“సర్వం మాయ” ఆలోచింపజేసే అనుభవం

by velandi.Saikiran |   (  Updated:2026-03-27 22:31:01  IST  )

‘సర్వం మాయ’ఈ హారర్ కామెడీ చిత్రం, ప్రముఖ నటుడు నివిన్ పౌలీ దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఈ చిత్రంతో కమ్‌బ్యాక్ ఇచ్చాడు.

“సర్వం మాయ” ఆలోచింపజేసే అనుభవం
X

24 ఫ్రేమ్స్

“సర్వం మాయ” ఆలోచింపజేసే అనుభవం

మన తెలుగు సినిమారంగంలో హారర్ సినిమాలు చాలా తక్కువ. ఎప్పుడో అర్దరాత్రి లాంటి సినిమాలు వచ్చాయి తప్ప హారర్ జానర్ మనకు అంతగా తెలీదు. కానీ మలయాళ సినిమా పరిశ్రమ మంచి హారర్ సినిమాను రూపొందించి మళ్లీ ఒకసారి తన సృజనాత్మకతను నిరూపించుకున్నది. దర్శకుడు అఖిల్ సత్యన్ రూపొందించిన . ‘సర్వం మాయ’ఈ హారర్ కామెడీ చిత్రం, ప్రముఖ నటుడు నివిన్ పౌలీ దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఈ చిత్రంతో కమ్‌బ్యాక్ ఇచ్చాడు.

సర్వం మాయ కేవలం భయపెట్టే సినిమా కాదు, అది ఒక దెయ్యం తన స్వంత రహస్యాన్ని తానే తెలుసుకోవాలని చేసే ప్రయాణం. ఆ సంఘర్షణలో హాస్యం, ఆర్తి, భావోద్వేగాల్ని మేళవించారు. ప్రభేందు నంబూద్రి కేరళలోని సాంప్రదాయ బ్రాహ్మణ పూజారి కుటుంబంలో జన్మించిన ఒక ఆశావహ గిటారిస్ట్ కానీ నాస్తికుడు. యూరోపియన్ దేశానికి తన వీసా దరఖాస్తు తిరస్కరించబడిన తర్వాత, అతను తన స్వస్థలమైన పాలక్కాడ్‌కు తిరిగి వస్తాడు. స్థిరమైన వేరే ఉద్యోగం దొరకకపోవడంతో, తాత్కాలికంగా తన బంధువు రూపేష్‌కు సహాయకుడిగా పూజారితనం చేస్తాడు, ఎంతో కొంత డబ్బు సంపాదించడం ప్రారంభిస్తాడు.

వాట్సాప్‌లో స్త్రీల దుస్తుల ఆర్డర్

ఇంతలో రూపేష్ ఒక వింత ప్రమాదానికి గురవుతాడు. ప్రభేందును పూజారితనం కొనసాగించమంటాడు. ఒక చిన్న పిల్లవాడిపై నకిలీ భూతవైద్య కర్మను చేస్తాడు, అది విజయవంతం అవుతుంది. ఆ అబ్బాయి మామూలవుతాడు. కానీ కొద్దిసేపటికే, ప్రభేందు తన వాట్సాప్ ప్రొఫైల్ యాదృచ్ఛికంగా మారిందని ఎవరో తన అమెజాన్ ఖాతాను ఉపయోగించి స్త్రీల దుస్తులు ఆర్డర్ చేశారని గమనిస్తాడు.

ప్రేమలో పడిన ఆత్మ

ఒక రోజు అర్ధరాత్రి మేల్కొన్నప్పుడు తన గదిలో ఒక యువతి తన ఫోన్‌ను ఉపయోగిస్తుండటం చూసి ఆశ్చర్యపోతాడు. ఆ స్త్రీ కూడా ఆశ్చర్యపోయి, క్షమాపణలు చెప్పి వెళ్లిపోతుంది. ఇది పదేపదే జరుగుతుంది. ప్రభేందు పూజలకు యువకుడి నుండి బయటపడ్డ ఆత్మ తానేనని యువతి చెబుతుంది. అతనికి మాత్రమే కనిపించే ఆ స్త్రీకి తానెవరో తన గతం గురించి జ్ఞాపకం ఉండదు, కానీ ప్రభేందు సంగీత సెషన్లలో సహాయం చేస్తుంది. ఇద్దరూ క్రమంగా దగ్గరవుతారు. భావోద్వేగ బంధాన్ని ఏర్పరుచుకుంటారు. అతను ఆమెకు డెలులు అనే పేరు పెడతాడు. క్రమంగా డెలులు మనిషి ప్రవర్తనను చూపించడం ఆరంభిస్తుంది. అందులో భాగంగా ప్రభేందు వస్తువులను తీసుకోవడం పరిసరాలతో సంభాషించడం వంటివి చూసి కొన్నిసార్లు అతని చుట్టూ ఉన్న వ్యక్తులను గందరగోళానికి గురి చేస్తుంది. ప్రభేందు ముంబైకి చెందిన బాలీవుడ్ సంగీత దర్శకుడి మేనేజర్ సాధ్యతో కూడా స్నేహాన్ని ఏర్పరుచుకుంటాడు, కాలక్రమేణా డేలులు ప్రభేందు పట్ల ప్రేమ భావాలను పెంచుకుంటుంది., కానీ అతను స్పందించడానికి సంకోచిస్తాడు, అలాంటి సంబంధం సాధ్యం కాదని, తాను సాధ్యకు ప్రేమలో పడ్డానని చెబుతాడు.

గతం జ్ఞాపకంతో మాయ అదృశ్యం

తరువాత ప్రభేందు ఒక తీవ్రమైన రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుంటాడు, ఆ సంఘటనతో డేలులుకు తన గతం జ్ఞాపకమొస్తుంది. ఆమె పేరు మాయ మాథ్యూ మంజూరన్ అని, తన కుటుంబంతో ఇడుక్కిలోని కుట్టిక్కనంలో నివసించేదని ఆమెకు గుర్తొస్తుంది. మాయ తన సీనియర్‌తో ప్రేమలో పడుతుంది. అతనికి ప్రపోజ్ చేయడానికి కుటుంబంతో కలిసి బయలుదేరాగా ఆమె ఒక వాహన ప్రమాదంలో చిక్కుకుని బ్రెయిన్ డెడ్ అవుతుంది. తన గతాన్ని పూర్తిగా గుర్తుచేసుకున్న తర్వాత, మాయ ప్రభేందుని కౌగిలించుకుంటుంది, ఆ సమయంలో ప్రభేందు అభిమానంగా కన్నీరు కారుస్తాడు. ఆమె కథను విని అర్థం చేసుకున్న వెంటనే డేలులు మాయ ప్రశాంతంగా అదృశ్యమవుతుంది.

తరువాత ప్రభేందుడు కుట్టిక్కనం వెళ్లి మాయ తల్లిని కలుసుకుని, తనను తాను ఆమె స్నేహితుడినని పరిచయం చేసుకుంటాడు. మాయ తల్లి మాయ ప్రేమించిన వ్యక్తి అతనేనా అని అడిగినప్పుడు, ప్రభేందు ఆగి, అనిశ్చయంగా సమాధానం చెప్పి, ఆ ఇంటి నుండి బయలుదేరాతాడు. అతనికి తేలికపాటి గాలి వీచినట్లు అనిపిస్తుంది, మాయ తన ఉనికికి ఒక రూపంగా గతంలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేసుకుంటాడు. చివరికి మాయ జ్ఞాపకాల ద్వారా మార్గనిర్దేశం చేయబడి సంగీతకారుడు కావాలనే తన కలను ప్రభేందు నెరవేర్చుకుంటాడు. ఇదీ స్థూలంగా కథ.

మాయ... మనసు నిర్మించిన గోడ

అయితే “సర్వం మాయ” అనే పదబంధం భారతీయ తత్వంలో ఒక విస్తృతమయిన భావన. ప్రపంచం అనుభవమాత్రమే. పరమసత్యం వేరేది అని అద్వైతం చెబుతుంది. ఈ సినిమా కూడా అదే ప్రశ్నను ఆధునిక మనిషి ముందుంచుతుంది మనిషి చూస్తున్నది వాస్తవమా లేక తన మనస్సు గీయించిన ప్రతిబింబమా ఇక్కడ మాయ భూతరూపంలో రాదు. అది అపరాధబోధ రూపంలో వస్తుంది. అది నిశ్శబ్దంగా మనిషిని లోపల నుంచే నమిలేస్తుంది. “ సర్వం మాయ” చివరికి ఒక ఉపమానం. మనిషి తనను తాను అర్థం చేసుకునే ప్రయాణంలో అతడే సృష్టించే మాయలు అతనిని అడ్డుకుంటాయి. మాయ అనేది బయటి ప్రపంచం కాదు. అది మనసు నిర్మించిన గోడ. ఆ గోడను కూల్చగలిగితేనే అస్తిత్వం స్పష్టమవుతుంది.

ఆలోచింపజేసే గొప్ప అనుభవం

ఈ “సర్వం మాయ” సాధారణ హారర్ సినిమా కాదు. ఇది మనసు లోతుల్లో దాగి ఉన్న భయాలను, గాయాలను, మాయలను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం. మానసిక థ్రిల్లర్లను ఇష్టపడితే, ఈ సినిమా ఆలోచింపజేసే అనుభవంగా మిగులుతుంది. సారాంశంలో కథాపరంగానూ సినిమాటిక్ పరంగానూ, మరో వైపు మంచి సున్నితమయిన హాస్యాన్ని పంచుతూ సాగి ఆకట్టుకునే సినిమా ‘సర్వం మాయ’.

వారాల ఆనంద్

94405 01281

సినిమా: సర్వం మాయ

దర్శకత్వం: అఖిల్ సత్యన్

నటీనటులు: నివిన్ పౌలీ, అజు వర్గీస్, జనార్దన్, రియా శిబు

లభ్యం: జియో హాట్ స్టార్‌

Next Story