- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజమైన సామాజిక వైద్యుడు.. డాక్టర్ రామనాథం
వరల్డ్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ, పౌరహక్కుల కోసం పోరాడిన వరంగల్‌కు చెందిన డాక్టర్ రామనాథం జీవితం, ఆయన సామాజిక సేవ, వైద్య వృత్తిపై ఆయన దృక్పథం, సమాజానికి అందించిన స్ఫూర్తిదాయక సందేశంపై ప్రత్యేక కథనం.

ప్రజల ప్రాణాలను నిలిపే వైద్యసేవను, తమ ఆస్తులు సంపాదించే సాధనంగా మార్చేసారు! శ్రామిక ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించలేనప్పుడు, ప్రభుత్వ ఆసుపత్రులు ఎన్ని ఉన్నా, ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు! ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా, సామాజిక బాధ్యత కలిగిన కొందరు వైద్యులు.. పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించడమే కాకుండా, వారి జీవన వికాసం కోసం జరిగే ప్రజా పోరాటాల్లో మేము సైతం అంటూ, పాలుపంచుకున్న సామాజిక వైద్యులు చిరస్మరణీయులు!
పిల్లలకే కాదు.. సమాజానికే వైద్యుడు..
సాధారణ పసిపిల్లల డాక్టర్ రామనాథం, ఒక సామాజిక వైద్యుడు అయ్యాడు!' ఈ సామాజిక సత్యాన్ని తెలుసుకొని, నేటి యువత ఈ మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి, ఆ దారిలో పయనించాలి! అప్పుడే సమాజానికి, శ్రామిక ప్రజలకు మేలు జరుగుతుంది! అదే డాక్టర్ రామనాథంకు, నిజమైన నివాళి అవుతుంది! ఆయన వృత్తి రీత్యా, చిన్నపిల్లల డాక్టర్. అంతకు మించి, అతను ఒక సామాజిక వైద్యుడు! 1968వ సంవత్సరం వరంగల్‌లో చిల్డ్రన్ హాస్పిటల్ స్థాపించాడు. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు.. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉన్నాడు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు.. శ్రమదోపిడి పునాదుల మీద కొనసాగుతున్న, ఈ అసమానతల వ్యవస్థను.. శ్రమను గౌరవించే సమానత్వ సమాజంగా మార్చాలనీ, అందుకు వృత్తిపరమైన వైద్యం ఒక్కటే చాలదనీ, సమాజానికి కూడా వైద్యం చేయాలని, గట్టిగా నిశ్చయించుకున్నాడు.
అన్యాయాలపై ప్రశ్నించే గొంతుక..
అంతవరకు ప్రభుత్వ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రామనాథం, తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి.. శ్రామిక ప్రజలకు ఉచితంగా వైద్యం చేయడం కోసం 'ప్రజా వైద్యశాలను' ఏర్పాటు చేశాడు. తన వైద్య వృత్తిని, తన సామాజిక బాధ్యతను సమాజపరం చేసాడు. అన్యాయాలపై ప్రశ్నించే ప్రజల గొంతుకగా, పౌరహక్కుల సంఘంలో భాగస్వామి అయ్యాడు. ప్రజలపై భూస్వాములు చేసే దాడులను, పోలీసులు చేసే బూటకపు ఎన్‌కౌంటర్‌లను, లాకప్ డెత్‌లను, మిస్సింగ్ కేసులను నిరసించాడు. నిజ నిర్ధారణ కమిటీల ద్వారా పోరాడి, నిజాలను వెలుగులోకి తెచ్చాడు. తత్ఫలితంగానే, పాలకవర్గాల కంటిలో నలుసయ్యాడు.
నిరాయుధుడిపై ఘాతుక చర్య..
అది 1986, సెప్టెంబర్ 3. డాక్టర్ రామనాథం జీవితంలో చివరి రోజు. ఇందుకు సంబంధించిన అప్పటి నేపధ్యాన్ని, సారాంశంగానైనా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 1986 సెప్టెంబర్ 2 న, వరంగల్ లో ఎస్.ఐ. యాదగిరి రెడ్డిని, ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ హత్య చేసింది. మరునాడు ఆ ఎస్.ఐ. శవయాత్ర ఊరేగింపు, రోడ్డు మీద వెళ్తున్న సమయంలో.. సరిగ్గా రామనాథం క్లినిక్ దగ్గరికి వచ్చేసరికి, మఫ్టీలో ఉన్న కొంతమంది సాయుధ పోలీసులు.. క్లినిక్‌లోకి వెళ్లి, దాన్ని ధ్వంసం చేసి, డాక్టర్ రామనాథాన్ని తుపాకులతో కాల్చి చంపారు. స్వయంగా ఆనాటి డీజీపీ, ఎస్పీల పర్యవేక్షణలో ఆ ఎస్సై శవయాత్ర ఊరేగింపు కొనసాగుతున్నప్పటికీ.. నిరాయుధుడైన ఒక ప్రజల డాక్టర్ మీద ఈ ఘాతుకం జరగడం గమనార్హం!
రామనాథంని గౌరవించడం అంటే...
ప్రజల ముద్దుబిడ్డ డాక్టర్ రామనాథాన్ని గౌరవించడం అంటే.. డాక్టర్లు అయిన వారు 'వారి వృత్తిని, వైద్యాన్ని సమాజపరం చెయ్యడమే'! సామాజిక ఉద్యమకారుడైన 'డాక్టర్ రామనాథాన్ని' గౌరవించడం అంటే.. 'శ్రమను గౌరవించడం. శ్రామికుల శ్రమల వల్లే, సమాజం పురోగమిస్తుంది' అనే సామాజిక సత్యాన్ని తెలుసుకోవడం! చివరగా 'ఒక సాధారణ చిన్న పిల్లల డాక్టర్.. ఒక సామాజిక వైద్యుడిగా, ఒక హక్కుల కార్యకర్తగా, పీడిత ప్రజల గొంతుకగా ఎదగడానికి కారణం.. ఈ మానవ సమాజాన్ని, మార్క్సిస్టు వర్గ చైతన్యంతో విశ్లేషించగలిగే, మార్క్సిస్టు వర్గ దృక్పథాన్ని అలవర్చుకోవడమే, ఇందుకు ప్రధాన కారణం'!
(వరల్డ్ డాక్టర్స్ డే సందర్భంగా)
- ముద్దగౌని సుభాష్
90009 04284






