- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనసులో మాట
దేశంలో నాణ్యమైన ప్రజాస్వామ్యాన్ని నిలుపుకునే పనుల విషయంలో అజ్ఞాతం వదిలి, ఇప్పుడు విశాల ప్రజాక్షేత్రంలోకి వచ్చిన నాయకులకు కూడా ఎంతో బాధ్యత ఉంటుంది.

మనసులో మాట
బాధ్యతాయుత సంవాదమే .. మావోయిస్టుల కర్తవ్యం!
దిశ, వెబ్ డెస్క్: సామాజిక ఆర్థిక సిద్ధాంతపర భావాలు ఎటువంటివయినా సరే అవి పూర్తిగా అంతరించవు.. మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్ట్ రాజకీయాలు కూడా దీనికి మినహాయింపు ఏమీ కావు.. ఈ మార్చి 31 తరువాత కూడా మన దేశంలో పార్లమెంటరీ రాజకీయాల ద్వారా బాగా నిర్లక్ష్యానికి గురి అవుతున్నసముదాయాల వారు ఉంటారు..
వారిలో కొందరికి మార్క్సిస్ట్, లెనినిస్ట్, మావోయిస్ట్ (ఎమ్ఎల్ఎమ్) సిద్ధాతం పునాదిగా ఉన్న సాయుధ, నిరాయుధ, దీర్ఘకాల ప్రజా యుద్ధం ద్వారా అధికార సాధన రాజకీయాలు ఆకర్షణీయంగా అనిపించవచ్చు. అవి దేశంలో ఎక్కడో ఒకచోటనో లేదా కొన్ని చోట్లనో కొనసాగవచ్చు కూడా.. అయితే ఇప్పుడు మాత్రం, ఆ పోరాటాల నాయకత్వ స్థాయిలో ఉన్నవారి తీవ్ర అవగాహనా, ఆచరణ పరిమితుల వల్ల , మార్గానికి ప్రజా మద్దతు తగ్గిపోయిందనే మాట నిజం.
మావోయిస్టు పెద్దల మొదటి బాధ్యత ఇదే!
దేశంలో 1960 మొదలుకొని దాదాపు ఆరు దశాబ్దాలుగా సాయుధ పోరాట రాజకీయాలు కొనసాగుతున్నాయి.. అయితే 1990ల తర్వాతి ప్రపంచ, దేశ వ్యాప్త పరిణామాలను అర్థం చేసుకుని, తమ పనితీరును మార్చుకుని దేశంలోని వివిధ ప్రజా సమూహాల దగ్గరికి చేరుకోవడంలో ఆ రాజకీయాలు సఫలం కాలేదు.. వారి పరిస్థితికి కేవలం ప్రభుత్వ సాయధ బలగాల దాడులు, అంతర్గత విద్రోహాలు కారణమనుకోవడం పరిమిత అవగాహన. అవి రెండింటినీ దాటిన సామాజిక ఆర్థిక అంశాలు, నిర్మాణ , నిర్వహణ పర అంశాలు ఈ స్థితికి కారణం. ఇప్పుడు దీనికి దాపరికం లేని విశ్లేషణ జరగాలి. అది బహిరంగ జీవనంలోకి వచ్చిన మావోయిస్ట్ పెద్దల మొదటి బాధ్యత. భారత రాజ్యాంగ పునాదిగా నియమబద్ధం అయిన ప్రజాస్వామిక పాలనను, వివక్ష, దోపిడీ, అణిచివేతలు లేని గుణాత్మక ప్రజాస్వామ్య సాధన మన ఇప్పటి ప్రధాన పని. దాదాపు అరవై ఏండ్లుగా రాజకీయాలను తిరస్కరించిన ప్రత్యామ్నాయ మార్క్సిస్టు లెనినిస్టు, మావోయిస్టు (ఎమ్ఎల్ఎమ్) రాజకీయ ఆచరణ కూడా తీవ్రంగా బలహీనపడి ఉంది. అయితే ఈ రాజకీయాల మీద పార్లమెంటరీ రాజకీయాలు అంతిమ విజయం సాధించాయనీ, ఇక వాటి భవిష్యత్తు అంతా గొప్పగానే ఉంటుందనే విజయ గానాలు, ఆశ్వాసనాలు ఇచ్చే పరిస్థితిలో మనదేశం లేదు.. రాజ్యాంగ పరిధికి వెలుపల దీర్ఘకాల ప్రజా యుద్ధం ద్వారా పీడిత ప్రజల అధికార సాధన ద్వారానే పరివర్తన సాధ్యం కాదనేది స్థూలంగా ఎమ్ఎల్ఎమ్ పోరాట రాజకీయాల అవగాహన..
పరస్పర ఆరోపణలు మానండి!
వేలాది మంది ప్రాణాలకు తెగించిన తెగువతో ఇచ్చిన మద్దతు ఉండిన ఎమ్ఎల్ఎమ్ రాజకీయాలలో ఇన్ని ఏండ్లు ఆరితేరిన నాయకులు, ఆ రాజకీయాల పట్ల గౌరవప్రద విమర్శనాత్మక అవగాహన ఉన్నవారు ఇప్పుడు ఈ దేశంలో నియమ బద్ధ ప్రజాస్వామ్యం సాకారం చేసుకోవడం ఎట్లా అన్న అంశం గురించి ఒక నిజాయితీతో మేధో మథనం చేయాల్సిన స్థితి ఉన్నది. బహిరంగ జీవితంలోకి వచ్చిన మావోయిస్ట్‌లలో ఎవరు పవిత్రులు, ఎవరు అపవిత్రులు అనే పరస్పర ఆరోపణలు మాని జరిగింది ఏమిటి, జరగాల్సినది ఏమిటి? అని సంవాదం జరగాలి. ఎన్నికల రాజకీయాలకు, సాయధ పోరాట రాజకీయాలకు నడుమ ఒక విశాల రాజకీయ ఆచారణాత్మక ప్రపంచం ఉందని వారు గమనించాలి. ఇక ఈ రాజకీయాలలో ఎటువంటి వ్యక్తిగత ప్రతిఫలాలను ఆశించకుండా, కఠినమైన భౌతిక పరిస్థితులలో, ప్రాణాలకు తెగించి, సాయుధ, నిరాయుధ పోరాటాలు చేసిన ఎమ్ఎల్ఎమ్ రాజకీయాలకు ప్రత్యేకత ఉన్నది. అయితే ప్రాణాలకు తెగించడం ద్వారా మాత్రమే ఒక మనిషికి గొప్ప పరివార్తనాత్మక జ్ఞానం, ఆచరణ శక్తులు లభించవు అనే గమనింపు కూడా ముఖ్యమే..
ప్రజలు గమనిస్తూ ఉంటారు..
ఈ దేశంలో నాణ్యమైన ప్రజాస్వామ్యాన్ని నిలుపుకునే పనుల విషయంలో అజ్ఞాతం వదిలి, ఇప్పుడు విశాల ప్రజాక్షేత్రంలోకి వచ్చిన నాయకులకు కూడా ఎంతో బాధ్యత ఉంటుంది. అందువలన వారు మాట్లాడే మాటలను, వారు ప్రవర్తించే తీరులను పలుమార్లు జాగ్రత్తగా గమనించుకోవాలి. సానుకూల సామాజిక ఆర్థిక మార్పు ద్వారా, జీవితాలు మెరుగు చేసుకోవచ్చు అని ఆలోచించే జనం, వారిని గమనిస్తూ ఉన్నారని గుర్తు పెట్టుకోవాలి. నియమబద్ధ ప్రజాస్వామ్య పాలన, తద్వారా తెచ్చుకోవాల్సిన సానుకూల సామాజిక ఆర్థిక పరివర్తన కోసం వారు అనేక రకాల వైవిధ్యాలు ఉండే విశాల జనంతో కలిసి సాగాల్సి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి.
- డా. హారతి వాగీశన్,
అసిస్టెంట్ ప్రొఫెసర్, నల్సార్ యూనివర్సిటీ
9440253089






