- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ శాసనసభలో ఇటీవల జరిగిన చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వేడిని రగిలించాయి. ముఖ్యంగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, డీపీఆర్ అంశాలపై ప్రతిపక్ష నేత కేటీఆర్ సంధించిన విమర్శలకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన 'మాస్' శైలిలో ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రి సీతక్క సైతం బీఆర్ఎస్ హయాంలో మహిళా లోకానికి జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా తూర్పురాబట్టారు.
ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజం, కానీ అవి అభివృద్ధికి ఆటంకం కాకూడదని ప్రతిపక్షాలు గ్రహించాలి. మూసీ ప్రాజెక్టు విషయంలో లక్ష కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు డీపీఆర్ ఎక్కడ? అంటూ అవహేళనగా ప్రశ్నించిన కేటీఆర్‌కు.. సీఎం రేవంత్ రెడ్డి తనదైన మాస్ లీడర్ శైలిలో గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. అధికారం కోల్పోయినా కేటీఆర్ మాటల్లో అదే అహంకారం ఉట్టిపడుతోందని, తాను ఈ స్థాయికి ఊరకే రాలేదని, క్షేత్రస్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ, తొక్కుకుంటూ వచ్చానంటూ బీఆర్ఎస్ భాషలోనే సమాధానం చెప్పారు.
అసత్య ప్రచారం చుట్టూ రాజకీయం
ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అనుసరిస్తున్న తీరు చూస్తుంటే, వారి రాజకీయ వ్యూహం అంతా 'అసత్య ప్రచారం' చుట్టూనే తిరుగుతోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ప్రజాదరణ కలిగిన మంత్రి, ఆదివాసీ బిడ్డ సీతక్కని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా అస్త్రంగా చేస్తున్న ఆరోపణలు వారి నైతిక పతనాన్ని సూచిస్తున్నాయి. అసలు రికార్డుల ప్రకారం అంగన్వాడీలకు మొబైళ్ల కొనుగోలు టెండర్ విలువ రూ.44 కోట్లు అని స్పష్టంగా ఉన్నప్పటికీ, కావాలనే ఆ విలువను రూ.54 కోట్లుగా చిత్రీకరిస్తూ బీఆర్ఎస్ నేతలు, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
అరోపణలు కాదు.. ఆధారాలు చూపాలి
అవినీతి జరిగిందని ఆరోపించినప్పుడు, దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలను ప్రజల ముందు ఉంచడం కనీస బాధ్యత. కానీ, అదనంగా ఖర్చయిందని చెబుతున్న ఆ ₹10 కోట్లకు సంబంధించిన ఒక్క కాగితాన్ని కూడా వీరు బయటపెట్టలేకపోతున్నారు. మొత్తం 38,130 ఫోన్లకు గానూ ప్రజా ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం రూ.44.42 కోట్లు మాత్రమే. ఒక్కో మొబైల్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.11,800 ధర సూచించగా, తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాలు రూ.11,800, జార్ఖండ్ రూ.11,732, రాజస్థాన్ రూ.11,730 పెట్టి కొనుగోలు చేశాయి. కానీ, తెలంగాణ ప్రజా ప్రభుత్వం కేవలం రూ.11,650ల తక్కువ ధరకే కొనుగులు చేయడం గమనార్హం. ఇందులో ఛార్జర్, యూఎస్బీ కేబుల్, మొబైల్ కేసు, స్ర్కీన్ గార్డ్ లాంటి సుమారు రూ.800-1200 విలువ చేసే యాక్సెసరీలతో పాటు రెండేళ్ల పాటు మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ సదుపాయం కూడా కల్పించారు.
సీతక్కపై ఎందుకింత కక్ష?
మంత్రి సీతక్క రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు. అడవి బిడ్డగా, సామాన్యుల కష్టాలు తెలిసిన నాయకురాలిగా ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ ఉంది. ఆమె శాఖలో జరుగుతున్న అభివృద్ధి పనులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మార్పును తీసుకొస్తున్నాయి. దీనికి తోడు అసెంబ్లీ సాక్షిగా.. గత బీఆర్ఎస్ హయాంలో మహిళల పట్ల చూపిన వివక్షను, అభయహస్తం పెన్షన్ డబ్బులు కాజేసిన తీరును సీతక్క ఎండగట్టారు. బహుశా ఇవే బీఆర్ఎస్ భయానికి కారణం కావొచ్చు. సీతక్కకు వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేక, ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వారు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అణగారిన వర్గం నుంచి వచ్చి, కష్టపడి పైకి ఎదిగిన ఒక మహిళా మంత్రిపై ఇలాంటి నీచమైన రాజకీయాలకు తెరలేపడం తెలంగాణ సంస్కృతికే విరుద్ధం.
పారదర్శకత మీనుంచి నేర్చుకోవాలా?
ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరుతో అంచనా వ్యయాలను అమాంతం పెంచేసిన వైనంపై ఆనాడు వారిని ప్రశ్నిస్తే, ప్రధాన ప్రతిపక్షమైన మా నోరు నొక్కిన వారు, నేడు పారదర్శకత గురించి మాట్లాడటం హాస్యాస్పదం. నిజానిజాలు తెలుసుకోకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రిని, ఒక మహిళా మంత్రిని లక్ష్యంగా చేసుకుని, తప్పుడు అంకెలను ప్రచారం చేసినందుకు బీఆర్ఎస్ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాజకీయాల్లో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. ((అభివృద్ధికి సహకరించకపోయినా పర్వాలేదు కానీ, చేస్తున్న పనులను అడ్డుకోవడం, నిరంతరం సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వంపై అభాండాలు వేయడం సరికాదు.)) తప్పుడు ప్రచారమే పెట్టుబడిగా రాజకీయాలు చేయాలనుకుంటే, రాబోయే రోజుల్లో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారు.
-ఇందిరా శోభన్,
కాంగ్రెస్ సీనియర్ నేత.






