రెడ్డి హాస్టల్ వ్యవస్థాపకుడు రాజా బహద్దూర్ గురించి తెలుసా!

by Ravi |   (  Updated:2022-09-03 13:36:16  IST  )

పదవులు, ప్రశంసలు క్షణ భంగురములుగా ఎంచి, చేపట్టిన పోలీసు పదవిలోనున్న అధికారాన్ని తన రాజ్య ప్రజల సేవకు ఉపయోగించుటలో చిత్తశుద్ధి ప్రదర్శించిన

రెడ్డి హాస్టల్ వ్యవస్థాపకుడు రాజా బహద్దూర్ గురించి తెలుసా!
X

దవులు, ప్రశంసలు క్షణ భంగురములుగా ఎంచి, చేపట్టిన పోలీసు పదవిలోనున్న అధికారాన్ని తన రాజ్య ప్రజల సేవకు ఉపయోగించుటలో చిత్తశుద్ధి ప్రదర్శించిన ప్రజాసేవా దురంధరుడు రాజా బహద్దూర్‌ పాశం వెంకటరామారెడ్డి. అమీన్‌ కొలువుతో ఆరంభమైన ప్రస్థానం అత్యున్నత స్థాయి గల కొత్వాలు హోదాకు చేరుకున్నది. సుమారు 50 సంవత్సరాల పాటు ఆయన రాయచూరు, పాలమూరు, నిజామాబాద్, బీదరు, ఔరంగాబాద్, ఎల్గందల్‌లో సదర్ పోలీస్ ( సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా పని చేశారు. తరువాత సహాయ కొత్వాలుగా, కొత్వాలుగా హైదరాబాద్‌లో నియమితులయ్యారు. ఏడవ నిజాం పాలనలో ప్రతిష్టాత్మక పదవిని చేపట్టిన ఏకైక హిందూ పోలీసు అధికారిగా పేరుగాంచారు.

చట్టాలపై గౌరవముంచాలని

'సంక్లిష్ట భరిత పోలీసు బాధ్యతల నిర్వహణలో ప్రతి పోలీసు అధికారి ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. సమస్యలను ఎదుర్కోవడంలో ప్రతి పోలీసు అధికారి తన విధులను అర్థం చేసుకోవాలి. బాధ్యతలను గుర్తెరగాలి. అవరోధాలను అంచనా వేసి ప్రతిబంధకాలను దాటాలి. అందుకు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. కార్యదక్షతతోపాటు నాయకత్వ పటిమను ప్రదర్శించగల ధీరోదాత్తుడే విజయ శిఖరాన్ని అధిరోహించగలుగుతాడు. లేనిచో విమర్శల ఊబిలో ఇరుక్కొనిపోతాడు. అన్నీ మంచి పనులు చేస్తూ పోలీసు శాఖ కీర్తిని ఇనుమడింప జేయుటకు వ్యక్తిగతంగానే కాక, తన హోదాకు తగిన విధంగా ఉండాలి.

అందరికీ, ముఖ్యంగా నిజాంకు ఆమోదయోగ్య గుణశీలతలను కలిగి ఉండాలి. చట్టం మీద గౌరవముంచాలి. ఆదర్శనీయతను పంచాలి. సమర్థ నాయకుడిగా, స్ఫూర్తి ప్రదాయకుడిగా, నీతి నిజాయితీలకు మారుపేరుగా, అనాథ రక్షకుడుగా, ఉదారబుద్ది గలవాడుగా ఉండాలి. వేష గుణ సంపన్నుడుగా, స్థిరమైన మనోవైఖరి గలవాడుగా, పరువు ప్రతిష్టలకు ఆనవాలుగా, సమర్హతతో గూడిన వృత్తి నిపుణత గలవాడుగా, ప్రజారక్షణ బాధ్యతల నిర్వహణలో ఆత్మత్యాగానికి సైతం సిద్దపడగల ఉత్తమ పోలీసు అధికారిగా వ్యవహరించాలి. బాధితులకు న్యాయం చేయుటలో స్వీయ దిశా నిర్దేశకుడుగా, ధృఢ సంకల్పంతో ముందుకు సాగుతూనే ఉండాలి. ఆయన నిర్ణయాలు, చర్యలు ప్రజానీకాన్ని ఆకట్టుకొనగలిగి ఉండాలి. పరిపాలనలో అతనొక కేంద్ర బిందువుగా ప్రజలకు గోచరించాలి. వృత్తిలో ఉన్న పవిత్రతకు అతనిలోనున్న సమర్థతను జోడించి బాధ్యతల నిర్వహణ బాటలో పయనించే ప్రతి పోలీసు అధికారి ఆదర్శనీయుడుగా ఎంచబడతాడు' అని ఆయన ప్రబోధించేవారు.

నిజాం మన్ననలు పొందుతూ

తన సుదీర్ఘ సేవా కాలంలో, అట్టి విశేష గుణములను ప్రదర్శించి అన్ని వర్గాల ప్రజలకు సన్నిహితుడుగా మెదిలారు వెంకటరామారెడ్డి. నిజాం గౌరవానికి పాత్రుడయ్యారు. హైదరాబాద్‌ సంస్టానంలోనే కాకుండా యావత్‌ భారతదేశ పోలీసు పరిపాలనా చరిత్రలో ధృవతారగా నిలిచారు. ఇంగ్లాండు యువరాజు హైదరాబాద్‌ నగర సందర్శన విషయంలో నిజాం ప్రభువుకు ఎదురైన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడినారు. హత్యారోపణ ఎదుర్కొంటున్న గురుగుంట సంస్థానం యువరాజును అతని కోటలో అరెస్టు చేయుటలో ప్రదర్శించిన సమయస్ఫూర్తి, హైదరాబాద్‌ పరిసర ప్రాంతం చెన్నరాయని గుట్ట వద్దనున్న పోలీసు పటాలంలో గల ముద్దాయిని అరెస్టు చేయుటకు వెళ్లినపుడు సిపాయిల తిరుగుబాటును ఎదుర్కొన్న తీరు ప్రశంసనీయం. వారు తనకు సహకరించు విధంగా మార్చుకున్న విధానంతో, కుల, మతాల ఘర్షణలకు తావీయని ముందస్తు చర్యలతో ప్రభువు మదిని దోచుకున్నారు. సద్గుణభరిత, సమర్థవంతమైన వారి సేవలకు ప్రసన్నుడైన నిజాం వెంకటరామారెడ్డి గారిని 'రాజా బహద్దూర్' బిరుదుతో సత్కరించారు. పదవీకాలాన్ని పొడిగించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. హైదరాబాద్‌ సంస్టానంలో ఇంగ్లిషువారి పరిపాలన అవసరాలకు చేదోడు వాదోడుగా ఉంటూ అందించిన సేవలకు గాను బ్రిటిష్‌ రాణి 'అర్డర్ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌' గౌరవాన్ని వెంకటరామారెడ్డికి ప్రసాదించారు.

సేవా కార్యక్రమాలు సైతం

బీద జనవాళిని ఆదుకోవాలంటే వారి పిల్లలు హైదరాబాద్‌‌లో విద్యనభ్యసించుటకు ఆవాస సదుపాయము అవసరమని ఎంచి 1918 జూన్‌ 6న బాలురకు అబిడ్స్‌ ప్రాంతంలో రెడ్డి హాస్టల్‌ను స్థాపించారు. సుమారు 22 సేవా సంస్థలను, విద్యా సంస్థలను స్టాపించి, వాటికి అధ్యక్షులుగా కొనసాగి, వాటి పురోగమనానికి గట్టి పునాదులు వేశారు. బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వారికి హాస్టల్‌ సదుపాయాల నేర్చరచి పాఠశాలలు, మహిళా కళాశాలలను స్థాపించినారు. మహిళా వికాసమే కుటుంబ వికాసమను నినాదంతో జిల్లాలలోనూ బాలికల విద్యాలయాల స్థాపనకు పిలుపునిచ్చారు. వారు స్థాపించిన సంస్థలన్నింటా కులమతాలకతీతంగా వసతులు కల్పించబడేవి.

ఏవీ కాలేజీ, మాడపాటి హన్మంతరావు హైస్కూల్‌, రెడ్డి మహిళా కళాశాల, పరోపకారిణి పాఠశాల తదితరములు ముఖ్యమైనవి. నిజాం రాజ్యంలో మితవాదులకు, అతివాదులకు అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఉభయ పక్షాల మధ్య సామరస్యానికి కృషి చేసినారు. గ్రంథాలయోద్యమానికి ప్రోత్సాహమందించారు. ప్రజలలో పఠనాసక్తిని పెంపొందించారు. సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాలకు అండగా ఉన్నారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. అస్పృశ్యత నివారణకు కృషి చేశారు. హరిజనోద్దరణకు ఏర్పడిన సంఘములకు సహాయమందించారు. అనాథ బాలల ఆశ్రమాలు, కుష్టు నివారణ సంఘము, జంతు హింసా నివారణ సమితి వంటి సంస్థలకు సహకరించారు. గోలకొండ పత్రికకు ధన సహాయం చేసి, దాని అభివృద్ధికి విశేష కృషి చేశారు.

దానగుణ సంపన్నుడు

ఆ కాలంలో అతని వలన సహాయం పొందని తెలుగు సంస్థ లేదనుట అతిశయోక్తి కాదు. గొప్ప వదాన్యుడుగా, ఇంగితము గలవాడుగా, సంభాషణ చతురుడుగా, చక్కని క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా, సమర్ధ పోలీసు అధికారిగా, లౌకిక పరిజ్ఞానం కలవాడుగా, ప్రజా సేవాతత్పరత కలవాడుగా, సర్వ సమాన భావం కలవాడుగా పేరుగాంచారు. హైదరాబాద్‌ రాజ్యంలో తెలుగు ప్రజల పాలిట పెన్నిధిగా, ఇతరులకు సద్భుద్ది నీయగల సమన్వయకర్తగా, సమర్థ పాలకుడుగా అనన్య కీర్తి ప్రతిష్టలను పొందారు.

హైదరాబాద్‌ రాజ్యం లోపలనే కాకుండా ఇతర రాజ్యాలలో సైతం సృజన శీలత గల కొత్వాలుగా, సంఘ సేవకుడుగా బహు ప్రాచుర్యాన్ని పొందినారు. దానికి గుర్తింపుగా నారాయణగూడ చౌరస్తాలో ప్రజలు స్వచ్చందంగా రాజా బహద్ధూర్‌ వెంకటరామరెడ్డి, కొత్వాలు గారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడం పోలీసు శాఖకు ఎంతో గర్వకారణం. 22-08-1869 రోజున వనపర్తి జిల్లా రాయణి పేట గ్రామంలో పాశం కేశవరెడ్డి బారమ్మ దంపతులకు జన్మించి, ఆస్తి పాస్తులకు అంటరాని వాడై 02-06-1953 రోజున పరమపదించారు. తెలంగాణ దీప స్థంభంగా ప్రసిద్ధి చెందారు. భౌతికంగా నేడు వారు మన ముందు లేకున్ననూ వారు చేసిన సేవలు, స్థాపించిన సంస్థలతో ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు.

(రేపు రాజా బహద్దూర్‌ పాశం వెంకటరామారెడ్డి జయంతి)


పెద్దిరెడ్డి తిరుపతిరెడ్డి

94400 11170

Next Story