క్రమంగా డబ్బు, వినియోగం, తక్షణ సంతృప్తి మాత్రమే కనిపించడం మొదలవుతుంది.
బాధ్యత ఒక్క గేయ రచయితదేనా?
ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. ఒక పాట అనేది గేయ రచయిత ఒక్కడి సృష్టి కాదు. దానికి దర్శకుడు ఉంటాడు, నిర్మాత ఉంటాడు, సంగీత దర్శకుడు ఉంటాడు, నటీ నటులు ఉంటారు. ఒక భావం తెరపైకి రావడానికి వీరందరి అంగీకారం, భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి ఒక పాటలోని భావజాలం గురించి చర్చించేటప్పుడు మొత్తం బాధ్యతను ఒక్క గేయరచయిత మీదే వేయడం సరైనది కాదు. అదే సమయంలో బాధ్యత నుంచి మిగతావారిని పూర్తిగా మినహాయించడం కూడా సరైనది కాదు. ఎందుకంటే పదాన్ని రాసినవాడు ఒకడైతే, దాన్ని కోట్ల మంది ముందుకు తీసుకెళ్లినవారు చాలామంది ఉంటారు.
అభ్యంతరం పదాలకు కాదు..
అందుకే ఈ పాటపై అభ్యంతరం కొన్ని పదాల పట్ల మాత్రమే కాదు. మొత్తం భావం పట్ల. మనుషులను సంతలో సరుకుల్లా ఊహించి, ఆ దృక్పథాన్ని వినోదంగా చూపించే ధోరణి పట్ల. అసలు ప్రశ్న పాటలో ఎన్ని డబుల్ మీనింగ్ పదాలు ఉన్నాయన్నది కాదు. మన కళ, మన భాష, మన వినోదం మనిషిని మరింత గౌరవంగా చూస్తున్నాయా? లేక మరింత చౌకగా చూస్తున్నాయా? అన్నదే. ఎందుకంటే వారానికో వెయ్యి దాచుకుని వెళ్లే సంతలా మనుషుల్ని మార్చకూడదు కదా. కాస్తలో కాస్త అయినా ప్రేమను, విరహాన్ని, శృంగారాన్ని మనిషి భావోద్వేగాలుగానే ఉంచగలగాలి. సంసారాలను సంతలుగా పేరు పెట్టి పిలుచుకునే స్థాయికి ఇంకా మనం దిగజారకూడదు.
- సుధా మురళి
సినిమా సమీక్షకులు






