- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

రాజ్యాధికారమే అన్ని సమస్యలకూ తాళం చెవి వంటిది. దాన్ని సాధించడమే మన మొదటి లక్ష్యం కావాలన్నారు అంబేద్కర్. ప్రజాస్వామ్య భారతంలో తరాలు, స్వరాలు మారుతూనే ఉన్నాయి.. కానీ నేటికి మన దేశంలో అందరికీ విద్యా, ఉద్యోగ, ఉపాధి, వైద్యం తదితర రంగాల్లో సమాన అవకాశాలు లభించడం లేదు.. పరిపాలన అనేది కొందరి ఆదిపత్య, అగ్రవర్ణ కులాలతోనే నడుస్తుంది. బహుజనుల బతుకుల్లో పెద్దగా మార్పు రావటం లేదు..
ఇప్పటికీ కుల వివక్షతకు సంబంధించిన అనాగరిక, అమానుష సంఘటనలు దేశం నలుమూలల అక్కడక్కడ, అప్పుడప్పుడూ దర్శనమిస్తూనే ఉన్నాయి..! గత కొన్ని సంవత్సరాలుగా ఈ దేశ రాజకీయ చదరంగం జనాభా దామాషా పద్ధతి అంటూ బీసీల చుట్టూనే తిరుగుతుంది. బీసీ ప్రధాని, బీసీ ముఖ్యమంత్రి, బీసీల కుల గణన అంటూ.. ఇలా ఎన్నో పతాక శీర్షికలతో, రాజకీయ వ్యూహాలతో దేశ, రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారాయి..
రాజ్యాధికార లక్ష్యంతోనే..
బీసీల పోరాటం కొన్ని అగ్రకులాలకు వ్యతిరేకంగా భావోద్వేగం మాత్రమే కాదు..! దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓ బతుకు పోరాటం. దేశ జనాభాలో సగభాగంపైనే ఉన్న బీసీ వర్గాల్లో ఈ మధ్య కాలంలో రాజకీయ చైతన్యంలో భాగంగానే రిజర్వేషన్ల ఉద్యమం - మా వాటా మాకు దక్కాలి బలంగానే వినిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా తెలంగాణలో బీసీల గుండెచప్పుడు ఓ ఆత్మాభిమాన విప్లవంగా మారింది. దానికి నిదర్శనంగా సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించవచ్చు.. బీసీల పేరిట ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు, సంఘాలు కొత్తగా ఏర్పడుతున్నాయి. కుల సంఘాల మీటింగ్‌లు రెగ్యులర్‌గానే జరుగుతున్నాయి.
సామాన్య వ్యక్తుల మొదలు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ల వరకు బీసీల సామాజిక న్యాయ ప్రయాణంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. రాజ్యాధికార ఏకైక లక్ష్యంతోనే విజయవంతంగానే ముందుకు పోతుంది. విశ్వ విద్యాలయాల స్థాయిలో కూడా బీసీ వాదం ప్రస్ఫుటంగానే కనిపిస్తుంది. బీసీల సంస్కృతి, చరిత్ర, కులవృత్తుల తదితర అంశాలపై పుస్తకాలు తీసుకొస్తున్నారు.. వివిధ పత్రికల్లో పరిశోధనాత్మక వ్యాసాలు రాస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం బీసీ వాదం - బీసీ నాదం సామాజిక న్యాయమై ప్రతిధ్వనిస్తుంది. బీసీల అభివృద్ధికై.. బీసీల రాజ్యాధికారమే ధ్యేయంగా కొత్తగా రాజకీయ పార్టీలే వస్తున్నాయి.
బీసీ సంఘాల డిమాండ్ కారణంగా..
కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు సంబంధించిన బడ్జెట్, సబ్ ప్లాన్‌పై వివిధ రాజకీయ పార్టీల నాయకుల చర్చలు వాడి వేడిగానే జరుగుతున్నాయి. తెలంగాణలో బీసీ వార్షిక బడ్జెట్ 20 వేల కోట్ల రూపాయలకు పైగా కేటాయించాలనీ, అన్ని రంగాల్లో, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపరచాలనీ.. జనాభా లెక్కల సేకరణ తొలిదశలో భాగంగా నేటి నుంచి దేశ వ్యాప్తంగా ప్రారంభించే కుటుంబాల లెక్కింపులో బీసీ కుటుంబాల వివరాలను సేకరించేలా ప్రశ్నావళిలో మార్పులు చేయాలనీ.. బీసీ సంఘాల నుంచి డిమాండ్ చాలా బలంగా ప్రతీ రోజూ వినిపిస్తుంది. నేడు సమాజంలో బీసీలపై జరుగుతున్న అనాగరిక దాడులను, కొందరి అగ్ర కులాధిపత్య ధోరణులను అరికట్టడానికి ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీ పరిరక్షణ చట్టం ప్రభుత్వాలు తీసుకురావాలనే ప్రతిపాదన కూడా నేటి రాజకీయంలో భాగమైంది.
ఇప్పుడు ప్రతీ రాజకీయ పార్టీ మాది బీసీల పక్షం-మాది బీసీల ప్రభుత్వం అంటూ తెలివిగా పావులు కదుపుతుంది. తమ పార్టీలకు అనుబంధంగా బీసీ సంఘాలను నిర్మించుకుంటున్నాయి. అయితే కొంతమంది బీసీ నాయకులు కూడా తమ రాజకీయ స్వార్థం కోసం బీసీ వాదం పేరుతో ఆటలాడుతున్నారు.. బీసీ సంఘాల్లో కూడా కొన్ని కుల నాయకుల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.
బీసీల రాజకీయం ప్రారంభమైంది!
అధికారం అందరికీ సమానంగా పంచబడే వరకు నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యం కాదంటారు మహాత్మా గాంధీ. ఎనిమిది దశాబ్దాలకు చేరువవుతున్న స్వాతంత్ర్య భారతంలో ఇన్నాళ్లు కొన్ని కులాలు మాత్రమే బీసీలతో రాజకీయం చేస్తూ అందలమెక్కాయి. ఇప్పుడు బీసీల రాజకీయం ప్రారంభమైంది. బీసీల పోరాటం కొన్ని అగ్రకులాలకు వ్యతిరేకంగా భావోద్వేగం మాత్రమే కాదు..! దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓ బతుకు పోరాటం. విద్య, రాజకీయ, పరిపాలన, ఉద్యోగ, ఉపాధి రంగాలతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కూడా బీసీలు సమాన అవకాశాలు పొంది, తమ ప్రతిభా విశేషాలతో గ్లోబల్ లీడర్స్‌గా ఎదగాలి. ఇన్నాళ్లు పనివాళ్లుగా గుర్తించబడ్డ బీసీలు పాలకులుగా, కంపెనీల సృష్టికర్తలుగా, అనంత విశ్వాన్ని శోధించే శాస్త్రవేత్తలుగా.. అన్నింటిలో, అన్ని రంగాల్లో తమ సత్తాను చూపించాలి. అందరికీ సమానంగా అవకాశాలు ఉంటే.. ప్రతిభ.. పాలన.. ఏ ఒక్కరి సొత్తు కాదనీ నిరూపించాలి. సైద్ధాంతికంగా విభిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, బీసీలంతా ఐకమత్యంతో బీసీ వాదమే ఎజెండాగా ముందుకు కదలాలి. ఇప్పుడిది స్వాతంత్ర్య ప్రజాస్వామ్య భారతంలో మెజార్టీ ప్రజలు అహింసాయుతంగా.. శాంతి, సామరస్యంతో సామాజిక న్యాయం కోసం చేస్తున్న మరో స్వాతంత్ర సంగ్రామం...!
-ఫిజిక్స్ అరుణ్ కుమార్
93947 49536
- Tags
- bc politics
- BC






