- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడ్డెరలకు న్యాయం దక్కేనా?
ఎర్రనిఎండల్లో పని చేస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడుతున్న వడ్డెర బతుకులు నానాటికి అడుగంటి పోతున్నవైనం ఇప్పుడు మరింత స్పష్టంగా కన్పిస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: కొలిమిలో కాలిన బంగారానికున్న విలువ నానాటికి పెర్గుతూపోతుంటే ఎర్రనిఎండల్లో పని చేస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడుతున్న వడ్డెర బతుకులు మాత్రం నానాటికి అడుగంటి పోతున్నవైనం ఇప్పుడు మరింత స్పష్టంగా కన్పిస్తుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వడ్డెర కులాన్ని ST లో చేరుస్తామని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల బహిరంగ సభలో ప్రకటించారు. నేటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నపుడు వడ్డెర కులాన్ని యస్టిలో చేర్చాలని కేంద్రానికి లేఖ రాశారు.
హామీలిచ్చారు.. మరిచారు
స్వరాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టిఆర్ యస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం వడ్డెర్లను ఏనాడు పట్టించుకున్న దాఖలాలు కన్పించలేదు. భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ బహిరంగ సభలో వడ్డెర కులాన్ని యస్టి జాబితాలో చేరుస్తామని ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టో 31 వ పేజీ 5వ లైన్లో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి కావలసిన నిధులు కేటాయిస్తామని పొందుపరిచారు. తదనంతరం జరిగిన 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే వడ్డెరలు ఓట్లు వేసి గెలిపించారనేది జగమెరిగిన సత్యం.
ఒక్క ఎమ్మెల్యే కూడా ఊసెత్తలేదు
తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేలకు గాను 100 మంది ఎమ్మెల్యేలను స్థానిక వడ్డెర సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో వడ్డెరలను యస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డెర కుల అభివృద్ధికి 1000 కోట్ల నిధులు కేటాయించాలని అసెంబ్లీ లో ప్రస్తావించి బిల్లు పెట్టాల్సిందిగా వినతి పత్రాలు అందజేసినా అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఒక్క MLA కూడ వడ్డెరల ఊసే ఎత్తకపోవడం గమనార్హం!
ఎస్టీ జాబితా కోసం పోరాటం
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 27నెలలు అవుతున్నా ఎక్కడ కూడ వడ్డెర్ల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు వడ్డెర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వడ్డెరలను విస్మరించి వడ్డెర్లను ఆర్ధికంగా అలాగే సామాజికంగా మరింత దెబ్బతీస్తునే ఉన్నారు. అణగారిన వడ్డెర తెగ 47 ఏళ్లగా యస్టీ జాబితా కోసం పోరాడుతూనే ఉంది.
బీసీ జాబితాలో చేర్చడమే దెబ్బ
1952లో భారత ప్రభుత్వం క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్‌ను రద్దు చేసి వడ్డెరలను సంచారజాతిగా గుర్తించినా, BC జాబితాలో చేర్చి తీరని అన్యాయం చేసి, విద్య,ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాలలో వడ్డెర్లు వెనకబడిపోవడానికి కారణం అయింది. వడ్డెర పని విధానం ఈ దేశ నిర్మాణానికి, మనిషి మనుగడకు పునాది, గడ్డపార పట్టి మట్టిని పొక్కిలించిన దగ్గరి నుండి గొప్ప గొప్ప ఇంజినీర్లు చేసే పనులను కూడా సునాయాసంగా నిర్మించిన కళ వీరిసొంతం.
వడ్డెరలకు ప్రత్యేక చట్టం
కులవృత్తి పనుల మీదనే ఆధారపడి బతికే వడ్డెరలు అత్యాధునిక యంత్రాలను పూర్తి సబ్సిడీపై అందజేయాలని కోరుతున్నారు. గుట్టలు, క్వారీలపై పూర్తి అధికారం వడ్డెర్లకే కల్పించాలని, ఇందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వడ్డెర ఫెడరేషన్‌ను వడ్డెర కార్పొరేషన్‌గా మార్చి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని అభ్యర్థిస్తున్నారు. తెలంగాణలోని వడ్డెరలు కుల అభివృద్ధి, అభ్యున్నతి కోసం వడ్డెర కులాన్ని బీసి జాబితా నుండి తొలగించి యస్టీ జాబితాలో చేర్చాలి అని శాంతియుత పోరాటానికి పూనుకున్నారు.
(వడ్డెరల శాంతియుత పోరాటానికి సంఘీభావంతో..!)
ఓర్సు హేమలతా అశోక్,
91824 75331






