- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై సుప్రీంకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా లక్షలాది ఉపాధ్యాయుల్లో ఆందోళనకు దారితీసింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ‘టెట్’ అర్హతను తప్పనిసరి చేస్తూ వచ్చిన ఈ నిర్ణయం, ఇప్పటికే సేవలో ఉన్న ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతపై అనిశ్చితిని మిగిల్చింది. సంవత్సరాల అనుభవంతో బోధన కొనసాగిస్తున్న టీచర్లకు ఇప్పుడు మరోసారి అర్హత పరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడటంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యా నాణ్యత పెంపు లక్ష్యంగా తీసుకున్న ఈ చర్య వాస్తవంగా ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరుస్తుందా, లేక అనవసర భారంగా మారుతుందా అన్న చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది.
విద్యాహక్కు చట్టం- 2009 (RTE) సెక్షన్ 23 ప్రకారం ఉపాధ్యాయులుగా నియమితులైన వారందరూ 'టెట్' అర్హత కలిగి ఉండాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) తన నిబంధనలో పేర్కొన్నది. అయితే ఈ చట్టం అమలులోనికి రాకముందు నియమితులైన టీచర్లు 'టెట్' రాయనవసరం లేదని చాలా రాష్ట్రాలు భావించాయి. అలాగే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 'టెట్'కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఇన్ సర్వీసు టీచర్లకు 'టెట్' అవసరం లేదని పేర్కొన్నది. తెలంగాణ రాష్ట్రం ఇదే అనుసరించింది.
మాకెందుకు ఈ అర్హత పరీక్ష
సుప్రీంకోర్టు తీర్పుతో ‘టెట్’ పరీక్ష రాయాల్సి వస్తుండగా, ఆ పరీక్షలో సంబంధం లేని సబ్జెక్టులు కూడా ఉండటం టీచర్లకు ఇబ్బందిగా మారింది. సంవత్సరాలుగా ఒకే సబ్జెక్టు బోధిస్తున్న వారికి ఇతర సబ్జెక్టులతో పరీక్ష నిర్వహించడం అన్యాయమని వారు అంటున్నారు. అలాగే సాధారణ అభ్యర్థుల వలె ఇన్ సర్వీస్ టీచర్లకు కేటగిరీల వారీగా ఉత్తీర్ణత మార్కులు నిర్ణయించడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అవసరమైన అర్హతలు, డీఎస్సీ ద్వారా ఉద్యోగం పొందిన తర్వాత మళ్లీ ఈ పరీక్ష ఎందుకని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. అసలు 'టెట్' దేనికోసం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందుకా విద్యాహక్కు చట్టంలో ఉన్నందుకా అని లోతుగా పరిశీలించి చూస్తే విద్యాహక్కు చట్టం, NCTE నిబంధనల ప్రకారం బోధనా ప్రమాణాలను పెంపొందించడానికి ఇది ఒక ప్రాథమిక అర్హత అని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. సుప్రీంకోర్టు కూడా తన తీర్పులో ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను పెంచడానికి, విద్యా నాణ్యతను సాధించడానికి 'టెట్' కీలకమని వ్యాఖ్యానించడం గమనార్హం. చట్ట పరంగా ఈ తీర్పు కొంతవరకు సమర్థనీయంగా కనిపిస్తున్న ఉపాధ్యాయ నాణ్యతను ఎలా అర్థం చేసుకోవాలి అన్నదే ప్రశ్న.
ఈ పరీక్షలో ఉత్తిర్ణులైతే చాలా..
నిజానికి 'టెట్' అనేది ఆయా సబ్జెక్టుల్లో ఉపాధ్యాయులకు ఉన్న ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షిస్తున్నది. అది కూడా ఆబ్జెక్టివ్ ప్రశ్నల ద్వారా. దీనివల్ల ఆ అంశాలపై ఉపాధ్యాయులకు ఉండే లోతైన అవగాహన, పరిశీలన, విశ్లేషణాత్మక, విమర్శనాత్మక, సృజనాత్మక సామర్థ్యం ఎలా తెలుస్తుంది. కోచింగ్ సెంటర్లలో శిక్షణ ద్వారా, బిట్ బ్యాంకుల ద్వారా నేర్చుకొని 'టెట్' పరీక్ష రాసి ఉత్తీర్ణులైతే అది ఏ సామర్థ్యం ఏ నైపుణ్యం ఈ 'టెట్' ఉపాధ్యాయుని బోధనా సామర్థ్యం, నైపుణ్యం, తరగతి గదిలో విద్యార్థులతో గల పరస్పర భాగస్వామ్యం, భావోద్వేగాలను అంచనా వేయగలదా లేదు. అటువంటప్పుడు ఇది ఉపాధ్యాయ నైపుణ్యాలను పెంచే పరీక్ష ఎందుకవుతుంది. నిజానికి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన ప్రతి ఉపాధ్యాయుడు తన సబ్జెక్టుకు సంబంధించిన విషయాలను నిరంతరం అధ్యయనం చేయాలి. నూతన బోధనా పద్ధతులను తెలుసుకొని అనుసరించాలి. బోధనా సమయంలో అవసరమైన మేరకు సాంకేతికతను వినియోగించగలగాలి. ఇందుకు 'టెట్' ఏ విధంగా దోహదం చేయగలదు.
శిక్షణ ద్వారానే ప్రమాణాలు పెరుగుతాయి!
నిజానికి ఉపాధ్యాయుని బోధనా నైపుణ్యాలను, నాణ్యతలను పెంపొందించడానికి సంస్థాగత వృత్యంతర శిక్షణలు అవసరం. తద్వారా వారు వృత్తిపరమైన అభివృద్ధిని సాధించే ఆస్కారం ఉంటుంది. దురదృష్టవశాత్తు NCTE పరీక్షల ఆధారిత ప్రమాణాలనే నాణ్యతగా భావించడం బాధాకరం. ప్రతి రాష్ట్రంలో ఉన్న విద్యాపరమైన అకడమిక్ సంస్థలను పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ఉపాధ్యాయులకు నాణ్యమైన శిక్షణ ఇవ్వడం ద్వారానే బోధనా ప్రమాణాలు మెరుగుపడతాయి.. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తే బాగుంటుంది. 'టెట్' వల్ల లక్షలాది టీచర్ల ఉద్యోగ భద్రతపై కలిగిన ఆందోళన అర్థం చేసుకొని ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని AISTF సోదర సంఘాలతో కలిసి దేశ రాజధానిలో మహాధర్నా నిర్వహించింది. 'టెట్' సిలబస్, ఉత్తీర్ణత మార్కులు మొదలైన అంశాలతో పాటు ఇన్ సర్వీసు టీచర్లకు 'టెట్' మినహాయింపు ఇచ్చేలా పరిశీలించాలని కేంద్ర విద్యా మంత్రిని కోరింది. ప్రస్తుతం 'టెట్' సమస్య కేంద్రం చేతిలో ఉన్నది. ఫలితం కోసం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయలోకం వేయికళ్లతో ఎదురుచూస్తున్నది.
- సుధాకర్.ఏ.వి
రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, STUTS
90006 74747






