వరల్డ్ వాక్:సిరి కోల్పోయిన శ్రీలంక

by Disha edit |
వరల్డ్ వాక్:సిరి కోల్పోయిన శ్రీలంక
X

రాజపక్స కుటుంబీకుల హయాంలో అవధులు లేకుండా కొనసాగిన లంచగొండితనం, జాతీయ ఆస్తులను చైనాకు అమ్మడం, వారసత్వ రాజకీయాలు, ఆర్భాటాల కోసం దేశ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా అత్యంత అధునాతన మౌలిక సదుపాయాల రూపకల్పనకు విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఆ దేశ ఆర్థిక కుంగుబాటుకు దారితీసింది. అన్ని వస్తువులపై పన్నులను ఎనిమిది శాతానికి తగ్గించడంతో ధరలు అమాంతం తగ్గిపోయి ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.30 లక్షలకు పెంచడంతో ఆ స్థాయిలో సంపాదించేవారు లేక ఆదాయం తగ్గింది. వాణిజ్యరంగం పన్నులను 14 శాతానికి తగ్గించారు. జాతి నిర్మాణం కోసం వ్యాపార వర్గాలు చెల్లించే రెండు శాతం పన్నును కూడా ఎత్తివేశారు. రైతులకు, చేపలు, పశుసంవర్ధక పరిశ్రమలకు పూర్తి పన్ను మినహాయింపు ప్రకటించారు.

'కర్ణుడి చావుకు కారణాలు వేయి' అన్నట్టుగా ఉంది శ్రీలంక పరిస్థితి. ఒకప్పుడు విదేశీ పర్యాటకులతో నిత్యం కళకళలాడుతూ ఉండే శ్రీలంక ఇప్పుడు పూర్వ వైభవాన్ని కోల్పోయింది. నడి సంద్రంలో దిశ కోల్పోయిన నావ గమ్యానికి చేర్చే సమర్థవంత నావికుడి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. పాలకుల వారసత్వ పాలన, అనాలోచిత, అసమర్థ విధానాలు, పెచ్చుమీరిన లంచగొండితనం తదితర కారణాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోయింది. మాజీ ప్రధాని మహేంద్ర రాజపక్స, అతని కుటుంబసభ్యులు సొంత ప్రాబల్యం, విలాసాల కోసం దేశ హితాన్ని పక్కన బెట్టారు.

ఒంటెత్తు పోకడలతో, స్వల్పకాలిక ప్రయోజనాలతో ప్రజలను ఆకర్షించేందుకు 2019లో నిర్హేతుక పన్నుల విధానాలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను గత 70 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ఛిన్నాభిన్నం చేసారు. ప్రచండ వేగంతో విస్తరించిన కరోనా ప్రపంచ దేశాలతోపాటు శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పైనా తీవ్ర దుష్ప్రభావం చూపింది. పాలకుల తప్పిదాల కారణంగా నేడు శ్రీలంక ప్రజలు ఆదాయం, కొనుగోలు సామర్థ్యం గణనీయంగా తగ్గి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. క్షేత్ర స్థాయిలో సమగ్ర అధ్యయనం చేపట్టకుండా రసాయనిక ఎరువులపై నిషేధం విధించి, సేంద్రియ సేద్యం వైపు మారాలని మహేంద్ర రాజపక్స తీసుకున్న నిర్ణయం వ్యవసాయ మీద తీవ్రం ప్రభావితం చూపింది. ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. తరువాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.

ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యోల్బణం

2010లో ఎనిమిది శాతం ఉన్న శ్రీలంక తలసరి ఆదాయం (జీడీపీ) 2012లో స్వల్పంగా పెరిగినప్పటికీ, ఆ తరువాత క్రమంగా క్షీణించింది. 2022 లో అది నాలుగు శాతం కన్నా తక్కువగా ఉండబోతోందని 'సెంట్రల్ బ్యాంకు ఆఫ్ శ్రీలంక' అంచనా వేసింది. ఆగష్టు 2021 నుండి ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ ఏప్రిల్ 2022 నాటికి 30 శాతానికి చేరడం దిగజారుతున్న దేశ ఆర్థిక స్థితికి అద్దం పడుతోంది. ఆర్థిక స్థితిని గాడిన పెట్టేందుకు మార్చి 9, 2022 న రూపాయి విలువను తగ్గించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. అమెరికా డాలర్‌తో 33 శాతం తగ్గి రూ. 358.57కు, భారత్‌తో 31.60 శాతం, యూరో తో 31.50 శాతం, పౌండ్ స్టెర్లింగ్ తో 31.10 శాతం, జపాన్ యెన్‌తో 28.70 శాతం మేరకు తగ్గింది.

శ్రీలంక ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థ 'ద్విలోటు'కు చక్కని ఉదాహరణ అని 'ఆసియా అభివృద్ధి బ్యాంకు' 2019 లో విడుదల చేసిన వర్కింగ్ పేపర్‌లో నివేదించింది. 'ద్విలోటు' అంటే ఒక దేశ వ్యయం ఆ దేశ ఆదాయాన్ని మించి పైకి ఎగబాకడం అని అభివర్ణించింది. నిరుద్యోగం సాధారణ సమస్యగా మారి కుటుంబ ఆదాయం తగ్గడంతో ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరింది. దేశంలో పేదల సంఖ్య 2020 నాటికి 11.70 శాతానికి చేరినట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. కరోనా నేపథ్యంలో 50 లక్షల కుటుంబాలకు రూ. ఐదు వేల చొప్పున అందచేసినప్పటికీ ఊరట కల్పించలేకపోయింది. దిగుమతులకు తీవ్ర విఘాతం ఏర్పడి ఆహారం, మందులు, పెట్రోల్, డీజిల్ లాంటి నిత్యావసరాల కోసం ప్రజలు గంటల తరబడి లైన్లలో నిలబడడం సాధారణంగా మారిపోయింది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు దాదాపు 92 శాతం, డీజిల్ ధరలు దాదాపు 76 శాతం పెరిగాయి. డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ సరఫరా చేయలేకపోవడంతో ప్రభుత్వం గంటలకొద్దీ కరెంట్ కోతలు ప్రకటించింది.

ఋణాలతో విలవిల

శ్రీలంక విదేశాలకు 51 బిలియన్ డాలర్ల రుణాలు చెల్లించవలసి ఉన్నదని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రఖ్యాత రేటింగ్ సంస్థ మూడీస్ అంచనా ప్రకారం శ్రీలంక విదేశీ మారక ద్రవ్య నిల్వలు గత రెండు సంవత్సరాలలో 70 శాతం తగ్గి కేవలం రెండు బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ మొత్తం కనీసం రెండు నెలల దిగుమతులకు చెల్లించాల్సిన మొత్తానికి కూడా సరి సమానం కాదు. గత్యంతరం లేని పరిస్థితులలో ఆ దేశం అంతర్జాతీయ ద్రవ్య నిధి సహా విదేశీ రుణాల చెల్లింపులకు సమయం కోరాలని నిర్ణయించుకుంది.

రాజపక్స కుటుంబీకుల హయాంలో అవధులు లేకుండా కొనసాగిన లంచగొండితనం, జాతీయ ఆస్తులను చైనాకు అమ్మడం, వారసత్వ రాజకీయాలు, ఆర్భాటాల కోసం దేశ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా అత్యంత అధునాతన మౌలిక సదుపాయాల రూపకల్పనకు విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఆ దేశ ఆర్థిక కుంగుబాటుకు దారితీసింది. అన్ని వస్తువులపై పన్నులను ఎనిమిది శాతానికి తగ్గించడంతో ధరలు అమాంతం తగ్గిపోయి ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.30 లక్షలకు పెంచడంతో ఆ స్థాయిలో సంపాదించేవారు లేక ఆదాయం తగ్గింది. వాణిజ్యరంగం పన్నులను 14 శాతానికి తగ్గించారు. జాతి నిర్మాణం కోసం వ్యాపార వర్గాలు చెల్లించే రెండు శాతం పన్నును కూడా ఎత్తివేశారు. రైతులకు, చేపలు, పశుసంవర్ధక పరిశ్రమలకు పూర్తి పన్ను మినహాయింపు ప్రకటించారు.

విచ్చలవిడిగా పన్నుల ఎత్తివేత

తేయాకు తోటలలో పని చేసే కూలీల దినసరి వేతనాన్ని రూ.1000 కి పెంచారు. కార్మికుల కనీస నెలసరి వేతనాన్ని రూ.12,500 కి పెంచడం ద్వారా రాజపక్సలు ఓట్లను భారీగా దండుకోగలిగారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పన్నును 24 శాతం నుండి 15 శాతానికి కుదించారు. స్టేట్ బ్యాంక్ ఉద్యోగులకు పింఛను ప్రకటించారు. అపార్టుమెంట్లపై 15 శాతం VATను ఉపసంహరించడంతో యువ గృహ కొనుగోలుదారులు, భవన నిర్మాణ వ్యాపారుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. అంతర్జాతీయ విపణిలో ధరలు పెరుగుతున్న తరుణంలో భారత్ నుండి పెట్రోల్ దిగుమతి చేసుకుంటూ, మన దేశంలో కన్నా ధర తక్కువ ఉండేలా చేసి ఆదాయాన్ని కోల్పోయేలా చేశారు.

చైనా సహా ఇతర దేశాల నుండి రుణాలను తీసుకుని దేశ ఉత్పాదకతకు ఏమాత్రం తోడ్పడని విలాసవంత ఆధునీకరణలకు, రహదారులకు, ఇతర మౌలిక సదుపాయాల రూపకల్పనకు ఖర్చు చేయడంతో అవి నేడు ఐరావతాలుగా మారాయి. శ్రీలంక నేటి స్థితిని ప్రత్యక్షంగా చూస్తున్న భారత్‌లాంటి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల పాలకులు విచక్షణారహితంగా ఉచితాల ఎరలు చూపి ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చే అనైతిక విధానాలకు స్వస్తి పలికి, ఉత్పాదకత పెంచే ప్రణాలికలను రచించి దేశ ప్రగతికి పాటుపడుతూ, ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ, భావితరం నాయకులకు మార్గదర్శకులుగా నిలవాలి.

యేచన్ చంద్రశేఖర్

హైదరాబాద్

8885050822


Next Story

Most Viewed