- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వంట గ్యాస్ సిలిండర్ల కొరత తీరేనా?
మారుమూల పల్లెల నుండి మొదలుకొని పేరు మోసిన పట్టణాల్లో సైతం గ్యాస్ సిలిండర్ల వాడకం విరివిరిగా కొనసాగుతుంది.

మారుమూల పల్లెల నుండి మొదలుకొని పేరు మోసిన పట్టణాల్లో సైతం గ్యాస్ సిలిండర్ల వాడకం విరివిరిగా కొనసాగుతుంది. కానీ ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ల వాడకదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గ్యాస్ వినియోదారుల అవస్థలు అంత పట్టకుండా ఉండే పరిస్థితులు నేడు దాపరించాయి. ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతుండడమే వంటగ్యాస్ కొరతకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
గ్యాస్ బండపై యుద్ధం
ఈ యుద్ధాల వల్ల గ్యాస్ ఉత్పత్తుల్లో, అంతర్జాతీయ సరఫరా ప్రభావితం అవుతుంది. రష్యా , ఉక్రెయిన్, ఇజ్రాయెల్ వంటి దేశాల నుండి LPG, నాచురల్ గ్యాస్, కొద్దిపాటి పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా క్రమంగా తగ్గిపోతుంది. దీనివల్ల విదేశీ మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సరఫరా తగ్గుముఖం పట్టడం వల్ల గ్యాస్ సిలిండర్ డిమాండ్‌పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. భారతదేశంలో LPG గ్యాస్ దిగుమతి ఆధారిత వనరుగా ఉంది. తద్వారా కొన్ని దేశాల నుండి LPG గ్యాస్ సరఫరా నిలిచిపోయే ఆస్కారం ఉంది. దీనివల్ల LPG గ్యాస్ కొరత గణనీయంగా పెరుగుతూ వస్తుంది.
డీలర్ల వద్ద నిల్వలు తగ్గాయా?
ప్రస్తుతం సామాన్య కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకం గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తిస్థాయిలో లేక సతమతమవుతున్నారు. వృద్ధులు, నిరాక్షరాస్యులు ఎలా గ్యాస్ బుక్ చేసుకోవడం తెలియని పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. స్థానిక LPG డీలర్ల వద్ద నిల్వలు తగ్గడం వల్ల ఫోన్ లేదా ఆన్లైన్ బుకింగ్ ద్వారా గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రావడం చాలా కష్టంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో కనీసం బుక్ కావడం కూడా ఒక సవాలుగా దాపరించింది. టోల్ ఫ్రీ నెంబర్, ఐవిఆర్ఎస్, యాప్, ఇలా ఎన్నో రకాలుగా ఉన్న ప్రత్యామ్నాయాల ద్వారా కూడా ప్రయత్నం చేసినా బుక్ కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో కొరత అధికంగా ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు.
మళ్లీ పీచే ముడ్
ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో చాలామంది ప్రజలు మళ్ళీ పూర్వ కాలపు విధానాల ఏర్పాట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. వంట చెరుకు, గోబర్ గ్యాస్, విద్యుత్ వాడకపు సాధనాలను వినియోగిస్తూ వంట చేసుకుంటున్నారు. భవిష్యత్తులో LPG మార్కెట్‌పై అనూహ్య ప్రభావాలు సంభవించే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఇలానే యుద్ధం కొనసాగితే ధరలు అనియంత్రితంగా పెరిగే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో డీలర్ల వద్ద స్టాక్ తక్కువ ఉండడం వలన గ్యాస్ సిలిండర్ల ధర విషయంలో చేతివాటం చూపిస్తున్నారు. వాణిజ్య కేంద్రాలైన హోటల్, రెస్టారెంట్లు, హాస్టల్స్ యాజమాన్యాలతో కుమ్మక్కై గ్యాస్ సిలిండర్లను వారికి నచ్చిన ధరలతో సరఫరా చేస్తూ గృహ వినియోగదారులకు మొండి చేయి చూపిస్తున్నారు.
భయాలను తగ్గించాలి
దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి విషయాల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూటర్ల కేంద్రాలను పర్యవేక్షిస్తూ స్టాక్ రికార్డులను పరిశీలించాలి. డిస్ట్రిబ్యూటర్ల కేంద్రాల వద్ద సామాన్య ప్రజలు తమ పనులను వదులుకొని గంటల తరబడి వేచి ఉండి ప్రాధేయపడిన వారికి సరైన సమాధానం చెప్పే నాధుడు కరువయ్యాడు. ప్రభుత్వ అధికారులు వినియోగదారుల పరిస్థితులను వారి సమస్యలను దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది. వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదు నెంబర్లపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
వంశీకృష్ణ గౌడ్ బండి
95508 37962






